జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. పవన్ ఏమన్నారంటే... చంద్రబాబు అవసరమైతే జగన్ మోహన్ రెడ్డిని కూడా ఆలింగనం చేసుకుంటారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు.
ప్రజలు, ‘జనసేన’ రోడ్లపైకి వస్తున్నారంటే చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, భూ కబ్జాలే కనిపిస్తున్నాయని, భవిష్యత్తులో ఇసుక మ్యూజియం వస్తుందంటూ సెటైర్లు వేశారు. ఏపీలో ఎక్కడ భూమి కనిపించినా టీడీపీ నేతలు లాగేసుకుంటున్నారని, భూమిని, మట్టిని దోచుకునేవారు మట్టిలో కలిసిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనకు కావాల్సింది పార్టీల జెండాలు కాదని, జాతీయ జెండా ముఖ్యమని సూచించారు. తమ పార్టీకి పూర్తి మద్దతు వస్తే ఉద్యోగుల సీపీసీ స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యేలు, మంత్రి అచ్చెన్నాయుడు గురించి ఆయన ప్రస్తావించారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించొద్దని వీరికి హితవు పలికారు. మరి... పవన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.