భూగర్భ ఊహాతీత ప్రకృతి ప్రసాదం "బెలూం గుహలు"

FILE
బెలూం గుహలను సందర్శించాలనుకుంటే ప్రకృతిని ఆస్వాదించగల హృదయం, కాస్తంత గుండె ధైర్యం ఉండి తీరాల్సిందే. గుహల లోలోపలికి వెళుతుంటే అదో సరికొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. ఆ కొత్త ప్రపంచంలో మనమూ లీనమై, మమేకమై తన్మయత్వంతో ప్రతి అంగుళాన్ని కొత్తగా, వింతగా దర్శిస్తాం. అలాగే ముందుకెళ్తే ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైపోయే ఈ అద్భుత ప్రదేశంలో పర్యటించటమే ఓ గొప్ప అనుభూతిగా మదిలో మిగిలిపోతుంది.

మరి ఇంత అందమైన, ఆశ్చర్యకరమైన బెలూం గుహల్ని దర్శించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొలిమిగుండ్ల మండలానికి చేరుకోవాల్సిందే. అక్కడినుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే బెలూం గుహలను చేరుకోవచ్చు. భారత ఉపఖండంలో మేఘాలయా గుహల తరువాత వీటినే రెండవ అతిపెద్ద గుహలుగా అంచనా వేస్తున్నారు. అత్యంత సహజంగా, అతి పురాతన కాలంలో ఏర్పడిన ఈ గుహల సౌందర్యం వర్ణనాతీతం.

దేశ, విదేశీ, స్థానిక పర్యాటక కేంద్రంగా అలరారుతున్న ఈ బెలూం గుహల ప్రత్యేకత అంతా ఇంతా కాదు. పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిలాస్ఫటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు.. ఇలా వేటికవే ప్రత్యకత సంతరించుకున్న అద్భుతాలు ఈ గుహల్లో ఎన్నో మరెన్నో.
బిలంలాగా ఉండేదనీ...
పూర్వం ఈ గుహల్లోకి వెళ్లేదారి బిలంలాగా ఉండేదనీ, అందుకే వీటిని బిలం గుహలుగా పిలిచేవారని, అదే పేరు కాలక్రమంలో బెల్లం గుహలుగా కాలక్రమేణా పేరుమార్చుకున్నాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇకపోతే.. ఈ గుహలు విశాఖపట్నం జిల్లాలో ఉన్న బొర్రా గుహలకంటే...


బెలూం గుహల చరిత్రను చూస్తే.. ఈ గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు పురాతత్వ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. క్రీస్తు పూర్వం 4,500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మానవులు నివసించినట్లు ఈ గుహల్లో లభించిన మట్టి పాత్రలవల్ల తెలుస్తోంది. 1884లో మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు ఈ గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు. తరువాత ఒక దశాబ్దంపాటు వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు.

అయితే 1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం ఈ గుహలను సందర్శించి, పరిశీలించింది. ఆ తరువాతనే వాటి ఉనికి ప్రపంచానికి వెల్లడయ్యిందని చెబుతుంటారు. సుమారు భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న ఈ గుహలను సందర్శించేందుకు 2002 ఫిబ్రవరి నెల నుంచి పర్యాటకులకు అనుమతిచ్చారు.

ఇక అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, వాటి చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీన పరచుకోగా, 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చాయి. పర్యాటకుల సౌకర్యార్థం 1.5 కిలోమీటర్ల మేర గుహలలో సిమెంట్, స్లాబ్ రాళ్లతో నడిచేందుకు అనువుగా పర్యాటక శాఖ దారిని నిర్మించింది.

అంతేగాకుండా.. గుహల సహజత్వానికి ఎలాంటి లోపం రాకుండా, వాటి అందాలు ద్విగుణీకృతం అయ్యేలా పర్యాటక శాఖ అనేక విద్యుత్ దీపాలను అమర్చింది. దిగుడు బావి మాదిరిగా ఉండే ప్రవేశ ద్వారాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చి, భూమికి 20 మీటర్ల అడుగున ఉండే గుహల్లోకి వెళ్లేందుకు వీలుగా మెట్లను నిర్మించింది. గుహల్లో పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకుగానూ గాలిని పంపించే ఆక్సిజన్ బోయర్లను సైతం ఏర్పాటు చేసింది.

అలాగే గుహల లోపలి భాగంలో ఫౌంటెయిన్, కృత్రిమ కొలనులను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గుహలకు దిగుడు బావిలాగా మూడు దారులు ఉండగా, మధ్యలో ఉండే దారి గుహల్లోకి ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతోంది.

కాగా.. పూర్వం ఈ గుహల్లోకి వెళ్లేదారి బిలంలాగా ఉండేదనీ, అందుకే వీటిని బిలం గుహలుగా పిలిచేవారని, అదే పేరు కాలక్రమంలో బెల్లం గుహలుగా కాలక్రమేణా పేరుమార్చుకున్నాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇకపోతే.. ఈ గుహలు విశాఖపట్నం జిల్లాలో ఉన్న బొర్రా గుహలకంటే చాలా పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలూ, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలరీలు అనేకం ఉన్నాయి.

ఈ గుహల్లో లభించిన 4,500 సంవత్సరాలనాటి పాత్రల అవశేషాలను చూస్తే, వాటి పురాతనత్వం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడే స్ఫటికాల్లాంటి శిలాకృతులను "స్టాలక్ టైట్"లని, కిందినుంచి పైకి మొలచుకుని వచ్చినట్లుగా కనపడే ఆకృతులను "స్టాలగ్ మైట్"లని పిలుస్తుంటారు.

వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగ లాంటి పేర్లతో పిలుచుకుంటున్నారు. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం మాత్రం పర్యాటకులను భక్తిభావంతో పరవశించిపోయేలా చేస్తుంటుంది. అలాగే గుహల్లో ఉన్న పాతాళ గంగ అనే నీటి మడుగు, ఆ నీటిమడుగుపై వేలాడే స్ఫటిక శిలాకృతులు మరో ప్రపంచంలో విహరిస్తున్నట్లుగా చేస్తాయి.

ఇంతకీ ఈ గుహలను చేరుకోవాలంటే.. బెలూం గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నైరుతీ దిశలో ఈ గుహలు ఉన్నాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సందర్శనకు అనుమతించే ఈ గుహలను చేరాలంటే కర్నూలు జిల్లా నుంచి 110, హైదరాబాద్ నుంచి 320, బెంగళూరు నుంచి 320, నంద్యాలకు 70, తాడిపత్రికి 35, జమ్మలమడుగుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కర్నూలు, నంద్యాల మీదుగా లేదా అనంతపురం తాడిపత్రి మీదుగా లేదా కడపజిల్లా జమ్మలమడుగుమీదుగా రోడ్డుమార్గంలో వెళ్లవచ్చు. రైల్లో అయితే తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో దిగి, అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా వెళ్లవచ్చు.

వెబ్దునియా పై చదవండి