రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఖ్యాతిని పొందిన కృష్ణాజిల్లాకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకరంగంలో విశిష్ఠ స్థానం వుంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పేరు చెప్పగానే నోరూరించే ‘బందరు లడ్డు’ గుర్తుకు వస్తుంది. గతకాలపు రాచరిక వైభవాలకు తీపి గుర్తుగా కొండపల్లి ఖిల్లా ఉండవల్లి గుహలు, విజయవాడలోని మొగల్రాజపురం గుహలు, అక్కన్నమాదన్న గుహలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
విజయవాడకు వచ్చిన ప్రతి ఒక్కరు దుర్గమ్మను దర్శనం చేసుకుని ప్రకాశం బ్యారేజ్ పైనుంచి కృష్ణానదిని చూసి తరిస్తారు. తమ పర్యటన పదికాలాలపాటు పదిలంగా గుర్తు ఉండిపోయేందుకు ‘కొండపల్లి’ బొమ్మలను కొనుగోలు చేస్తుంటారు. విభిన్న రంగులతో మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే కొండపల్లి బొమ్మలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
కొండపల్లి అడవుల్లో లభించే ఒకరకమైన తేలికపాటి పుణికి కర్రతో ఈ చిట్టిపొట్టి బొమ్మలు తయారు చేస్తారు. దశావతారాలు, అంబారిపై రాజు తదితర బొమ్మలకు ఈ రోజుకూ మంచి గిరాకీ వుంది.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొండపల్లి దుర్గం శత్రువులకు అబేధ్యమైన కోట. ఈ దుర్గాన్ని అనవేమారెడ్డి 1360లో నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయల నాటి ఏనుగుశాల, భోజన శాలలు చూడదగినవి. సుమారు 18 కిలోమీటర్లు చుట్టుకొలత ఉన్న ఈ కోట కార్తీకమాసంలో సందర్శకులతో కిటకిటలాడుతుంది. విజయవాడ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి ఖిల్లాకు బస్సు సౌకర్యం వుంది.
విజయవాడ నగరంలోని మొగల్రాజపురం గుహలు చూడదగినవి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దానికి చెందిన ఈ గుహల్లో చెక్కిన మూడు దేవాలయాల్లో ఒకటి మాత్రమే ప్రస్తుతం మంచి స్థితిలో వుంది. విష్ణుకుండినుల కాలానికి చెందిన ఉండవల్లి గుహలు అందమైన శిల్ప పనితనానికి నిదర్శనం. ఉండవల్లి గుహల్లోని అనంతపద్మనాభ స్వామి భారీ విగ్రహం మనోహరంగా వుంటుంది.
విజయవాడలోని గుణదలలో ఉన్న మేరీమాత దేవాలయం క్రెస్తవులకే కాక హిందువులకూడా ఆరాధ్యక్షేత్రం. ఆసియాలో అత్యంత ఎక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకునే క్రెస్తవ ఆలయాల్లో గుణదల కూడా ఒకటి.