వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డిని హత్య చేసింది తామేనని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అప్రూవర్‌గా మారిన వివేకా వ్యక్తిగత కారు మాజీ డ్రైవర్ దస్తగిరి తెలిపారు. ఇపుడు తనకు ప్రాణహాని నెలకొందని, తనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వివేకాను హత్య కేసులో తాను అప్రూవర్‌గా మారినప్పటి నుంచి ప్రాణహాని నెలకొందన్నారు. ఇటీవలే తన పెంపుడు కుక్కను కూడా చంపేశారనీ, తనను ఏ క్షణమైనా హత్య చేయొచ్చని ఆయన భయం వ్యక్తం చేశారు.
అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి అందరూ ఒకే కుటుంబ సభ్యులని తెలిపాడు. తనను ఏమైనా చేస్తారేమోననే భయం తనను వెంటాడుతోందన్నాడు. పెద్దవాళ్లనే కీలు బొమ్మలుగా చేసి ఆడిస్తున్న కొందరికి తానో లెక్క కాదన్నాడు.
తనకు ప్రాణ భయం ఉందన్న దస్తగిరి... తనకు రక్షణ కల్పించాలని కోరాడు. తనకు కేటాయించిన గన్‌మన్లను ఎందుకు మార్చారని మాత్రమే ఎస్పీకి ఫిర్యాదు చేశానన్న దస్తగిరి...తాను చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలని ఎస్పీ చెప్పడం బాధాకరమన్నాడు. సమస్య తనదని, ఎలాంటి కుట్ర జరుగుతుందో తనకే తెలుసునని కూడా దస్తగిరి వ్యాఖ్యానించాడు.