చాక్లెట్ ఇస్తాను.. ఐస్‌క్రీం పెట్టిస్తాను.. రమ్మని పిలిచే తాతయ్యో.. మామయ్యో.. ఈ వరుసలను అడ్డుపెట్టుకుని చిన్నారులను చిదిమేస్తున్నారని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలపై జరిగిన అత్యాచార కేసుల్లో దాదాపు నిందితులంతా బాధితులకు దగ్గరివారే. బంధువులు, కుటుంబ స్నేహితులు, ఇరుగు పొరుగులు.. ఇలా పలురూపాల్లో కాలనాగులై కాటేస్తున్నారు.
మహిళలపై జరిగే అత్యాచార కేసుల్లోనూ ఇదే తీరు. 2017లో 988 అత్యాచార కేసులు నమోదవగా.. వాటిల్లో 934 కేసుల్లో (94.53 శాతం) నిందితులు.. బాధితులకు పరిచయస్తులే. సగానికి పైగా కుటుంబ స్నేహితులు, ఇరుగుపొరుగు వారే ఉన్నారు. మొత్తం కేసుల్లో కేవలం 54 కేసుల్లోనే నిందితులు.. బాధితులకు తెలియనివారు.
తెలిసినవారెవరైనా.. ద్వంద్వార్థాలతో మాట్లాడటం, ప్రవర్తనలో తేడాలు, తాకడానికి ప్రయత్నం చేస్తుంటే వారికి దూరంగా ఉండాలని.. మొదటే కుటుంబ సభ్యులకు చెప్పాలని విజయవాడలోని వాసవ్య మహిళామండలి అధ్యక్షురాలు కీర్తి సూచించారు. ‘‘సహోద్యోగులు తప్పుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి పిల్లలకు తల్లిదండ్రులు వివరించాలి. పిల్లలను ఎవరితో ఒంటరిగా వదలకుండా జాగ్రత్తపడాలి’’ అని ఆమె అప్రమత్తంగా ఉండటం గురించి వివరించారు.