నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఏ మాత్రం నమ్మకం లేదని శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తెలిపారు. దీనికి ఉదాహరణగా గతంలో జరిగిన ఓ సభలో కలము(పెన్ను) శరద్ పవార్ ఇవ్వజూపితే దానిని ఆమె తీసుకోకుండా తన భద్రతా దళాధికారినుంచి తీసుకోవడంతోనే పవార్‌పై ఆమెకు ఏ మాత్రం నమ్మకముందో తెలుస్తుందని ఆయన వివరించారు.
ఆయన ఎన్నికల సభలో ప్రసంగిస్తూ పవార్‌కు రైతులంటే ఏ మాత్రం ప్రేమాభిమానాలు లేవని, వారికి తమ ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన పవార్‌పై మండిపడ్డారు.
ఇదిలావుండగా మాజీ మంత్రి సురేష్ దాదా జైన్ మరియు విజయ్ చౌగులే ఇద్దరూ శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ పార్టీని వీడి శివసేన పార్టీలో చేరడంతో థాకరే పై వ్యాఖ్యలు చేసారు. కాగా సురేష్, విజయ్‌లు ఎన్‌సీపీ పార్టీలో ఉండటంమూలాన శరద్ పవార్ గురించి వీరికి పూర్తి అవగాహన అయ్యిందని, ఆ పార్టీలో ఆత్మగౌరవం అనేది లేదని వారికి అర్థమైందని థాకరే పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలోని ఠాణా ప్రాంతంనుంచి విజయ్ శివసేన పార్టీ తరపున ఎన్నికలలో పోటీ పడుతున్నారు.