తిరుపతిలో అట్టహాసంగా ఆవిష్కారమైన ప్రజారాజ్యం పార్టీకి కడప జిల్లాకు చెందిన ఓ న్యాయవాది మోకాలొడ్డారు. పార్టీ టైటిల్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మధ్యవర్తులగా వ్యవహరించే కొందరు నాయకులు ఆ న్యాయవాదిని హుటాహుటిన చిరంజీవి ఎదుట హాజరు పరిచారు. అక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రజారాజ్యం పంచాయతీ ఢిల్లీ మహానగరానికి చేరుకుంది.
కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లెకు చెందిన న్యాయవాది చెన్నకృష్ణయ్య ప్రజారాజ్యం పేరుతో పార్టీ నమోదు కోసం 2008 మార్చిలో ఎన్నికల సంఘం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు దరఖాస్తు అందినట్లు మిగిలిన వివరాలను తమకు పంపాలని సంఘం నుంచి లేఖ అందింది.
ఇంతలోనే రాజకీయాలలోకి రావాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతున్న చిరంజీవి ఈ నెల 26న తిరుపతిలో ఉత్కంఠభరితమైన వాతావరణంలో జరిగిన సభలో పేరును నాటకీయంగా ప్రకటించారు. అదే సమయంలో చిరు వర్గానికి చెందిన కొందరు ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీని నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఆ ముందురోజే చెన్నకృష్ణయ్య లక్కిరెడ్డిపల్లెలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను పార్టీ కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని ప్రకటించారు. పేరు కూడా చెప్పారు. తాను ప్రతిపాదించిన పార్టీకు ఆకుపచ్చ, తెలపురంగులతో కూడిన జెండా, దానిపై కలిశం గుర్తు ఉంటుందని ఆయన ప్రకటించారు. అయితే అప్పట్లో దానిపై ఎవరూ అంతగా దృష్టి సారించ లేదు. అదే పేరునే చిరంజీవి తన పార్టీ పేరుగా ప్రకటిస్తారని కూడా ఊహించలేదు.
అయితే చాలా నాటకీయ పరిణామాల మధ్య చిరంజీవి కూడా పార్టీ పేరును చాలా రక్తి కట్టే విధంగా ప్రకటించారు. ఆయన నోటి నుంచి ఏ పేరు వస్తుందోనని రాష్ట్ర ప్రజానికం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూశారు. అయితే అదే పేరుకు చిక్కులు వచ్చిపడతాయని ఎవ్వరూ ఊహించలేదు.
ఇలా పార్టీ ప్రకటన అయిన తరువాత ఎన్నికల సంఘం నుంచి చిరు వర్గానికి చావు కబురు చల్లగా అందింది. ఆ పేరుకోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారనే సమాచారం చేరింది. ఈ పిడుగుపాటు వార్తను అందుకున్న వారు బిత్తరపోయారు. వెంటనే రాజకీయ దూతలను రంగంలోనికి దింపారు.
ఇప్పటికే చిరు పార్టీలో చేరిన కడప జిల్లా నాయకులు రంగంలోకి దిగి పావులు కదిపారు. మద్యం వాపారిగా జిల్లాలో ముద్రపడిన ఓ తెలుగుదేశం నాయకుడు మధ్యవర్తిత్వం నడపడానికి ముందుకు వచ్చారు. అలాగే మరో నాయకుడు న్యాయవాది చెన్నకృష్ణయ్యను బుజ్జగించే బాధ్యతలను స్వీకరించారు. ఇందులో భాగంగా వెంటనే చెన్నకృష్ణయ్యను హుటాహుటిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ కూడా ఆయనను హైదరాబాద్ తీసుకెళ్ళేందుకు తెలుగుదేశం వర్గాలు పోటీ పడ్డట్లు తెలుస్తోంది.
చెన్నకృష్ణయ్యను గురువారం చిరంజీవి ఎదుట హాజరు పరిచారు. ఇక్కడే ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం. ఆపై చెన్నకృష్ణయ్యను ఢిల్లీకి తీసుకెళ్ళారు. ఇంకా ఎన్నికల సంఘం వద్దకు తీసుకెళ్ళి తాను పెట్టుకున్న దరఖాస్తును విరమింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అక్కడ ఏం జరగవచ్చు... ప్రస్తుతం ఢిల్లీ చేరిన ప్రజారాజ్యం టైటిల్ పంచాయతీ ఏమవుతుందనే ఆసక్తిగా ఉంది. టైటిల్ కోసం చెన్నకృష్ణయ్య దరఖాస్తు చేసుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో అందుకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించలేదు. కాబట్టి వెంటనే ఆ టైటిల్ ఆయనకు కేటాయించే పరిస్థితి ఏమి లేదు. అలాగని అతనికి టైటిల్ రాకుండా పోయే పరిస్థితి కూడా లేదు. మొదటి ప్రాధాన్యత అతనికే ఉంటుంది.
ఆ తరువాతనే అదే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న చిరంజీవి వర్గానికి దక్కే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే చిరు వర్గాన్ని కలవరపెడుతోంది. అందుకే మధ్యవర్తులను రంగంలోకి దింపి చిక్కును తొలగించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. సినిమా రంగంలోలాగే చిరంజీవి రాజకీయాల్లో కూడా టైటిల్ పోరును ఎదుర్కోక తప్పలేదు.