రెండో విడతకు సిద్ధం: బరిలో పలువురు ప్రముఖలు

దేశ వ్యాప్తంగా ఈనెల 23వ తేదీన గురువారం జరిగే రెండో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విడతలో 141 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ (కాంగ్రెస్), శరద్‌ పవార్ (ఎన్.సి.పి)‌, రాంవిలాస్‌ పాశ్వాన్ (ఎల్.జె.పి)‌, సుష్మాస్వరాజ్‌ (భాజపా), కమల్‌నాథ్‌ (కాంగ్రెస్), రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌, రఘునాథ్‌ ఝా, అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌, వంటి హేమాహేమీల బరిలో ఉన్నారు.

రెండో విడత ఎన్నికలు ముగిసేసరికి 265 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ పూర్తవుతుంది. అంటే ఏదైనా పార్టీ లేదా పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యకు (మాజిక్‌ ఫిగర్‌) మరో ఏడు స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ జరగాల్సి ఉంటుంది.

మొత్తం 545 మంది సభ్యులున్న పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటుకు 272 స్థానాల మెజారిటీ అవసరం. ప్రస్తుతం 543 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన రెండు స్థానాలకు ఆంగ్లో - ఇండియన్‌ జాతీయులలో ఇద్దరిని నామినేట్‌ చేస్తారు.

రెండో విడతలో అభ్యర్థుల సంఖ్య 2,041
లోక్‌సభకు జరిగే రెండోవిడత ఎన్నికల్లో మొత్తం 2,041 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో 121 మంది మహిళలు ఉన్నారు. ఈ విడతలో ఆంధ్రప్రదేశ్‌లో 20 సీట్లతో సహా అస్సోంలో 11, బీహార్‌లో 13, గోవాలో 2, జమ్మూ-కాశ్మీర్‌ 1, ఒరిస్సా 11, త్రిపుర 2, ఉత్తరప్రదేశ్‌ 17, కర్ణాటక 17, మధ్యప్రదేశ్‌ 13, మహారాష్ట్ర 25, మణిపూర్‌ 1, జార్ఖండ్‌లో 8 పోలింగ్‌ జరుగనుంది. ఐదు దశలవారిగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మొదటి దశలో 124 స్థానాలకు పోలింగ్‌ పూర్తయిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి