తనను నిత్యం వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ హత్య ఎలా చేయాలన్న అంశంపై ఆమె యూట్యూబ్ వీడియోలు చూడటం గమనార్హం. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కరీంనగర్, కిసాన్ నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్ (45) అనే వ్యక్తి జిల్లా గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తుండగా, ఈయనకు భార్య రమాదేవి, కుమారుడు భరత్ ఉన్నారు. అయితే, సంపత్ మద్యం తాగి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతోపాటు ప్రతిరోజూ భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో గత 8 నెలల క్రితం రమాదేవికి కిసాన్ నగర్‌కు చెందిన కర్రె రాజయ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. కరీంనగర్ రైల్వే హమాలీగా పనిచేసే క్రమంలో రాజయ్యకు సంపత్‌తో పరిచయమైంది. జులై 29న తన భార్యతో గొడవపడిన సంపత్ ఇంటి నుంచి వెళ్లిపోయారు.
అదేరోజు రాజయ్య తన స్నేహితుడైన కీసరి శ్రీనివాస్‌తో కలిసి సంపత్‌ను బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్ద మద్యం తాగేందుకు పిలిచాడు. సంపత్ మద్యం మత్తులోకి జారుకున్నాక రాజయ్య... రమాదేవికి ఫోన్ చేయగా తన భర్తను చంపాలని చెప్పింది. వెంటనే రాజయ్య తనవెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవిలో పోయడంతో ఆ ద్రవం మెదడుకు చేరి చనిపోయాడు. ఏమీ తెలియనట్లు భర్త ఇంటికి రాలేదని కుమారుడు భరత్, రాజయ్యతో కలిసి రమాదేవి వెతకడం మొదలు పెట్టింది.
చివరకు ఈ నెల 2వ తేదీన సంపత్ మృతి చెందిన ప్రాంతాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భరత్ తన తండ్రి మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రమాదేవి ఫోన్‌ను పరిశీలించగా అసలు విషయం వెల్లడైంది. తానే రాజయ్యతో కలిసి హత్య చేయించినట్లు ఒప్పుకొంది. పోలీసులు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.