జనసేనాని ఢిల్లీ పయనం, ఎందుకో తెలుసా..?

సోమవారం, 23 నవంబరు 2020 (22:15 IST)
భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో బాగానే టచ్‌లో ఉన్నారు పవన్ కళ్యాణ్. బిజెపి జాతీయఅధ్యక్షుడు నడ్డాతో రేపు ఆయన సమావేశం కానున్నారు. ఢిల్లీలో నడ్డాను కలువనున్నారు పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
 
పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల వేళతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పయనం ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు తిరుపతి ఎంపి సీటుకు ఉప ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ బిజెపి నేతలను కలవనుండడం ఆసక్తికరంగా మారుతోంది. 
 
అయితే జిహెచ్ఎంసిలో జనసేన పార్టీ కార్యకర్తలు పోటీ చేయకుండా బిజెపి నాయకులే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం.. అందుకు పవన్ కళ్యాణ్ సహకరించడం జరిగాయి. దీంతో తిరుపతి ఉపఎన్నికల్లోనైనా తమ అభ్యర్థి పోటీ చేసే విధంగా అవకాశం కల్పించాలని బిజెపి అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపేందుకే పవన్ కళ్యాణ్ వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
ముఖ్యంగా తిరుపతిలో కాపు సామాజికవర్గం వారు ఎక్కువగా ఉండటం, దాంతో పాటు గతంలో తన అన్నయ్య చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం లాంటివి జరిగాయి. ప్రస్తుతానికి జనసేనకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఆ ఎమ్మెల్యే కూడా పార్టీతో టచ్‌లో లేకపోవడం.. ఇక ఎంపి సీటును ఎలాగైనా గెలిచి పార్లమెంటులో ప్రజావాణిని జనసేన నుంచి వినిపించాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. అందుకే ఢిల్లీకి వెళ్ళినట్లు ప్రచారం సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు