మంచుదుప్పటి కప్పేసినా.. కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం..!!
గురువారం, 15 సెప్టెంబరు 2011 (18:43 IST)
విశాఖపట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే "అనంతగిరులు" సౌందర్యం వర్ణనాతీతం. తూర్పుకనుమలలో భాగంగా విస్తరించిన ఇవి సముద్రమట్టానికి 1150మీటర్ల ఎత్తున ఉన్నాయి. విశాలంగా పరచుకొన్న పచ్చదనం, కాఫీతోటలు, జలపాతాలు, గుబురుచెట్లు.. ఈ ప్రాంతంలో వాటి అందాలను ఆశ్వాదిస్తూ నడకసాగించడం ఒక అందమైన అనుభవం.
పడమటి ప్రాంతాలవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం "హార్స్లీ హిల్స్". తిరుపతికి 150 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తున ఉన్న హార్స్లీ హిల్స్ వేసవి విడిదిగా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇక్కడ శీతాకాలంలో కూడా సందర్శించవచ్చు. అయితే విపరీతమైన చలి ఉంటుంది. ఏపుగా పెరిగిన యూకలిప్టస్, చందనం వృక్షాల నీడల్లోంచి నీలికొండలను స్పృశిస్తూ... చల్లటి గాలిలో తేలుతూ వస్తున్న సంపంగి పరిమళాలతో అలరిస్తుంటుంది.
అలాగే.. గోదావరి నదిలో పాపికొండలు, పట్టిసీమను చుట్టివచ్చే పడవప్రయాణం, కోనసీమలో తిరుగుతుంటే అచ్చం కేరళలో ఉన్నట్టే అనిపిస్తుంది. విశాలమైన గోదావరి ఒక్కసారిగా పాపికొండల దగ్గర వొదిగిన తీరు.. సూర్యాస్తమయం, సాయం సంధ్యవేళలు.. రాత్రవుతుంటే తళుక్కుమనే తారలు కళ్ళలో నింపుకోవాల్సిన అందాలేగానీ మాటలకు అందవు.
ప్రశాంతంగా గడపాలని కోరుకునేవారికి అద్భుతమైన ప్రదేశం "సూర్యలంక బీచ్". గుంటూరుజిల్లా బాపట్ల దగ్గరున్న ఈ బీచ్ హైదరాబాద్‌నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే.. కృష్ణానదిలో విహారానికి విజయవాడ దగ్గర భవానీ ఐల్యాండులో అన్ని సదుపాయాలు ఉన్నాయి. 130 ఎకరాల్లో విస్తరించిన భవానీ ఐల్యాండులో నౌకావిహారం ఓ అందమైన అనుభూతిగా మిగులుతుంది. ఇవేకాకుండా.. కొండపల్లి బొమ్మల తయారీ, నీలపట్టు బర్డ్ శాంక్చురీ, ఉండవల్లి గుహలు, అమరావతి బౌద్ధ స్థూపం తదితర పర్యాటక ప్రాంతాలు బోలెడన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి.