రక్తదానం చేసి ప్రాణాలను కాపాడండి: యువతకు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ విజ్ఞప్తి

శనివారం, 13 జూన్ 2020 (20:11 IST)
అన్ని దానాలలో కెల్లా అత్యంత విలువైన రక్తదానంతో ప్రాణాలను నిలబెట్టవచ్చని, నేటి యువత క్రమం తప్పకుండా రక్తదానాన్ని ఆచరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ రక్తదాత దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, రక్తం దానం చేసి ప్రాణాలను కాపాడటానికి యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
 
రక్త నిల్వలు లేని కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని గవర్నర్ అభిలషించారు. ప్రధాన రక్త సమూహాలను వేరు చేసిన ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త, వైద్యుడు, రోగనిరోధక శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1900లో రక్తకణాల విభజనకు సంబంధించిన ఆవిష్కరణను కార్ల్ ల్యాండ్‌స్టైనర్ పూర్తి చేయగా, 1930 సంవత్సరంలో ఆయన నోబెల్ బహుమతిని అందుకున్నారు. 2004లో స్థాపించబడిన ప్రపంచ రక్తదాత దినోత్సవం సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచుతోంది.
 
ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని “సురక్షితమైన రక్తం జీవితాన్ని ఆదా చేస్తుంది” అన్న నినాదంతో నిర్వహిస్తున్నారని గవర్నర్ ఈ నేపధ్యంలో వివరించారు. అధిక, నాణ్యమైన రక్త నిల్వల సరఫరాకు పారితోషికం ఆశించని స్వచ్ఛంద రక్తదాన విధానం చాలా ముఖ్యమైనదని గవర్నర్ అన్నారు. రక్తంతో పాటు రక్త భాగాల నాణ్యత, భద్రతను ప్రోత్సహించడం అనేది మిలీనియం అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలకమైందని బిశ్వభూషణ్ పేర్కోన్నారు. కరోనా ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ పరిస్ధితులు రక్తదాన శిబిరాల నిర్వహణకు ఆటంకంగా మారాయని, అది ప్రస్తుత సంవత్సరంలో రక్త సేకరణపై తీవ్రంగా ప్రభావితం చూపిందని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు.
 
ఈ విపత్కర కాలంలో కూడా రాష్ట్రంలోని 18 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులు రక్తదాతలను చేరుకుని, సుమారు 6000 యూనిట్లను సేకరించి రోగుల అవసరాలకు అనుగుణంగా ఉచితంగా రక్తాన్ని అందుబాటులో ఉంచగలగటం అభినందనీయమన్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో రక్తదానం చేసిన స్వచ్ఛంద రక్తదాతలందరినీ తాను అభినందిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు.
 
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ రాష్ట్రంలోని ప్రతి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో కనీసం 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించే ఏర్పాట్లతో సిద్దంగా ఉందని యువత కదిలి రావాలని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమను తాము రక్తదాతలుగా నమోదు చేయించుకుని 'రక్తదానం-జీవితాన్ని రక్షించు' ప్రచారంలో భాగస్వాములు కావాలని గౌరవ గవర్నర్ పిలుపు నిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు