దేశంలోనే తొలి ప్ర‌యోగం... వార్డు స‌చివాల‌యంలో మ‌హిళా పోలీస్ వ్య‌వ‌స్థ‌!

గురువారం, 13 జనవరి 2022 (15:38 IST)
ఏపీ ప్ర‌భుత్వం మహిళా పోలీసు వ్యవస్థపై మరింత స్పష్టత నిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మహిళా పోలీస్ వ్యవస్థను పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తూనే, వారి సేవలను మరింత సమర్థవంతంగా గ్రామ వార్డ్ సచివాలయాలలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వం నిబంధ‌న‌ల‌ను త‌యారుచేసింది. దీనితో ఇక సాధార‌ణ పోలీసు శాఖకు అనుసంధానంగా మహిళా పోలీస్  వ్యవస్థ ఉండ‌బోతోంది.
 
 
ఇక నుండి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో మహిళా పోలీసులు విధులు నిర్వహించనున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను స్వాగతిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీసులు, పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 
దీనిపై ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ మాట్లాడుతూ, యూనిఫామ్ అనేది ఒక గౌరవం అని, సగర్వంగా యూనిఫామ్ ధరించి, ప్రజా సేవలో పునరంకితమవ్వాల‌ని సూచించారు. మహిళా పోలీసులకు పోలీస్ శాఖలో తగిన గౌరవం ఉంటుంద‌న్నారు. పోలీసు శాఖలోని పదోన్నతులతో సంబంధం లేకుండా మహిళా పోలీసుల కోసం ప్రత్యేకంగా పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంద‌ని తెలిపారు. మహిళా పోలీసులకు పదోన్నతుల కోసం ప్రత్యేకంగా సీనియర్ మహిళా పోలీస్, ఎఎస్పై, ఎస్‌ఐ, ఇన్స్పెక్టర్ పోస్టులను రూపొందించిన‌ట్లు తెలిపారు. 
 
 
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వమే అని డీజీపీ పేర్కొన్నారు. నాలుగు నెలల శిక్షణలో భాగంగా మొదట మూడు నెలలు పోలీస్ కళాశాల  శిక్షణ, మరో నెల రోజుల పాటు క్షేత్రస్థాయి శిక్షణ ఉంటుంద‌న్నారు. 

 
పోలీసు శాఖలోని పదోన్నతులతో సంబంధం లేకుండా, మహిళా పోలీసుల కోసం ప్రత్యేకంగా పదోన్నతుల  పోస్టులను కల్పించడంపై పోలీస్ అధికారుల సంఘం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. సామాన్యులకు మెరుగైన సేవలు అందిస్తూనే, మహిళలు, చిన్నారులు అట్టడుగు వర్గాల రక్షణ ధ్యేయంగా మహిళా పోలీస్ వ్యవస్థను ఒక అద్భుతమైన వ్యవస్థగా తీర్చిదిద్దుతామ‌ని డీజీపీ ధీమా వ్య‌క్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు