రాని వారు దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లో పెన్షన్: పెద్దిరెడ్డి, బొత్స
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (13:48 IST)
పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లో ఉన్న ప్రచార విభాగంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అర్హులందరికీ పెన్షన్ లు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. పెన్షన్ రాని వారు దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లో పరిశీలించి పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు.
గతంలో అర్హతలతో సంబంధం లేకుండా పెన్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు కొన్ని నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసిందని, దాని ప్రకారమే పెన్షన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
రికార్డు స్థాయిలో ఒకేరోజు రాష్ట్రంలో పెన్షన్లను పంపిణీ చేశామని సంతోషం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి 94.44 శాతం మందికి పెన్షన్లు అందజేశామన్నారు. మూడు రోజుల్లో 50 లక్షల 50 వేల 394 మందికి పెన్షన్లు పంపిణీ చేశామన్నారు.
ఈ దేశంలో ఏ సీఎం ఈ మాదిరిగా ఒకేసారి పెద్ద సంఖ్యలో పెన్షన్లను పంపిణీ చేయలేదని గుర్తుచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్దితో పెన్షన్ల పంపిణీని పరిగణలోకి తీసుకున్నారన్నారు. తాము కులం, మతం, రాజకీయం చూడటం లేదని కేవలం పేదరికంను మాత్రమే కొలబద్దగా చూస్తున్నామన్నారు.
మంచంలో పడివున్న పక్షవాతం వచ్చిన వారికి ఏ ప్రభుత్వం గతంలో పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవని కానీ తమ ప్రభుత్వం ఈ తరహా వ్యాధిగ్రస్తులకు కూడా పెన్షన్ ఇవ్వాలని సంకల్పించిందన్నారు.
దీనిని కూడా కొందరు రాజకీయం చేయాలని చూడటం బాధాకరమన్నారు. పెన్షన్లు భారీగా తొలగించామంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు. గ్రామ సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలు ఉన్నాయని, గ్రామంలో ఎవరైనా సరే వెళ్ళి వాటిని పరిశీలించుకోవచ్చని సూచించారు.
సోషల్ ఆడిట్ మాదిరిగా నోటీస్ బోర్డుల్లో అర్హుల జాబితాలు ఉంచామన్నారు. అర్హులై వుండి పెన్షన్ రాకపోతే అర్జీ పెట్టుకుంటే అయిదు రోజుల్లో పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోని సచివాలయంలో దీనిపై వివరాలను ప్రదర్శిస్తున్నామన్నారు.
పూర్తి పారదర్శకంగా పెన్షన్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. గత అయిదేళ్లలో చివరి ఏడాది గత ప్రభుత్వం పెన్షన్లకు ఇచ్చింది కేవలం రూ.8వేల కోట్ల పై చిలుకు మాత్రమేనని గుర్తుచేశారు. అదే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పెన్షన్ల పంపిణీకి రూ.15వేల కోట్లకు పై చిలుకు కేటాయించినదని తెలిపారు.
ఈ ఏడాది ప్రతి లబ్దిదారుకి నెలకు రూ.2250 లు పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఇది తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనతగా మంత్రి అభివర్ణించారు. 7 లక్షల పెన్షన్లు తొలగించారని కొందరు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 4.27,538 లక్షల పెన్షన్లు అనర్హత కింద తొలగించామని, కొత్తగా సుమారు 6.11 లక్షల పెన్షన్లు ఇచ్చామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో భర్తలు వున్న 248 మందికి వితంతు పెన్షన్లు ఇచ్చారని, ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పెద్ద సంఖ్యలో పెన్షన్లు ఇచ్చారన్న విషయం మంత్రి గుర్తుచేశారు.
ఇప్పుడు ఆ పెన్షన్లు తొలగిస్తుంటే...ప్రతిపక్షనేత గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. 45 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పి మాట తప్పినట్లు ప్రతిపక్ష నేత ఆరోపించిన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ తమ మేనిఫెస్టోలో చెప్పిన దానిని కూడా ప్రతిపక్ష నేత అర్ధం చేసుకోలేకపోతున్నారన్నారు.
తమ ప్రభుత్వంలో 45 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద సాయం అందిస్తామని చెప్పామన్నారు. 45 ఏళ్లు నిండిన వారికి రెండో ఏడాది నుంచి 4 ఏళ్లలో మొత్తం రూ.75 వేల వరకు ఇస్తామని, వచ్చే ఏడాది నుంచి అది అమలులోకి వస్తుందని చెప్పారు.
ఇటీవల ప్రతిపక్ష నేత సొంత గ్రామం నారావారి పల్లెలో కూడా పారదర్శకంగా పెన్షన్లు ఇచ్చామన్నారు. అక్కడ ఏ విధంగా పెన్షన్లు ఇచ్చామో వీడియో ద్వారా మీడియాకు వెల్లడిస్తున్నామని ప్రదర్శించారు.
ఎటువంటి వివక్షత లేకుండా పెన్షన్లు ఎలా ఇస్తున్నామో, అర్హులు, అనర్హుల జాబితాలను ఎలా ప్రదర్శిస్తున్నారో ఈ వీడియోల్లో చూడవచ్చని మీడియాకు సూచించారు. పెన్షన్లు ఇచ్చే విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.
పేదరికంను కొలబద్దగా తీసుకుని సీఎం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఉగాది నాడు తొమ్మిదో నవరత్నం కింద 25 లక్షల ఇళ్ళస్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఏడాదికి 25 శాతం చొప్పున పేదలకు పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వంలో లబ్ధిపొందాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు సహజంగా పొరపాట్లు దొర్లుతుంటాయి.
అలా ఎవరికైనా పెన్షన్ రాని వారుంటే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే విచారణ చేసి మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలన్న తపనతోనే తమ ప్రభుత్వం ఉందన్నారు.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని విధంగా పెన్షన్ లను ఇంటింటికి పంపిణీ చేశామన్నారు. మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా లబ్దిదారులకే పెన్షన్ అందించామన్నారు.
లబ్ధిదారులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీడియా, సోషల్ మీడియాలో చూశామని గుర్తుచేశారు. కొందరికి సమాచార లోపం వల్ల పెన్షన్ అందుకోలేక పోవచ్చని సందేహం వ్యక్తం చేశారు. వారికి కూడా అర్హతలను బట్టి పెన్షన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇది తమ ప్రభుత్వ విధానమన్నారు. ఈ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎక్కడైనా పెన్షన్ అందకపోతే వారి అర్హతలను పరిశీలించి పెన్షన్ అందిస్తామని తెలిపారు.
పారదర్శకంగా తాము పని చేస్తూ చేస్తుంటే... ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని దుర్భుద్దితో కొందరు దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ల కంటే ఈ రోజు మేం సుమారు 2 లక్షల పెన్షన్లు అధికంగా ఇచ్చామన్నారు. కొత్తగా సుమారు ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు. వివిధ వ్యాధులకు సంబంధించి సుమారు 40 వేల మందికి పెన్షన్లు ఇచ్చామని చెప్పారు.
పెన్షన్లు రాలేదని అర్హులైన వారు ఎవ్వరూ నిరాశ, నిస్పృహకు గురి కావద్దని, తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. పేదలకు మేలు జరగాలనే తమ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు.
పది మందికి మేలు జరుగుతుంటే... ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ మాదిరిగా ప్రజలకు సంతృప్తస్థాయిలో సంక్షేమాన్ని వైఎస్ జగన్ అందిస్తున్నారన్నారు.
కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వంలో పెన్షన్ల నిబంధనలను సరళతరం చేశామని వివరించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పెన్షన్ల పంపిణీ విజయవంతం అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం నెలకు 300 యూనిట్ల కరెంట్ వినియోగించిన వారిని అనర్హులుగా ప్రకటించిన విషయం తెలిపారు. గతంలో కేవలం వంద యూనిట్లు వాడితే పెన్షన్ లకు అనర్హులుగా ప్రకటించారని కానీ తమ ప్రభుత్వం నిబంధనలను సడలించి సరళతరం చేసిన విషయాన్ని వివరించారు.
గతంలో నాలుగు చక్రాల వాహనం వుంటే పెన్షన్ ఇచ్చే వారు కాదని కానీ తమ ప్రభుత్వం టాక్సీ నడుపుకునే వారిని దృష్టిలో పెట్టుకుని దానికి మినహాయింపు ఇచ్చిందన్న విషయం గుర్తుచేశారు.
ఎక్కువ మందికి పెన్షన్లు ఇవ్వాలనే తాము ఆలోచన చేశామని పేదల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చేయడానికైనా సిద్ధంగా ఉన్న విషయం మీడియాకు వివరించారు. తమ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులకు ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో తక్కువ కేటాయింపులు చేయడాన్ని తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉందని గుర్తుచేశారు. విభజన హామీ చట్టంలో బుందేల్ ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలని చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో ఇదే ప్యాకేజీ కింద 30వేల కోట్లు ఇచ్చారన్న విషయం గుర్తుచేశారు. కానీ గత ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత మాత్రం జిల్లాకు రూ.50 కోట్లు సరిపోతాయని రాజీ పడి కేవలం రూ.350 కోట్లకే సరిపెట్టారని గుర్తుచేశారు.
ఈ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్రం ఈ నిధులను కూడా వెనక్కి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను బ్యూటిఫికేషన్ కు పెడితే కేంద్రం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు మేం చట్టంలో చేసిన విధంగా నిధులు ఎపికి ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నామన్నారు. తమ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని విభజన చట్టంలోని హామీల అమలును కోరుతున్నారని చెప్పారు.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్రానికి డిపిఆర్ కూడా అందజేశామన్నారు. గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు మళ్ళీ మేం ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పూర్తిగా గాడితప్పిందన్నారు. గత పాలన వల్ల అప్పులు ఇచ్చే వారు కూడా లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వికేంద్రీకరణపై తాము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నామని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ ప్రతిపక్షం దానిని రాద్దాంతం చేస్తోందని మంత్రి అన్నారు.