నెరవేరిన శపథం... సీఎంగా చంద్రబాబు - ఐదేళ్ళ తర్వాత పుట్టింటికి మహిళ!

వరుణ్

ఆదివారం, 16 జూన్ 2024 (09:53 IST)
ఓ మహిళ ఐదేళ్ల క్రితం చేసిన శపథం నెరవేరింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారంటూ ఆమె చేసిన శపథం ఫలించింది. ఆమె శపథం ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో నిజమైంది. ఏపీ ముఖ్యమంత్రిగా మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ మహిళ ఐదేళ్ల తర్వాత మళ్లీ పుట్టింటికి రాగా, ఆమెకు కుటుంబ సభ్యులతో పాటు.. ఆ గ్రామస్థులు కూడా ఘన స్వాగతం పలికారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, కేశవపురానికి చెందిన విజయలక్ష్మికి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన పెదనాటి నర్సింహారావుతో వివాహమైంది. ఐదేళ్ళ క్రితం తన ఇద్దరు కుమారులతో కలిసి కేశవాపురంలోని సోదరి నివాసానికి వెళ్లింది. అక్కడ మాటల సందర్భంలో వచ్చేసారి మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటూ విజయలక్ష్మి అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె అక్క కుమారుడు ప్రసాద్.. మాత్రం కాదు మళ్లీ జగనే వస్తారన్నారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అపుడు ఆ మహిళ ఓ శపథం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం అయ్యాకే మళ్లీ ఊళ్లో అడుగుపెడతానని శపథం చేశారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయిన ఆమె.. ఈ ఐదేళ్లలో పుట్టింటిలో జరిగిన ఏ ఒక్క శుభ, కీడు కార్యాలకు హాజరుకాలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో విజయలక్ష్మి శనివారం తన స్వగ్రామానికి వచ్చారు. తాను పట్టిన పంతం వీడిందని, చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆ గ్రామస్థులు కూడా ఆమెకు ఘన స్వాగతం పలికారు. అలాగే, బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆ తర్వాత పుట్టింటిలో అడుగుపెట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు