మాది రెండు కళ్ల సిద్ధాంతం కాదు.. రాజీనామాలపై వెనక్కి తగ్గం : వైకాపా ఎంపీలు

మంగళవారం, 29 మే 2018 (12:53 IST)
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులా తమది రెండు కళ్ల సిద్ధాంతం కాదనీ అందువల్ల తమ రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైకాపాకు చెందిన లోక్‌సభ సభ్యులు తేల్చి చెప్పారు. విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైకాపాకు చెందిన ఎంపీలు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు చేసి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఏప్రిల్ నెలలోనే సమర్పించారు. ఈ రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అంశంపై వైకాపా ఎంపీలందరినీ మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటలకు అందుబాటులో ఉండాలని స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. దీంతో ఈ రాజీనామాలపై 29వ తేదీ సాయంత్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
 
ఈ రాజీనామాలపై వైకాపా ఎంపీలు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము స్పీకర్‌కు సమర్పించిన రాజీనామాల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకునే తిరిగి రాష్ట్రానికి వస్తామని ఒంగోలు ఎంపీ వైసీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు వస్తే, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని తాము నిర్ణయించుకున్నామని, ఉప ఎన్నికలకు తాము సిద్ధమేనని ప్రకటించారు. 
 
తామిచ్చిన రాజీనామా లేఖలను వెంటనే ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను బీజేపీ దెబ్బ తీసిందని, రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. 13 సార్లు తాము అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చామని గుర్తు చేసిన ఆయన, వాటిపై చర్చ జరగకుండా బీజేపీ నాటకాలు ఆడిందని ఆయన విమర్శలు గుప్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు