15 రాత్రుల్లో 121 మంది మహిళలతో సుఖభోగం... వారిపై ఆ శాస్త్రం ప్రభావం..
గురువారం, 11 ఏప్రియల్ 2019 (15:16 IST)
గ్రీస్ పతనమైన తర్వాత చైనాలో గణితశాస్త్రం కొత్త శిఖరాలను అధిరోహించింది కాలాన్ని కొలవడం నుంచి సాగరంలో ప్రయాణించడం వరకూ.. ప్రాచీన నాగరికతలకు ప్రధాన ఇరుసుగా ఉన్నది గణితశాస్త్రం. గణితశాస్త్రం ప్రయాణం ఈజిప్టు, మెసొపటేమియా, గ్రీస్‌లలో మొదలైంది. కానీ ఈ నాగరికతలు క్షీణించిన తర్వాత పశ్చాత్య దేశాల్లో గణితశాస్త్రం పురోగతి ఆగిపోయింది. అయితే.. తూర్పు ప్రపంచంలో గణితశాస్త్రం శక్తివంతమైన శిఖరాలకు చేరుకుంది.
ప్రాచీన చైనాలో.. వేల మైళ్లు విస్తరించిన మహా కుడ్యం (గ్రేట్ వాల్) నిర్మాణానికి గణితమే కీలకమైంది. అంతేకాదు.. చక్రవర్తి పరిపాలనా వ్యవహారాల నిర్వహణలోనూ గణాంకాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. చైనాలో సామ్రాజ్య అంత:పుర వ్యవస్థను వారసత్వ అవకాశాలను పెంచటానికి అనుగుణంగా రూపొందించారు.
గణాంక ప్రేమాయణ ప్రణాళిక...
చక్రవర్తి నిర్ణయాలన్నిటి మీదా - ఆయన ఏ రోజు, ఏ రాత్రి ఏ పని చేయాలన్నది కూడా - కేలండర్, గ్రహాల కదలికలు ప్రభావం ఉండేది. చక్రవర్తి తన అంతఃపురంలో ఉన్న ఎంతోమంది స్త్రీలతో ఎప్పుడెప్పుడు ఎవరితో శయనించాలో సూచిస్తూ ప్రాచీన రాజాస్థాన సలహాదారులు ఒక వ్యవస్థను తయారుచేశారు.
రేఖాగణిత శ్రేణి (జియోమెట్రిక్ ప్రోగ్రెషన్) అనే గణిత సిద్ధాంతం ఆధారంగా దీనిని రూపొందించారు. చక్రవర్తి 15 రాత్రుల్లో 121 మంది స్త్రీలతో శయనించాల్సి ఉండేదని ప్రాచీన గాథ చెప్తోంది.
1 మహారాణి
3 సీనియర్ సహచరిణిలు
9 మంది భార్యలు
27 మంది ఉంపుడుగత్తెలు
81 మంది బానిసలు
ప్రతి మహిళా బృందం.. మొదటి బృందం కన్నా మూడు రెట్లు పెద్దగా ఉంటుంది. కాబట్టి.. చక్రవర్తి 15 రాత్రుల్లో తన అంతఃపురంలో ఉన్న ప్రతి మహిళతోనూ శయనించేలా గణిత నిపుణులు ఒక ఆవర్తన వలయం (రోటా) రూపొందించారు.
చైనా తొలి సార్వభౌముడు క్రీస్తుపూర్వం 2800 సంవత్సరంలో తను పూజించే ఒక దేవత ద్వారా అంకెలను సృష్టింపజేశారని చైనా పురాణ గాధ చెప్తోంది
పున్నమి రోజుల్లో స్త్రీ, పురుష శక్తులు
మొదటి రాత్రిని మహారాణికి రిజర్వు చేశారు.
రెండో రాత్రి ముగ్గురు సీనియర్ సహచరిణిలకు కేటాయించారు.
మూడో రాత్రి తొమ్మిది మంది భార్యల వంతు.
ఆపైన 27 మంది ఉంపుడుగత్తెలను ఒక్కో రాత్రికి తొమ్మిది మంది చొప్పున విభజించి.. వారికి మూడు రోజులు కేటాయించారు.
చివరిగా 81 మంది బానిస స్త్రీలను తొమ్మది మంది చొప్పున విభజించి తొమ్మిది రోజులు కేటాయించారు.
పౌర్ణమి సమీపంలో ఉన్నపుడు అత్యున్నత శ్రేణి స్త్రీలతో చక్రవర్తి శయనించేలా కూడా ఈ రోటాను తయారు చేశారు. పున్నమి రోజుల్లో ఆయా మహిళల స్త్రీశక్తి అత్యధిక స్థాయిలో ఉంటుందని.. అప్పుడు చక్రవర్తి పురుషశక్తితో సమానంగా ఉండగలదని ఈ రోటా రూపకర్తల ఆలోచనగా చెప్తారు. ఈ ఏర్పాటు ఉద్దేశం.. సామ్రాజ్యానికి సాధ్యమైనంత ఉత్తమ వారసుడిని పొందటమేనన్నది స్పష్టం.
గణితశాస్త్రం మీద ఆధారపడింది కేవలం చక్రవర్తి ఆంతరంగిక మందిరం ఒక్కటే కాదు. రాజ్యాన్ని నడపటానికి కూడా గణితమే కేంద్రంగా ఉంది.
ప్రాచీన చైనీయులు అంకెల్లో క్రమానుగతాల మీద కూడా దృష్టి పెట్టారు.
అంకెలకు మహత్తులు
ప్రాచీన చైనా చాలా విస్తారమైన, ఇంకా పెరుగుతూ ఉన్న సామ్రాజ్యం. దానికి కఠినమైన చట్టం ఉంది. విస్తృత పన్నులు ఉన్నాయి. బరువులు, కొలతలు, నగదుకు సంబంధించి ప్రామాణిక వ్యవస్థ ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో దశాంశ పద్ధతి అమలులోకి రావటానికి దాదాపు 1,000 సంవత్సరాల ముందే చైనాలో దశాంశ పద్ధతి ఉపయోగంలో ఉంది. అంతేకాదు.. పశ్చిమ దేశాల్లో పంతొమ్మిదో శతాబ్దం వరకూ కనిపించని రీతుల్లో చైనాలో ప్రాచీన కాలం నుంచే సమీకరణలను (ఈక్వేషన్లను) పరిష్కరించేవారు.
చైనా మొదటి సార్వభౌముడు ఎల్లో ఎంపరర్.. అంకెలకు విశ్వాంతర ప్రాధాన్యం ఉందని విశ్వసిస్తూ.. తను పూజించే ఒక దేవత ద్వారా గణాంకశాస్త్రాన్ని సృష్టింపజేశారని చైనా పురాణగాథ చెప్తోంది. ఈనాడు కూడా అంకెలకు మహత్తులు ఉన్నాయని చాలా మంది చైనీయులు నమ్ముతారు. బేసి సంఖ్యలను పుంలింగంగానూ, సరి సంఖ్యలను స్త్రీలింగంగానూ పరిగణిస్తారు. నాలుగో అంకె(4)ను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవాలన్నది వారి విశ్వాసాల్లో ఒకటి. అదే సమయంలో ఎనిమిది (8) సిరిసంపదలను తెచ్చిపెడుతుందనీ నమ్ముతారు. అలాగే.. అంకెలలో క్రమానుగతాల మీద కూడా ప్రాచీన చైనీయులు దృష్టి పెట్టారు. అలా తమదైన సుడోకును తయారు చేశారు.
ప్రాచీన చైనా జ్యోతిష్యశాస్త్రంలో ఉపయోగించిన శిష్ట శిద్ధాంతాన్ని (రిమెయిండర్ థియోరమ్) ఆరో శతాబ్దం నాటికల్లా గ్రహాల కదలికలను కొలవటానికి ఉపయోగించేవారు. ఇది ఇప్పటికీ ఇంటర్నెట్ క్రిప్టోగ్రఫీ వంటి వాటిల్లో ఉపయోగపడుతోంది.