వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హలూసినేషన్ సిక్స్ స్టేజ్‌లో వున్నారని.. ఆ స్టేజ్‌లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని.. చంద్రబాబుకు ప్రస్తుతం అదే జబ్బు పట్టుకుందని నిప్పులు చెరిగారు. ఆ జబ్బు ప్రభావంతోనే రాష్ట్రంలో ఏ సమస్యా లేదని చంద్రబాబు చెప్తున్నారని, రుణమాఫీ చేశానని, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చానని చెప్పుకుంటున్నారన్నారు.
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని.. ఈ యాత్రను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని రోజా విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడిచి, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందో చూపించాలని రోజా సవాల్ విసిరారు.
ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. దోచుకున్నది దాచుకోవడమే తప్ప చంద్రబాబు మరేమైనా చేశారా? అంటూ ప్రశ్నించారు.