బెల్టు షాపుల నియంత్రణలో ఎటువంటి అలసత్వాన్ని అంగీకరించబోమని రెవిన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (ఎక్సైజ్) డాక్టర్ సాంబశివరావు స్పష్టం చేసారు. ప్రభుత్వ ప్రాధన్యతలను అనుసరించి ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా మెలగాలని లేకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. ఆశించిన మేరకు పనితీరులో మార్పు రాకుంటే కానిస్టేబుల్ స్థాయి నుండి అడిషినల్ కమీషనర్ స్థాయి వరకు ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమన్నారు.
మంగళవారం విజయవాడ ప్రసాదంపాడులోని రాష్ట్ర అబ్కారీ కమీషనరేట్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్న సాంబశివరావు బెల్టు షాపుల నియంత్రణపై అధికారులకు దిశానిర్ధేశం చేసారు. పాలకుల ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని, మంచి పనితీరు ప్రదర్శించిన వారికి ప్రభుత్వ పరంగా రివార్డును కూడా అందచేస్తామని తెలిపారు. సమయం వృధా చేయవద్దని రేపటి నుండే రంగంలోకి దిగాలని వారం రోజుల్లో మార్పు కనిపించాలని, పది రోజుల్లో పని పూర్తికావాలని స్పష్టం చేసారు. గరిష్ట చిల్లర ధర విషయంలో పలు ఫిర్యాధులు వస్తున్నాయని కొన్ని జిల్లాలలో ఇది శృతిమించిన వ్యవహారంగా ఉందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
రానున్నది గంజాయి సాగు సమయం అయినందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గంజాయి విషయంలో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికే నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నెంబర్‌ను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని డాక్టర్ సాంబశివరావు అన్నారు. తనకు ఫలితాలు మాత్రమే కావాలని కుంటి సాకులు వినబోనన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ దశల వారిగా మధ్య నిషేదం అన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష కాగా, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నాయి, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎన్ని ఉన్నాయి అన్న సమాచారాన్ని తక్షణం సేకరించి చర్యలకు ఉపక్రమించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ సమావేశం నిర్వహించి బెల్టు షాపు నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేయాలని, వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా దారికి తేవాలని, అప్పటికీ వారిలో మార్పు లేకపోతే నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేసి చెరశాలకు పంపాలని మీనా ఆదేశాలు జారీ చేసారు.
ప్రతి కానిస్టేబుల్‌కు ఒక గ్రామం, ప్రతి ఎస్ఐకి ఒక మండలం బాధ్యత అప్పగిస్తామని, వారు అక్కడి బెల్టు షాపుల నియంత్రణకు బాధ్యులుగా ఉంటారని, నిబంధనలు పాటించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్థాయిలో కేంద్ర కార్యాలయానికి ప్రతి రోజు బెల్టు షాపులపై నివేదిక పంపాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రానున్న మూడు వారాల వ్యవధిలో కొత్త మధ్యం పాలసీ వస్తుందని దానికి అనుగుణంగా వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలన్నారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్, అదనపు కమీషనర్ కెఎల్ భాస్కర్, జాయింట్ కమీషనర్లు దేవకుమార్, జోసఫ్, ఓఎస్‌డి నాగేశ్వరరావు, కేంద్ర కార్యాలయం డిసి - కంప్యూటర్స్ రేణుక, వివిధ జిల్లాల డిప్యూటి కమీషనర్లు, అసిస్టెంట్ కమీషనర్లు, ఎక్సైజ్ సూపరిండెంట్లు పాల్గొన్నారు.