మహాకూటమిదే అధికారం...!

రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి టైమ్స్ నౌ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ప్రకారం మహాకూటమికే ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కనున్నాయని తెలిపంది. ఆంధ్రప్రదేశ్‌లోని 42 లోక్‌సభ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 15, తెలుగుదేశం పార్టీ 15, తెలంగాణ రాష్ట్ర సమితి 5, ప్రజారాజ్యం పార్టీ 4, లెఫ్ట్ పార్టీలు చెరి ఒకటి(2), ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపు సాధిస్తాయని ఆ సర్వే వెల్లడించింది.

మొత్తం 22 స్థానాల్లో మహాకూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది. టైమ్స్ నౌ ప్రీ పోల్ సర్వే ప్రకారం 2004 ఎన్నికలతో పోల్చి చూస్తే తెలుగుదేశం పార్టీకి పది స్థానాలు పెరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం ఐదవ విడతపోలింగ్ దశ ముగిసిన వెంటనే పలు టీవీ ఛానెళ్లు సర్వేలను విడుదల చేశాయి.

సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా ముగిసే వరకూ ఎలాంటి సర్వేలు, ముందస్తు అంచనాలు ప్రకటించకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో ఇంతకాలంగా ఆయా సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలను విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ ఫలితాలతో రాష్ట్రంలోని పార్టీలన్నీకూడా కాసింత ఆనందం, కాసింత బెంగతో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతానికి లోక్‌సభ ఫలితాలతోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేయనుందనేదానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. దీంతో బాటు ప్రధాన పట్టణాలలో బేరసారాలు, బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి మే నెల 16వ తేదీ మధ్యాహ్నానికిగాని పూర్తి నిజమైన ఫలితాలు వెల్లడయ్యేంతవరకు ఏ పార్టీ అధికార పీఠం ఎక్కనుందో, ఏ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ ఫైళ్ళపై తొలి సంతకం చేయనున్నారో వేచి చూడాల్సిందే మరి...!

వెబ్దునియా పై చదవండి