టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచకపాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే తాను ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టానని... అందరి ఆశీస్సులు తనకు కావాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం తన పాదయాత్రకు శ్రీకారం చుట్టి.. ఇడుపులపాయ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన బాలగంగాధర్ తిలక్ మాటలను గుర్తు చేశారు. 'గాంధీ దేశంలో గజానికొక గాంధారి కొడుకు' అనే మాటలు తనకు గుర్తుకొస్తున్నాయన్నారు. ప్రస్తుత పాలనలో ప్రజాప్రతినిధులకు అధికారం లేదని... జన్మభూమి కమిటీ దొంగలకే చంద్రబాబు అధికారాలను కట్టబెట్టారని విమర్శించారు. గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు దొంగలముఠాలుగా తయారయ్యాయని మండిపడ్డారు.
తనకు కాసులంటే కక్కుర్తి లేదని... చంద్రబాబులా కేసులకు భయపడని, కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకోనని అన్నారు. తనకు ఒక కసి ఉందని... చనిపోయిన తర్వాత కూడా పేదవాడి గుండెల్లో బతకాలన్నదే ఆ కసి అని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవాలనే కసి, ప్రతి యువతకు ఉద్యోగం ఇప్పించాలనే కసి తనలో ఉందని అన్నారు. సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్‌ను 'అభివృద్ధి ఆంధ్రప్రదేశ్'గా మార్చాలనే కసి తనకుందన్నారు. మద్య నిషేధాన్ని విధించాలనే కసి తనలో ఉందని జగన్ కొత్త పల్లవి అందుకున్నారు.