ఒంగోలు గ్యాంగ్ రేప్: నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒక వికలాంగుడు
బుధవారం, 26 జూన్ 2019 (18:31 IST)
తెలుగు రాష్ట్రాల్లో మైనర్లపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస ఘటనలతో, మైనర్లకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తున్నాయి. ఈ ఘటనల తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్నా, భద్రత విషయంలో ముందస్తు చర్యలు అవసరం అనే డిమాండ్ వినిపిస్తోంది.
తాజాగా ఒంగోలులో మైనర్ బాలికను ఏడు రోజులపాటు నిర్బంధించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనలో ఆరుమంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాధితురాలితోపాటు నిందితుల్లో ముగ్గురు మైనర్లు.
ఆస్పత్రి పరిచయం ఒంగోలుకు రప్పించింది
పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, గుంటూరుకు చెందిన 15 ఏళ్ల బాలిక తన తాతయ్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి వచ్చేది. అక్కడ, ఒంగోలు పట్టణానికి చెందిన డ్రైవర్ అమ్మిశెట్టి రాము అనే వ్యక్తితో ఆ బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ స్నేహంతో ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడేవారని, ఇది తెలిసి బాలిక తల్లి ఆమెను మందలించిందని పోలీసులు తెలిపారు. తల్లి మందలించాక, అమ్మిశెట్టి రాము సలహా మేరకు ఆ బాలిక గుంటూరు నుంచి ఈ నెల 16న ఒంగోలుకు వెళ్లింది.
ముందస్తు ప్రణాళిక ప్రకారం రాము ఆమె కోసం ఒంగోలు బస్టాండ్‌కు రావాలి. కానీ రాము అక్కడ కనిపించకపోవడంతో, ఏంచేయాలో తెలియని బాధితురాలు తీవ్ర ఆందోళనకు గురైంది. బస్టాండ్ దగ్గర ఒక సెల్ షాపులో ఉన్న షేక్ బాజీ వద్ద మొబైల్ తీసుకుని తన స్నేహితుడు రాముకు ఫోన్ చేసింది. కానీ, రాత్రి 11గంటల వరకు రాము అక్కడకు రాకపోవడంతో, ఇదే అవకాశంగా భావించిన షేక్ బాజీ, బాలికను తన షాపులోకి బలవంతంగా లాక్కుని అత్యాచారం చేశాడు. ఆ రాత్రంతా బాలికను తన షాపులోనే ఉంచాడని పోలీసులు తెలిపారు.
మరుసటి రోజు రాము వద్దకు తీసుకువెళతామని చెప్పి, షేక్ బాజీ, మరొక మైనర్ బాలుడి సాయంతో బాలికను తన రూమ్‌కు తీసుకుపోయాడు. అక్కడ తన మిత్రులు రావుల శ్రీకాంత్ రెడ్డి, పాత్ర మహేష్‌తో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు వివరించారు.
శక్తి టీమ్ గుర్తించడంతో
7 రోజుల తర్వాత 22వ తేదీ సాయంత్రం నిందితుల్లో ఒకరు బాలికను బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు. ఒంటరిగా ఉన్న బాలికను అక్కడే ఉన్న హోం గార్డ్ గుర్తించి, శక్తి టీమ్‌కు అప్పగించారు. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లను జువైనల్ హోమ్‌కు పంపారు. బాధితురాలిని తొలుత రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఒంగోలులోని స్త్రీ శిశు సదన్‌లో ఆమెకు పునరావాసం కల్పించారు.
దివ్యాంగుడు బాజీ ఎవరు?
సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామానికి చెందిన షేక్ బాజీ గతం గురించి ఈనాడు పత్రికలో ఓ వార్త వచ్చింది. ఆ కథనంలో, షేక్ బాజీ తండ్రి మానసిక వికలాంగుడని, అతని తల్లి కష్టపడి ముగ్గురు చిన్నారులను పెంచిందని ఆ పత్రిక తెలిపింది. బాజీ జీవితానికి సంబంధించి మరిన్ని విషయాలు చెబుతూ... ఒంగోలు బస్టాండ్‌లో బిక్షాటన చేసుకుంటున్న బాజీకి పలువురు ఆశ్రయం కల్పించారు. రెండు ముంజేతులు లేకపోయినప్పటికీ అతను చేసే పనులు అందరినీ ఆకట్టుకునేవి. పోలీసులు కూడా బాజీ కోరిక మేరకు ఒకరోజు ఎస్‌హెచ్ఓగా ఉండేందుకు అంగీకరించారని ఆ పత్రిక తెలిపింది. ఆ రీతిలో సెల్ షాపులో పనిచేస్తూ, ఒంగోలు బస్టాండ్ సమీపంలో మిత్రులతో కలిసి ఉండేవాడు.
అత్యాచారం కేసులో ముగ్గురు మైనర్లు!
బాధితురాలితోపాటు, తనపై అత్యాచారం చేసినవారిలో ముగ్గురు నిందితులు కూడా మైనర్లే. వారంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒంగోలులో చదువుతూ, ఒక రూమ్‌లో ఉంటున్నారు. బాజీ, అతడి ఇద్దరు స్నేహితులు బాలికపై అత్యాచారం చేశాక, మైనర్లు అయిన విద్యార్థులను కూడా, బాలికపై అత్యాచారం చేయడానికి ఉసిగొల్పారని, వారంతా బాధితురాలి పట్ల పైశాచికంగా ప్రవర్తించారని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియాకు వెల్లడించారు. ఆరుగురు యువకులు కలిసి, బాలికను ఏడు రోజులపాటు నిర్బంధించి, అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఆమెను తీవ్రంగా వేధించి, హింసించినట్లు తెలిపారు.
నిందితులు అందరిలో అవే లక్షణాలు
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఏ1 షేక్ బాజీతోపాటుగా ఏ2, ఏ3 కూడా ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలుకి వలస వచ్చారు. ఏ పని దొరికితే అది చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారని, ఆ మత్తులోనే బాలిక పట్ల పైశాచికంగా ప్రవర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఒంగోలులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారిలో చాలామంది ఇదే రీతిగా పక్కదారి పడుతున్న పరిస్థితిని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడానికి పోలీసులు ఒక ప్రాజెక్ట్ కూడా చేపట్టారు. గతంలో ఎస్పీగా పనిచేసిన సత్య ఏసుబాబు, ఈ అంశంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని భావించారు. అయితే ఈలోగా ఆయన బదిలీ జరగడంతో ఆ ప్రయత్నం ముందుకు వెళ్లలేదు.
ఉపాధి - నేరాలు
జిల్లాలో కరువు కూడా యువతను పెడదారులు పట్టించడానికి కారణంగా మారిందని ఒంగోలు నగరానికి చెందిన జర్నలిస్ట్ ఎన్.వెంకట్రావు వ్యాఖ్యానించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "గడిచిన ఐదేళ్లుగా లోటు వర్షపాతం నమోదవుతోంది. ఏటా కరువు మండలాలను కూడా ప్రకటిస్తున్నారు. ఉపాధి లేక గ్రామాల నుంచి పలువురు వలసలు పోతున్నారు. యువకులు కూడా పది, ఇంటర్ చదివి పట్టణాలకు ఉపాధి కోసం వచ్చేస్తున్నారు.
ఎక్కువమంది మోటార్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. యుక్త వయసులో తల్లిదండ్రులకు దూరంగా, ఒంటరిగా ఉంటున్న వీరు చెడు స్నేహాల కారణంగా పక్కదారి పడుతున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేయడం, ఇలాంటి ఘటనలకు పాల్పడడం తరచూ జరుగుతున్నాయి. కొన్ని సార్లు మాత్రమే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి యువతపై దృష్టి పెట్టకుండా పరిస్థితి చక్కదిద్దడం సాధ్యం కాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
మానసిక నిపుణులు ఏమంటున్నారు?
తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, ఎంతో కొంత సంపాదిస్తున్న యువత త్వరగా పక్కదారి పట్టే అవకాశం ఉందని ప్రముఖ సైకాలజిస్ట్ పద్మా కమలాకర్ అభిప్రాయపడ్డారు. బీబీసీతో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘మానసికంగా యువత ఆలోచనలు స్థిరంగా ఉండవు. అదే సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు మరింత చంచలత్వం ఉంటుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా ఆదాయం వస్తున్నప్పుడు స్వేచ్ఛాయుతంగా వ్యవహరిస్తారు. స్నేహాల ప్రభావానికి గురవుతారు. వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అవసరం. లేనిపక్షంలో పలు నేరాలకు కారకులవుతారు. ఒంగోలు ఘటన కూడా అదే చాటుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం పట్టణాలకు వలస వస్తున్న వారి విషయంలో కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.
ఎన్.సి.ఆర్.బి. నివేదిక ఏంచెబుతోంది?
జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్.సి.ఆర్.బి) నివేదిక-2016 ప్రకారం ఏపీలో మైనర్లపై దాడులు పెరుగుతున్నాయి. 2016లో 994 రేప్ కేసులు నమోదయితే అందులో 463 మంది బాలికలు బాధితులుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే లైంగికదాడుల కేసులు 18% పెరిగాయి. తాజాగా సోమ, మంగళవారాల్లో జరిగిన సీఎం సమీక్షా సమావేశంలో మహిళలపై పెరుగుతున్న దాడుల గురించి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రస్తావించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
గుంటూరు బాలికపై ఒంగోలులో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఘటన అనంతరం స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలిసి ఒంగోలు వెళ్లి, బాధితురాలిని కలిసి మాట్లాడారు. ఆమెకు పరిహారం కూడా ప్రకటించారు.
ఈ ఘటనపై ఆమె బీబీసీతో మాట్లాడుతూ... "బాధితురాలిని ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం. ఇప్పటికే ఆమెకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాం. ఆమె సంపూర్ణంగా కోలుకునే వరకూ సహకరిస్తాం. ఘటనలో నిందితులను 5 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశాం. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.