నవ్యాంధ్రలోని రాలయసీమ, కోస్తాంధ్రా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా, రాయలసీమ ప్రాంతంలో టీడీపీ కేవలం మూడంటే మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. వీరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(కుప్పం), ఆయన బావమరిది సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (హిందూపురం), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ) స్థానాలు మాత్రమే ఉన్నాయి.
అయితే, బాలకృష్ణ గెలవడానికి కూడా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా సహకరించినట్టు సమాచారం. దీనికిబలమైన కారణం లేకపోలేదు. నిజానికి బాలయ్యకు జగన్ వీరాభిమాని. ఈ కారణంగానే గతంలో బాలయ్య తుపాకీ కాల్పుల కేసులో చిక్కుకున్నపుడు జగన్ రక్షించారు. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. బాలయ్యకు జగన్ వీరాభిమాని కావడంతో ఈ కేసు నుంచి బాలకృష్ణను తప్పించారనే ప్రచారం ఉంది.
ఇపుడు కూడా ఫ్యాను గాలికి ఎదురు నిలిచి గెలిచిన హీరోగా బాలకృష్ణ రికార్డు సృష్టించాడు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. హిందూపురం వైకాపా సమన్వయకర్తగా నవీన్ నీచల్‌లు జగన్ నియమించారు. ఆయనకే అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో నవీన్ నీచల్.. ఐదేళ్ళుగా తన గెలుపు కోసం కిందిస్థాయి నుంచి పునాదులు వేసుకున్నారు.
కానీ, చివరి నిమిషంలో నవీన్‌కు కాకుండా రిటైర్డ్ ఐజీ మొహ్మద్ ఇక్బాల్‌కు హిందూపురం టిక్కెట్‌ను జగన్ కేటాయించారు. ఈయన విజయవాడ లోక్‌సభ సమన్వయకర్తగా వ్యవహరించారు. హిందూపురంలో మైనార్టీలు అధికంగా ఉండటం, చంద్రబాబు పాలనతో పాటు.. స్థానికంగా బాలయ్యపై వ్యతిరేక భావం ఉందన్న కారణాలతో నవీన్ నీచల్‌ను కాదని ఇక్బాల్‌కు టిక్కెట్ కేటాయించారు.
స్థానిక అభ్యర్థిని కాదని స్థానికేతరుడైన ఇక్బాల్‌ను వ్యూహాత్మకంగానే జగన్ బరిలోకి దించి బాలయ్య బాబు విజయానికి పరోక్షంగా విజయం సాధించారనే ప్రచారం సాగుతోంది. ఫలితంగానే బాలయ్య గతంలో సాధించిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఇలా తన వీరాభిమాని అయిన బాలకృష్ణను జగన్ గెలిపించారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.