ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల అరాచకాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. తమకు ఎదురుతిరిగే వారిపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నారు. తాజాగా ఆస్పత్రి బిల్లు చెల్లించమన్నందుకు వైకాపా నేత చికెన్ బాషా ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దికారు. మర్డర్లు చేసే నన్నే డబ్బులు అడుగుతావా? నీకెంత ధైర్యం? అంటూ హల్చల్ చేశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ముచ్చుమర్రికి చెందిన చికెన్ బాషా అనే వ్యక్తి కుమార్తె ఐదు నెలల గర్భిణి. ఆమెకు రక్తస్రావం, నొప్పులతో బాధపుడుతుంటే నందికొట్కూరులోకని సుజాత ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం బిల్లు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది బాషాను కోరారు.
ఆ మాట వినగానే ఆగ్రహంతో ఊగిపోయిన బాషా.. తన అనుచరులతో కలిసి ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగారు. మర్డర్లు చేయడమే వృత్తిగా పెట్టుకున్న నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా? అని బెదిరించాడు. తాను బైరెడ్డి సిద్ధారెడ్డి మనిషినని, తలచుకుంటే సాయంత్రానికల్లా ఇక్కడ ఆస్పత్రి ఉండదని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు మాత్రం ఫిర్యాదు పత్రంలో సంతకం లేదని పేర్కొంటూ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.