మూడేళ్లు ఓపిక పడితే ముప్పై ఏళ్లు నువ్వే సీఎం అన్నా.. వైఎస్ జగన్ ఒప్పుకోలే.. షబ్బీర్

సోమవారం, 17 జులై 2017 (07:15 IST)
ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన అత్యంత కీలక క్షణాల్లో కాంగ్రెస్ అధిష్టానం చేసిన ముఖ్య ప్రతిపాదనను వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు తోసి రాజనడమే జగన్‌పై కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రంగా ఆగ్రహించడానికి కారణమైందా? చాలా ఆలస్యంగా తెలుస్తున్న ఈ సమాచారం రాజకీయ పరిశీలకుల్లో, ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. అధిష్టానం తరపున జగన్‌కు రాష్ట్రంలో మంత్రి పదివిని లేక కేంద్రంలో సహాయ మంత్రి పదవిని  ఇస్తామని, కాస్త అనుభవం వచ్చిన తర్వాత సీఎం పదవిలో కూర్చోబెట్టాలని అధిష్టానం భావించినా.. జగన్ వాటన్నింటినీ తిరస్కరించి పోటీ దుకాణం తెరిచాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
వైఎస్ అకాల మరణం తర్వాత సెంటిమెంట్ ప్రాతిపదికన 145 మంది ఎమ్మెల్యేలు జగన్‌నే సీఎం చేయాలని కోరినప్పటికీ అధిష్టానం తిరస్కరించడానికి బలమైన కారణమే ఉందా... కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ మాటలను బట్టి చూస్తే అధిష్టానం భవిష్యత్ సీఎంగా జగన్‌ను చేస్తామనే ఆఫర్ కూడా చేసిందని తెలుస్తోంది. అయితే జగన్‌కు తగిన పాలనానుభవం లేదు కనుక తాత్కాలికంగా కేంద్ర కేబినెట్‌లో సహాయమంత్రి లేదా రాష్ట్రంలో కేబినెట్‌ పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చింది. అందులో చేరి తగిన అనుభవం సంపాదించుకున్నాక సీఎం పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. జగన్‌ను స్వయంగా కలిసి ఇదే విషయం షబ్బీర్‌ చెప్పినప్పటికీ ఈ ఆఫర్‌కు జగన్‌ ఒప్పుకోలేదట. అనుభవమంటే.. నాన్న ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి అన్నింటిపైనా నేను కూర్చుని చర్చించాను. నాకు చాలా అనుభవం ఉంది’ అని జగన్‌ జవాబిచ్చారట. 
 
జగన్‌కు, కాంగ్రెస్‌ అధిష్ఠానానికి మధ్య ఏర్పడిన గ్యాప్‌ను పూరించే ప్రయత్నం చేశానని షబ్బీర్ తెలిపారు. అధిష్ఠానం దూతగా జగన్‌ను కలిసి మంత్రి పదవి ఆఫర్‌ చేశానని చెప్పారు. అప్పట్లో గులాంనబీ ఆజాద్‌ తనను పిలిచి జగన్‌కు సర్దిచెప్పమని పంపించారన్నారు. మూడేళ్లు ఓపిక పడితే ముప్పయ్యేళ్ల పాటు సీఎం పదవిలో కూర్చుంటావని చెప్పినా జగన్‌ ఒప్పుకోలేదన్నారు. కాగా, వచ్చే ఎన్నికలలో వైసీపీ, కాంగ్రెస్‌ కలిసే అవకాశాలు లేవని అలీ అభిప్రాయపడ్డారు. అప్పట్లోనే జగన్‌కు డోర్స్‌ క్లోజ్‌ అయ్యాయని తెలిపారు.
 

వెబ్దునియా పై చదవండి