కాలికి బ‌ల‌పాలు క‌ట్టుకుని తిరుగుతున్న వై.ఎస్. జ‌గ‌న్... ఎక్కడికి...?

మంగళవారం, 5 జులై 2016 (12:03 IST)
విజ‌య‌వాడ‌: నేటి నుంచి 5 నెల‌లు కాలికి బ‌ల‌పాలు క‌ట్టుకుని వై.ఎస్. జ‌గ‌న్ తిరుగ‌నున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి జిల్లాలో పర్యటించనున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి రిఫ్రెష్ అయి తిరిగి వ‌చ్చిన వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని, అక్కడి నుంచి సాయంత్రం 4.30కు కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 
 
అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ముచ్చటిస్తారన్నారు. 6 గంటలకు కడపలోని అమీన్‌పీర్ దర్గా సమీపంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని.. అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. చంద్రబాబు ప్ర‌భుత్వ హామీల వైఫ‌ల్యంపై జ‌గ‌న్ వంద ప్రశ్న‌ల జాబితాను రెడీ చేశారు. దీనికి చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలంటూ, ఆయ‌న ప‌ర్య‌ట‌న సాగుతోంది.
 
అక్కడ నుంచి నేరుగా పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. 6వ తేదీన ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం వరకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సింహాద్రిపురం మండలం చెర్లోపల్లె గ్రామానికి చేరుకుని ఎంపీ నిధులతో ఏర్పాటుచేసిన నూతన ఆర్వో ప్లాంటును ప్రారంభిస్తారు. అక్కడ నుంచి తొండూరు మండలం మల్లేలకు చేరుకుని పార్టీ నాయకుడు రవీంద్రనాథరెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన నూతన మినరల్ వాటర్‌ప్లాంటును ప్రారంభిస్తారు. 
 
అనంతరం మల్లేల దర్గాను సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 7వ తేదీన ఉదయం 11 గంటలకు లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చేరుకుని అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మంజుల చలపతి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం భోజన అనంతరం చక్రాయపేట మండలం ముద్దప్పగారిపల్లెకు చేరుకుని ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఎస్.చెన్నారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. 8వ తేదీన ఉదయం తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కుటుంబసభ్యులతో ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు వేంపల్లె మండలం ఇడుపులపాయ గ్రామానికి చేరుకొని గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో పాల్గొంటారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌చార‌మే త‌మ ధ్యేయ‌మ‌ని జ‌గ‌న్ చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి