రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటన... రైతులకు భరోసా..!

మంగళవారం, 3 మార్చి 2015 (12:41 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆయన ఉండవల్లిలోని పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, కౌలు రైతులు, కూలీలు, మహిళలు తమ గోడు చెప్పుకుని విలపించారు. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోని, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామన్నారు. 
 
కేంద్రం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మర్చిపోయారని జగన్‌ ఆరోపించారు. కాగా, జగన్ పర్యటన ఉండవల్లి నుంచి ప్రారంభమైంది. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యలను జగన్‌ అడిగి తెలుసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి