సంపెంగల సువాసనలో స్వాగతం పలికే "హార్సిలీ హిల్స్"

FILE
తూర్పు కనుమల్లోని దక్షిణ భాగం కొండల వరుస అయిన "హార్సిలీ హిల్స్" ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశంగా పేరుగాంచింది. ఆంధ్రా ఊటీగా, రాయలసీమ వేసవి విడిదిగా పర్యాటకుల మన్ననలు అందుకుంటున్న ఈ ప్రదేశంలో ప్రకృతి అందాలకు ఏ మాత్రం కొదవలేదు. ఆహ్లాదకరమైన వాతావరణంతో సాగిపోయే హార్సిలీ హిల్స్ కొండదారి పొడవునా.. దారికి ఇరువైపులా అనేక నీలగిరి జాతుల చెట్లు, సంపెంగ తోటలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి.

సముద్ర మట్టానికి 1,265 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీ హిల్స్ సంపెంగ పువ్వులకు ప్రసిద్ధి. గమ్మత్తైన సంపెంగ పువ్వుల సువానలతో హార్సిలీ హిల్స్ పర్యాటకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్తున్నట్లుగా ఉంటుంది. ఈ కొండవాలుల్లో సంపెంగ పూల చెట్లను అక్కడ నివసించే చెంచు జాతుల ప్రజలు నాటారు. వీటితో పాటుగా చందనం, ఎర్రచందనం, కలప, రీటా, షీకాకాయ, యూకలిప్టస్, అల్లమంద, జాక్రండ ఉసిరికాయల చెట్లు ఇక్కడ కోకొల్లల్లుగా ఉన్నాయి.

హార్సిలీ హిల్స్‌లో చలికాలం ఉష్ణోగ్రత కేవలం మూడు డిగ్రీలే ఉంటుంది. అదే వేసవిలో దాదాపు 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌తో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని అడవులు, ఔషధ గుణాలు గల చెట్లతో అలరారుతున్న హార్సిలీ హిల్స్‌లో చూడదగ్గ ప్రదేశాలు తక్కువే అయినా ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ ప్రాంతంలో జింకలు, చిరుతపులులవంటి వన్యమృగాలు కూడా సంచరిస్తూ, చూపరులకు కనువిందు చేస్తుంటాయి.

ఇక్కడ ముఖ్యంగా చూడదగిన ప్రదేశాలలో "రిష్ వ్యాలీ స్కూల్" ఒకటి. ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హార్సిలీ హిల్స్‌లో రిషీ వ్యాలీ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు అక్కడే ఉంటూ విద్యాభ్యాసం చేస్తారు.

"ఏనుగు మల్లమ్మ కొండ" అనేది దీని అసలు పేరు కలిగిన హార్సిలీ హిల్స్‌లో చూడదగ్గ మరో ప్రదేశం "మల్లమ్మ దేవాలయం". ఈ ప్రాంతంలో దేవతగా వెలుగొందుతున్న మల్లమ్మ దర్శనార్థం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు. హార్సిలీ హిల్స్‌ వచ్చే ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని, ఆమె దీవెనలు అందుకుని తిరుగుముఖం పడుతుంటారు.

మరో చూడదగ్గ ప్రదేశం "కౌండిన్య వన్యప్రాణి సంరక్షణా కేంద్రం". ఇది హార్సిలీ హిల్స్‌కు 87 కి.మీ. దూరంలో నెలవైయుంది. ఈ కేంద్రంలో ఏనుగులు, చిరుత పులులు, అడవి పిల్లులు, నక్కలు, పులులు వంటివి ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ ఔషధ గుణాలు కలిగిన చెట్లు అనేకం ఉన్నాయి. ఇక 142 సంవత్సరాల వయస్సు కలిగిన యూకలిప్టస్ చెట్టును హార్సిలీ హిల్స్‌లో చెప్పుకోదగ్గ, చూడదగ్గ ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా చెప్పవచ్చు.

FILE
ఇక ఏనుగు మల్లమ్మ కొండకు "హార్సిలీ హిల్స్" అనే పేరు ఎలా వచ్చిందంటే.. ప్రస్తుతం ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని ఈ ప్రాంతం ఒకప్పుడు కడప జిల్లాలో ఉండేది. కడప అసలే వేడి ప్రదేశం. బ్రిటీష్ హయాంలో కలెక్టర్‌గా ఉన్న డబ్ల్యూ.హెచ్.హార్సిలీ ఎక్కువగా ఈ కొండకు వచ్చేవారు. ఆయనకు విశ్రాంతి నిలయంగా ఉన్న ఈ ప్రాంతం కొన్ని రోజుల తరువాత మెల్లగా అయనకు వేసవి విడిదిగా మారిపోయింది.

వేసవి విడిదిగా హార్సిలీ ఇక్కడ ఒక ఇంటిని నిర్మించారు. దీన్నే ఫారెస్టు బంగ్లా అని పిలుస్తుంటారు. ఆ తరువాత ఇక్కడే ఒక కార్యాలయ భవనం నిర్మించారు. కాగా.. ఈ భవనాలు ఇప్పటికీ నివాస యోగ్యంగా ఉండి, వాడుకలో ఉన్నాయి. ఫారెస్టు బంగ్లాలోని నాలుగు గదుల్లో ఒక దానికి హార్సిలీ పేరు పెట్టారు.

హార్సిలీ ప్రతి వేసవిలోనూ అన్ని అధికారిక కార్యక్రమాలను ఇక్కడ నుంచే కొనసాగించేవారు. అలా క్రమంగా ఈ ప్రాంతానికి హార్సిలీ హిల్స్‌ అనే పేరు పడిపోయింది. చుట్టూ దట్టమైన చెట్లు, అనేక రకాల జంతువులు, అక్కడక్కడ పచ్చిక బయళ్లతో ప్రజల్ని విశేషంగా ఆకట్టుకునే ఈ ప్రాంతంలో చెంచు జాతికి చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

హార్సిలీ హిల్స్‌కు చేరుకోవటం ఎలాగంటే.. విమాన మార్గంలో వచ్చే పర్యాటకులు బెంగళూరు లేదా తిరుపతి విమానాశ్రయాలకు చేరుకోవాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గాన హార్సిలీ హిల్స్ చేరుకోవలసి ఉంటుంది. రైలు మార్గాన చేరుకోవాలనుకునే వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడకు తరచుగా ఉండే రైలు సర్వీసులు కాస్త తక్కువగా ఉంటాయి. పాకాల-ధర్మవరం మార్గంలో మదనపల్లి రోడ్ సమీపంలోని రైల్వే స్టేషన్‌ వరకు ఆపై రోడ్డు మార్గంలో వెళితే సరిపోతుంది.

రోడ్డుమార్గంలో అయితే.. తిరుపతి, బెంగళూరు, కడప, అనంతపురం, కర్నూలు, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌లనుంచి నేరుగా బస్సులు మదనపల్లికి ఉన్నాయి. మదనపల్లి నుంచి హార్సిలీ హిల్స్ వెళ్లేందుకు ప్రతి అరగంటకు ఒక బస్సు సిద్ధంగా ఉంటుంది. స్తోమత కలిగినవారు మదనపల్లి నుంచి అద్దె వాహనాలలో కూడా వెళ్లవచ్చు. ఇక తిరుపతి నుంచి కూడా హార్సిలీ హిల్స్‌కు నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. వసతి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ వసతి సమూహాలు, చిత్తూరు సహకార సంఘం అతిథి గృహం, మరికొన్ని ప్రైవేటు వసతి గృహాలు అందుబాటులో ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి