చిరంజీవికి రాజకీయ అనుభవం లేదు.... ఆయన ఏమి చేయగలుగుతారు.... అంటున్నారు. ఇంతవరకూ సినిమా హీరోగానే నన్ను చూశారు. నాణెనికి ఒకవైపు ఉన్న చిరంజీవిని చూశారు. ఇకపై నాణెనికి రెండో వైపు ఉన్న చిరంజీవిని చూస్తారు.
మృధు స్వబావి... సున్నిత మనస్కుడు... ఈయన రాజకీయాల్లో తట్టుకోగలుగుతాడా... అనే విషయాలకు మంగళవారం నాటి పార్టీ ఆవిర్భావ సభ నుంచి స్పష్టమైన సమాధానం చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు తానంటే ఏమిటో చూపిస్తానని నేరుగానే ఘాటైన సమాధానం చెప్పారు. రాజకీయ పరిశీలకులకు ఇప్పటికే చిరంజీవి ధోరణి ఏమిటో అవగతమై ఉంటుంది.
చాలా సాదాగా స్టేజీపైకి ఎక్కిన ఆయన తన ప్రసంగాన్ని చిన్నతనంలో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. కొద్ది నిమిషాలకే తనపై వచ్చిన వచ్చిన విమర్శలకు ఒకటి రెండు మాటలలోనే చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. తనలో ఇంతవరకు సినిమా నటుడిని మాత్రమే చూశారని పేర్కొన్నారు. అయితే ఇకపై రాజకీయాలలో తన సత్తా ఏమిటో చూపుతానని స్పష్టంగా చెప్పారు.
ఈ మాటలు చాలు ఆయన మనసు ఏమిటో తెలుసుకోవడానికి. పైగా అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే ఏ రాజకీయ పార్టీకైనా దడ పుట్టక తప్పదు. ఆ జనం చిరంజీవి మాటలు విన్న ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ అయినా ఆయనను అంత తేలికగా తీసుకోనక్కరలేదనే నిర్ణయానికి రావాల్సిందే.
ఇక్కడ ఆయన ప్రసంగాన్ని కూడా అంత తేలిగ్గా తీసి వేయలేం. ఒకవైపు ప్రభుత్వ విధానాలను అవకాశం దొరికిన చోటల్లా తప్పుబట్టారు. అదేసమయంలో తమ పార్టీ విధానం ఏమిటో తెలియజేస్తూనే వచ్చారు. రైతుల ఓట్ల కోసం పార్టీలు గాలం వేస్తున్నాయని తప్పపట్టారు. ఇదే సందర్భంలో రైతులే తమ ప్రథమ లక్ష్యంగా చెప్పారు.
నక్సలైట్లు విషయాన్ని సామాజిక కోణంలో చూస్తూనే పోలీసుల సేవను కొనియాడారు. మరోవైపు సెజ్‌లకు వ్యవసాయ భూములను ఇవ్వడాన్ని ఎత్తి చూపుతూనే నిరుపయోగ భూములను ప్రత్యామ్నయంగా చూపారు. పారిశ్రామికరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అవినీతి కూకటి వేళ్ళతో సహా పెకళించి వేయడానికి నడుం బిగిస్తామని చెప్పారు.
అదే సమయంలో అవినీతి ఎక్కువగా ఉన్న ఉద్యోగ వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. సున్నిత అంశం సున్నిత అంశం అంటూనే తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు. కాని నిర్ణయాన్ని వాయిదా వేశారు. అక్కడి సమస్యలను ప్రస్తావించారు. ఇలా ఎస్సీ వర్గీకరణ, కాపుల బీసీలలో చేర్చడం వంటి అంశాలను లేవనెత్తారు. దీనిని గమనిస్తే ఆయన అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.
అయితే తన ప్రసంగంలో ఆయన చివరకు తన లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం రక్తి కట్టించారు. తాను సమస్యలపై పోరాటం చేయాలని చెబుతూనే పార్టీలతో యుద్ధమనే సవాల్ విసిరారు. ఇక రాజకీయ పార్టీలు కాచుకోవాల్సిందే.