ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు ఢిల్లీలో రోజుకో కేంద్ర మంత్రిని కలుస్తున్నారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం పార్లమెంటును కలయ తిప్పేస్తున్నారు. రోజూ పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడం... బ్రేక్‌లో ఒక్కో కేంద్ర మంత్రిని కలవడం వారికి డెయిలీ రొటీన్‌గా మారింది.
ఇటీవల వైసీపీ ఎంపీల బృందం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశంపై వినతి పత్రాలు ఇచ్చారు. తామే కాకుండా, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి నాయకులను కూడా ఢిల్లీకి రప్పించి, కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇప్పించారు.
ఇపుడు తాజాగా రాష్ట్రంలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలంటూ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయనకు డిమాండులతో కూడిన వినతిపత్రం సమర్పించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సారధ్యం వహించగా, లోక్ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.