త్వరలోనే ‘పోలవరం’ పరిశీలించనున్న సీఎం జగన్‌

సోమవారం, 3 జూన్ 2019 (20:55 IST)
రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని ఆయన వెల్లడించారు. ఇక ఏటా వందలకొద్దీ టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో గోదావరి నదీ జలాలను సాధ్యమైనంతగా వినియోగించుకోవాలని ఆయన జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 
 
జల వనరులశాఖ పనితీరుపై సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. వైఎస్ జగన్ ఈ నెల ఆరో తేదీన మరోసారి జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.
 
సుదీర్ఘంగా సాగిన జలవనరులశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాజెక్టులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల శాఖలో ఎట్టిపరిస్థితుల్లో అవినీతికి తావు ఉండకూడదని, ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో తదుపరి సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు