ఈనెల 24 న విజయనగరంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో శనివారం ఉదయం అధికారులంతా విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని హెలిపేడ్, దిశ పోలీస్ స్టేషన్, అయ్యోధ్య మైదానాలలో భద్రతాపరమైన తనిఖీలను చేపట్టారు. ఏవిషయన్ వింగ్, ఇంటిలిజెన్స్ వింగ్, జిల్లా పోలీసు శాఖలు కలిసి అడుగడుగునా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఇతర అధికారులు పాల్గన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకి 1500 మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకి విశాఖపట్నం నుండి హెలికాప్టర్‌లో సిఎం జగన్మోహన్ రెడ్డి విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపేడ్‌లో దిగి.. సభ స్థలి అయిన అయోధ్య మైదానానికి వెళ్తారని తెలిపారు. 12.35 గంటలకి సభను ముగించుకొని సిఎం దిశ పోలీస్ స్టేషన్‌ని ప్రారంభిస్తారని చెప్పారు.
ఒంటి గంటకి మళ్ళీ హెలిపేడ్ నుండి విశాఖపట్నానికి తిరుగు ప్రయాణమవుతారని చెప్పారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పట్టణంలోని నాలుగు చోట్ల ఎఎస్‌పి ర్యాంక్ ఆఫీసర్‌తో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని చోట్లా సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంనికి డిజిపి గౌతమ్ సవాంగ్, హోం మంత్రి సుచరిత, మంత్రులు వనిత, తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. ట్రాఫిక్‌కి ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు.