రిటైర్మెంట్ తర్వాత నిమ్మగడ్డను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమిస్తారేమో..!?: విజయసాయిరెడ్డి
శనివారం, 21 నవంబరు 2020 (06:16 IST)
పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని, అక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సమంజసమేనని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఆయన మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..
1. - జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి మంత్రమే ధ్యేయంగా, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రభుత్వం. కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ఎక్కడా నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా, స్వార్థపూరితంగా, తమ వర్గ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ, జూమ్ మీటింగ్ లలో విమర్శలు చేస్తూ, వేరే రాష్ట్రం నుంచి పనిచేస్తున్న టీడీపీ ఎన్ఆర్ఐ పార్టీగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ లు అప్పుడప్పుడూ వచ్చే గెస్టులుగా తయారయ్యారు.
2. - పోలవరం పూర్తి అవుతోందంటే.. చంద్రబాబు, ఆయన కుమారుడికి బాధగా, కడుపు మంటగా ఉంది. వారి మనసు అల్లకల్లోలం అవుతుంది. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు గతంలో ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పిటీషన్లు వేయించింది చంద్రబాబే. వైయస్ఆర్ హయాంలోనూ సుప్రీంకోర్టులో పిటీషన్లు వేయించిందీ చంద్రబాబే..
-పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వుతుంటే.. ఆ కాలువ పనుల్లో 20 నుంచి 30 శాతం పనులు జరగకుండా భూసేకరణను అడ్డుకుని ఆ ప్రాజెక్టుకు 2004-09 మధ్య అడ్డుపడింది కూడా చంద్రబాబే.
-అటువంటి చంద్రబాబుకు, ఈరోజు పోలవరం దగ్గర 150 అడుగుల వైయస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం అంటే ఎంత కడుపు మంటగా ఉందో, అతనికి నిద్ర కూడా పట్టడం లేదన్నది ప్రజలంతా చూస్తున్నారు.
- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడ్ని 150 అడుగుల లోతున గోతిలో పాతేసిన ఘనత చంద్రబాబుది అయితే, ఈ రాష్ట్రం గర్వించదగ్గ ప్రాజెక్టు కట్టి వైయస్ఆర్ ని 150 అడుగుల ఎత్తున నిలబెట్టే ఘనత జగన్ ది.
- చంద్రబాబు నాయుడు ఒక నెగిటివ్ పర్సన్. పాజిటీవ్ ధృక్పథం ఎక్కడా లేదు.
- పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త వైయస్ఆర్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. 2018లోనే పూర్తి చేస్తామని, సోమవారం పోలవరం అంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పేపర్ ప్రకటనలకే పరిమితం చేశారు తప్పితే, 5 ఏళ్ళ కాలంలో పూర్తి చేయలేకపోయారు.
3.- స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ పదవిలో కూర్చుని చంద్రబాబు తొత్తుగా, ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ, టీడీపీకి అధికార ప్రతినిధిగా, చంద్రబాబు ఎన్నికలు జరపమంటే జరుపుతాను, ఆపమంటే ఆపుతాను అన్నట్టుగా, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులతో స్టార్ హోటళ్ళలో రహస్య మీటింగ్ లు నిర్వహించి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాడు.
- తెలుగుదేశం, సీపీఐ లాంటి పార్టీలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. చాలా ఆశ్చర్యంగా ఉంది.
-నిమ్మగడ్డ రమేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాలుగు-అయిదు నెలల్లోనే, ఆయన రిటైర్మెంట్ తర్వాత నియమించడం ఖాయం అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలానే, ఎన్టీఆర్ ను చంద్రబాబు దింపేసి పార్టీని లాక్కున్నట్టే.. నాలుగు నెలల తర్వాత టీడీపీ తెరవెనుక పెద్దలంతా బాబును దింపి నిమ్మగడ్డ రమేష్ ను కూర్చూబెట్టడం ఖాయం అనిపిస్తోంది.
- కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తై, పోలింగ్ ప్రారంభమయ్యే దశలో చంద్రబాబు డైరెక్షన్ లో ఆరోజు ఎన్నికలను నిమ్మగడ్డ అడ్డుకున్నాడు. ఈరోజు ఢిల్లీ, ఇతర నగరాల్లో వందల మంది చనిపోతుంటే ఎన్నికలు జరుపుతానని మంకుపట్టు పడుతున్నాడు.
- ప్రజల శ్రేయస్సు నిమ్మగడ్డకు పట్టదు. రాజకీయాలే ఆయనకు ముఖ్యం. నిమ్మగడ్డ ఇప్పటికైనా తన పంథా మార్చుకోవాలి.
4. - ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు.. ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్ళను పేదలకు ఇస్తుంటే.. టీడీపీకి ఆ కాస్త మిగిలిన 20 సీట్ల గుండె ధైర్యం కూడా పోయినట్టుంది. ఈ రాష్ట్ర చరిత్రలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వవొద్దని అడ్డుపడిన ఏకైక పార్టీగా టీడీపీ మిగిలిపోతుంది. దళిత వర్గాలకు, బీసీలకు, పేదలకు టీడీపీ చేసిన ద్రోహం మీద ఎక్కడికక్కడ పేదలు నిలదీయాలి.
గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇలానే పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటే భవిష్యత్తులో 2 సీట్లకు ఆ పార్టీ పరిమితం అవుతుంది.
- దేశ చరిత్రలో పేదలకు ఇళ్ళు ఇస్తామంటే అడ్డుకునే అభివృద్ధి నిరోధకుడు, పేదల వ్యతిరేకి చంద్రబాబే. ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు అనర్హుడు.
5. - విశాఖపట్నం ఎయిర్ పోర్టు నేవీ ఎయిర్ పోర్టు. అటు రాష్ట్ర ప్రభుత్వానిదిగానీ, ఇటు కేంద్రానిదిగానీ కాదు. నేవీ నిబంధనలు కఠినతరంగా ఉండటం వల్ల ల్యాండింగ్, టేకాఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. రాష్ట్రానికిగానీ, కేంద్రానికి గానీ ఒక ఎయిర్ పోర్టు ఉండాలన్న మంచి ఉద్దేశంతో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా భోగాపురం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కమర్షియల్ ఆపేరషన్స్ ను తరలించడం అన్నది సంప్రదాయం. హైదరాబాద్ లో కూడా పాత బేగంపేట ఎయిర్ పోర్టును శంషాబాద్ కు తరలించారు.
- చంద్రబాబుకు, యనమలకు వయసు పై బడటం వల్ల మతి భ్రమించింది. ఒక సబ్జెక్టు మీద మాట్లాడేటప్పుడు కనీస అవగాహన చేసుకోండి. తెలిసీ తెలియకుండా ఏదిపడితే అది మాట్లాడవద్దు. రాజకీయ నేతలుగా ఉంటూ.. మీ పరువును మీరే తీసుకోవద్దు.
- భోగాపురం ఎయిర్ పోర్టును చంద్రబాబు అసమర్థత వల్ల, కట్టలేక వదిలేస్తే, ఆ ప్రాజెక్టును ఈరోజు ముఖ్యమంత్రి జగన్ నిజం చేస్తున్నారు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా, విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు, ఇతర ప్రతిపక్షాలకు లేదు.
6. - సీఎం జగన్ ఆదేశాల ప్రకారం.. విశాఖపట్నాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, అభివృద్ధిపరంగా విశాఖను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా పరిశ్రమలకు సంబంధించిన సమస్యలు, కొత్తగా పరిశ్రమలను ఎలా తీసుకురావాలి, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఎలా అభివృద్ధి చేయాలి.. అన్న అంశాలపై నవంబరు 21న ఇంటరాక్టివ్ సెషన్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నాం.
- పరిశ్రమలకు లాభార్జనే కాకుండా, సామాజిక బాధ్యతగా, సమాజ అభివృద్ధికి, విశాఖ అభివృద్ధికి ఎలా తోడ్పాడతారన్న అంశాలపై చర్చిస్తాం. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి ఐపీఆర్ చైర్ రావడం చాలా గొప్ప విషయం. ఆంధ్రా యూనివర్సిటీలో స్టార్టప్ సెంటర్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్రారంభించడం జరుగుతుంది.
- ప్రపంచంలో ఉన్న నగరాల్లో విశాఖ మంచి నివాస యోగమైన పట్టణంగా గుర్తింపు రావడం చాలా సంతోషం.
7. -ముఖ్యమంత్రి జగన్ విజనరీ. విశాఖపట్నంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో ఇక్కడకు వచ్చి ఆయన ప్రారంభిస్తారు.
- విశాఖలో లా అండ్ ఆర్డర్ చాలా ఫరఫెక్ట్ గా ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దు. ఎవరైనా పాల్పడితే, అటువంటి వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది. చట్టానికి లోబడి పనిచేసే వారికి ప్రభుత్వం సహకరిస్తుంది.
- విశాఖ నగరంలో కొన్ని భూ కుంభకోణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నాకు భాగస్వామ్యం ఉందని కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు ఎటువంటి వ్యాపారం లేదు. నా పేరు ఉపయోగించుకుని, నాకు భాగస్వామ్యం ఉందని ఎవరైనా చెబితే నమ్మవద్దు. విశాఖలో నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీతో కలిసి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అటువంటి ప్రచారాలను నమ్మవద్దు. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ, బినామీలతోగానీ ఎటువంటి వ్యాపారం చేయను. ఇటువంటి వాటికి సంబంధించి నా పేరు ఎవరు చెప్పినా, నాకుగానీ, పోలీసులకుగానీ తెలియజేయండి, అటువంటివారిపై కేసులు పెట్టడం జరుగుతుంది.