కాకినాడలో ఎమ్మెల్యే రోజాకు 'పోకిరి' పూనాడు...

శనివారం, 26 ఆగస్టు 2017 (16:27 IST)
రాజకీయ నాయకులంటే పంచ్ డైలాగులు మామూలే. ఎన్నికల పర్యటనలకు బయలుదేరితో ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై సెటైర్లు విసురుతూ రకరకాల డైలాగులతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీలో ఎమ్మెల్యే రోజాకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. తెలుగుదేశం పార్టీని జగన్ మోహన్ రెడ్డి తర్వాత తీవ్ర స్థాయిలో వైకాపా నుంచి ఇంకెవరైనా విమర్శిస్తున్నారా అంటే ఎమ్మెల్యే రోజా అని చెప్పక తప్పదు. ఆమె మాటలు అలా వుంటాయి మరి. 
 
ఇటీవలే నంద్యాల ఉప ఎన్నికలు ముగిశాయి. దాంతో ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నటి, ఎమ్మెల్యే రోజా కాకినాడలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రంలోని ఓ డైలాగును ఆవేశంతో చెప్పారు.
 
అదేమిటంటే... "ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో... (వాడే) వారే కాకినాడ ఓటర్లు(పండుగాడు)" అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీని కాకినాడ ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ పిలుపునిచ్చారు. మొత్తమ్మీద ప్రచారంలో సినిమా డైలాగులతో రోజా బాగానే ఆకట్టుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు