పవన్ బాల్య మిత్రుడు.. ఎపుడూ తనను పల్లెత్తు మాట అనలేదు : విజయసాయిరెడ్డి

వరుణ్

ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (08:44 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ నెల్లూరు లోక్‌భ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ తన బాల్యమిత్రుడని చెప్పారు. పైగా, పవన్ తనను ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. తాజాగా ఆయన ఓ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వూ ఇస్తూ, మీరు విపక్ష నేతలు అందరినీ ఓ రేంజిలో విమర్శిస్తారు కానీ పవన్ కల్యాణ్‌ను ఎందుకు విమర్శించరు? అంటూ విలేకరి ప్రశ్నించగా, విజయసాయిరెడ్డి స్పందిస్తూ, పవన్ కల్యాణ్ తనకు బాల్యమిత్రుడు అని సంచలన విషయం వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ తనను విమర్శించలేదని తెలిపారు. అయితే, తాను గతంలో రాజకీయ అంశాలపై పవన్ కల్యాణ్‌ను, జనసేన పార్టీని విమర్శించానని విజయసాయి పేర్కొన్నారు.
 
'ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సభ్యులు విజయవాడకు వచ్చినప్పుడు ఆ సమావేశానికి నేను హాజరైనప్పుడు, ఆ సమావేశం ముగిశాక బయటికొచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు జనసేనను ఏ విధంగా విమర్శించాను, పవన్ కల్యాణ్‌ను ఏ విధంగా విమర్శించాను అనేది మీరు గమనించవచ్చు. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి రాజకీయంగా విమర్శించడం తప్పదు. తప్పని పరిస్థితుల్లో తప్పకుండా విమర్శించాల్సిందే. విమర్శించాల్సిన వచ్చినప్పుడు పదునైన పదజాలంతో విమర్శిస్తాం' అని స్పష్టం చేశారు.
 
అయితే, చంద్రబాబును, లోకేశ్‌ను విమర్శించినంత ఘాటుగా పవన్‌‍ను విమర్శించడంలేదన్న అభిప్రాయాలు ఉన్నాయని చానల్ యాంకర్ ప్రశ్నించారు.
అందుకు విజయసాయి స్పందిస్తూ... 'అవతల పవన్ కల్యాణ్ ఉన్నా, ఇంకో రాజకీయ నాయకుడు ఉన్నా రాజకీయంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు నేను ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడను. పవన్ కల్యాణే కాదు, ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. పార్టీలో కొందరు నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తుండవచ్చు కానీ, అలాంటి వాటికి నేను దూరం' అని వివరణ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు