'అమరరాజా' వ్యవహారం.. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (13:53 IST)
'అమరరాజా' ఫ్యాక్టరీ వ్యవహారంపై రచ్చ రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. 'అమరరాజా' విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అమరరాజా, టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అమరరాజా' విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. 
 
రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే.. చంద్రబాబు మాత్రం ఒక అమరరాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇది రాజకీయం కాదు.. కాలుష్యం సమస్యగా మాత్రమే చూడాలని హితవు పలికారు. నిబంధనలు పాటించని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చిందన్న విషయాన్ని రోజా గుర్తు చేశారు.
 
'చంద్రబాబు పదేపదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు. అమరరాజా ఒక్కటే కాదు.. రాష్ట్రంలో 54 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైంది. అమరరాజా అనేక మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. 
 
హైకోర్టు ఆదేశాలను శిరసా వహించి కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవాలి. తెలంగాణలో కూడా ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలి. పరిశ్రమలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. అమరరాజా కంపెనీని జగన్ ప్రభుత్వం మూసివేయాలని చెప్పలేదు. తప్పులను సరిదిద్దుకుని నియమ నిబంధనలతో పరిశ్రమలు నడిపించాలని అమరరాజా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అధికారులు కోరారు' అని రోజా చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు