వైకాపాకు ఎదురుదెబ్బలు : సీఎం జగన్‌కు వైమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టాటా!!

వరుణ్

బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (13:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆ రాష్ట్రంలోని అధికార వైకాపాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈయన నేడో రేపే పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. 
 
ఆ తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా, రానున్న ఎన్నికల్లో వైకాపా తరపున నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని గతంలో వేమిరెడ్డి ప్రకటించారు. అయితే, ఆతర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో తనకు టిక్కెట్ దక్కే అవకాశం లేదని భావించి పార్టీ  మార్పునకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. 
 
కాగా, ఇటీవల నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్‌ను సీఎం జగన్ నియమించారు. దీన్ని వేమిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. అప్పటి నుంచి ఆయన వైకాపా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పైగా, గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన జీర్ణించుకోలేక పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు