అధ్యక్షా... నాకు ఒక్కతే భార్య.. సీఎం జగన్ : పేరెత్తకుండా పవన్‌పై సెటైర్లు- Video

సోమవారం, 9 డిశెంబరు 2019 (18:37 IST)
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. మహిళల భద్రతతో పాటు ఉల్లి ధరలపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు తమకు ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు భార్యలు కావాలన్నట్టుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 
 
ఇలాంటి కేసులను 'బిగమీ' అంటారని.. ఈ కేసులు రాష్ట్రంలో 2016లో 240, 2017లో 260, 2018లో 195 కేసులు నమోదయ్యాయి అన్నారు. అలాగే దిశ తల్లిదండ్రుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. వారి బాధను చూశాక.. నిందితులను కాల్చేసినా తప్పులేదని అందరం అనుకున్నామన్నారు. తనకూ ఇద్దరు ఆడపిల్లలు, చెల్లెలు, భార్య ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఒక్కతే భార్య అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో వైసీసీ సభ్యులు పెద్ద పెట్టున నవ్వారు.
 
ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నవేనవి జనసేన కార్యకర్తలు, నేతలు భావిస్తున్నారు. బాధ్యతగల హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. తమ అధినేత వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రస్తావిస్తుంటే.. వాటి గురించి మాట్లాడకుండా ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
 
కాగా, సోషల్ మీడియా వేదికగా వైకాపా - జనసేన పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్‌పై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే, సీఎం జగన్ మాత్రం పరోక్షంగా పవన్‌ను విమర్శిస్తున్నారు. పవన్ పెళ్లిళ్ల గురించి ఆయన పేరు ఎత్తకుండానే మాట్లాడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు