ఆంధ్రప్రదేశ్‌: నేలకూలిన ఇళ్లు, నీళ్లలో నానుతున్న గ్రామాలు, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

బిబిసి

గురువారం, 1 ఆగస్టు 2024 (13:37 IST)
భారీ వర్షాల, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరద ఉధృతితో జూలై 31 నాటికి వందల గ్రామాలు వరద నీటిలో నానుతున్నాయి. భారీ సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. వేల మంది నిర్వాసితులయ్యారు. లక్ష ఎకరాలకు పైగా పొలాలు నీటమునిగాయి. చాలా చోట్ల రోడ్లు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాలతో పాటు పెద్దవాగు డ్యామ్ కొట్టుకుపోయిన కారణంగా దిగువన ఉన్న గ్రామాల్లో ఈసారి వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని లంకవాసులకు కూడా అపారనష్టం సంభవించింది. గోదావరి పరీవాహక, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
 
అపారనష్టం..
ఏపీలోని అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో గోదావరి వరదల కారణంగా 21,051 మంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని, వారిలో 13,289 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. వారి కోసం 82 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఓ వైపు భారీ వర్షాలు, మరోవైపు గోదావరి ఉధృతితో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
 
శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. 10 జిల్లాల పరిధిలోని 96 మండలాల్లో నష్టం జరిగింది. మొత్తం 525 గ్రామాలపై వరద ప్రభావం ఉందని, మరో 230 గ్రామాల్లో వర్షపు నీటి చేరికతో నష్టం జరిగిందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల పరిధిలో ప్రాథమిక అంచనాల ప్రకారం, అగ్రికల్చర్ 43,234 హెక్టార్లు, హార్టీకల్చర్ 2,728.45 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇంకా వరదల తాకిడి కొనసాగుతున్నందున తుది అంచనాలు వేసేందుకు సమయం పడుతుందని ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
 
పెద్దవాగు గండితో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకి గండిపడింది. ఒక్క రోజు వ్యవధిలోనే ఎగువన సుమారుగా 18 సెంటిమీటర్ల వర్షం కురవడంతో ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది. సకాలంలో గేట్లు పనిచేయకపోవడంతో కట్ట తెగిపోయింది. దీంతో తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలో నాలుగు గ్రామాలతో పాటు ఏపీలోని వేలేరుపాడు మండలంలో 8 గ్రామాలను వరద ముంచెత్తింది. ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన ఉన్న కమ్మరిగూడెం, రమణక్కపేట వంటి కొన్ని గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని నేలకూలాయి. నేటికీ తలదాచుకునే నీడలేక అనేక మంది మిగిలిన శిథిలాల మధ్యలో పట్టాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.
 
"ఒక్కసారిగా వరద నీరు వచ్చిపడింది. మేమంతా తలోదిక్కుకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాం. ఇప్పుడు ఇల్లు కూలిపోయింది. అన్ని వస్తువులు పాడైపోయాయి. సహాయక బృందాలు అందించిన వస్తువులను వాడుకుంటున్నాం. నేలమీద పడుకోబెడితే రాత్రి పూట పురుగులు, పాములు వస్తాయనే భయంతో మంచం మీద పిల్లలను పడుకోబెతున్నాం" అని వేలేరుపాడు మండల వాసి సునీత బీబీసీతో చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలకు రూ.3 వేల చొప్పున తక్షణ నష్టపరిహారం ప్రకటించింది. బియ్యం, నిత్యవసరాలు వంటివి అందిస్తోంది.
 
అయితే, పరిహారం పంపిణీలో న్యాయం జరగడంలేదని బాధితులు అంటున్నారు. ఇసుక మేటల కారణంగా సాగుకు అవకాశం లేకుండా పోయిన పొలాల విషయంలోనూ ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఇంకా వరద పూర్తిగా తగ్గకపోవడంతో కొండలపై తలదాచుకున్న వారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు ఆశిస్తున్నారు. కట్టుబట్టలతో సహా, రేషన్ కార్డు వంటివి కూడా వరదల్లో కొట్టుకుపోయాయని, కానీ తక్షణ సాయం కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేలు కావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందేననే షరతు పెడుతున్నారని సునీత చెప్పారు.
 
వరద కన్నా బురదతో కష్టాలు..
వరద కారణంగా జరిగిన నష్టం ఓ భాగమైతే, వరద తగ్గిన తర్వాత ఇంటినిండా పేరుకుపోయిన బురదను తొలగించడం తలకుమించిన భారం అవుతోందని బాధితులు అంటున్నారు. ఏటా భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరితే చాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని అంటున్నారు. ఈసారి భద్రాచలం వద్ద అత్యధికంగా 53.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి వరద ప్రవాహం సాగింది. దానికితోడు శబరి కూడా ఉప్పొంగింది. ఫలితంగా కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని పోలవరం నిర్వాసిత గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. ఎటపాక, దేవీపట్నం, పోలవరం మండలాల్లోని ప్రభావిత గ్రామాల ప్రజలు కూడా ఇబ్బందులకు గురయ్యారు.
 
వరదల కారణంగా అనేక మంది సహాయక శిబిరాలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. తామంతా పదిరోజుల పాటు కొండమీద తలదాచుకున్నట్టు ఏలూరు జిల్లా పరిధిలోని రుద్రంకోట గ్రామ వాసులు తెలిపారు. "జూలై 22 నాటికే వరద ఇళ్లల్లోకి వచ్చేసింది. ఎటూపోవడానికి దారిలేదు. ఏటా కొండలపైకి వెళ్లి కొద్దిరోజులు తలదాచుకోవడం అలవాటుగా మారింది. గడచిన పదేళ్లుగా ఇదే తంతు. ఈసారి కూడా వారం రోజులుగా కొండల మీదనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుతున్నాయి. మా ఊరి నుంచి వేలేరుపాడుకి బోటు వేశారు. దాంతో కనీసం పిల్లకు వండి పెట్టే సరుకులైనా తీసుకుందామని బోటు సాయంతో వచ్చాం. వరద తగ్గిన తర్వాత ఇళ్ళల్లో చేరిన బురద కడగాలంటే మాకు తలకుమించిన భారం అవుతుంది. ఏటా రెండు నెలల పాటు ఇలానే అవస్థల్లో గడపాల్సి వస్తోంది" అని నిర్వాసిత గ్రామాలకు చెందిన మహిళ సంకురు నారాయణమ్మ బీబీసీతో చెప్పారు.
 
ఇంత భారీ వరదకు కారణమేంటి?
గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈసారి భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్ర, ఒడిశాల్లో కురిసిన వర్షాల తాకిడితో గోదావరి ఉప నదులన్నీ పొంగిపొర్లాయి. ఫలితంగా గోదావరికి జూలై 20 నాటికే వరద తాకిడి మొదలయ్యింది. జూలై 31న కూడా భద్రాచలం, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తొలుత భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహించిన నది, ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టినా, అంతలోనే మళ్లీ పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహించింది. గోదావరి ఉధృతి ఊగిసలాట కారణంగా ముంపు బాధితులు తీవ్రంగా ఇక్కట్లు పాలయ్యారు.
 
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలకు పదిరోజులు దాటినా రాకపోకలకు ఆస్కారం లేకుండా పోయింది. పంటలన్నీ నీటిపాలయ్యాయి. ఇళ్లల్లో వరద నీరు చేరి, ఇంకా పూర్తిగా తగ్గలేదు. పక్షం రోజులుగా వరద భయంతో గోదావరి తీరవాసులు తల్లడిల్లిపోవాల్సి వస్తోంది. వరద బాధితుల కోసం 273 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. వారి కోసం జూలై 28 నాటికి 3,126 ఆహార ప్యాకెట్లు, 2.86 లక్షల వాటర్ ప్యాకెట్లు పంచినట్లు ప్రకటించింది. అదే సమయంలో, వరద బాధితుల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలు సాగిస్తున్నాయి.
 
నీటమునిగిన పొలాలు..
ఓ వైపు గోదావరి వరదల ప్రభావంతో పాటు ఎర్రకాలువ కూడా పొంగడంతో తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి సాగుదారులకు చిక్కులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే నాట్లు వేసిన పొలాల్లో నీటి ప్రవాహంతో పంట దెబ్బతింది. మరోసారి నాట్లు వేయాలంటే నారు కోసం ఎదురుచూడక తప్పని స్థితి ఏర్పడింది. నిడదవోలు, తణుకు, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రైతులకు ఎర్రకాలువ వరద తాకిడి ఎక్కువగా తగిలింది. దీంతో రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
 
"ఇప్పటికే ప్రాథమికంగా నష్టాలు అంచనా వేశాం. బాధితులందరినీ ఆదుకుంటాం. క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చాం. నష్టపరిహారం పంపిణీలో లోపాలు ఉంటే సరిచేస్తాం. ఎర్రకాలువ, పెద్ద వాగు, గోదావరి వరదల ప్రవాహానికి జరిగిన నష్టాలపై తుది అంచనాలు రాగానే రైతులకు అవసరమైన సాయం అందిస్తాం" అని ఏపీ వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలు ఏటా వరదల్లో చిక్కుకుంటున్న విషయం వాస్తవమేనని, వారికి సత్వనరమే పునరావాస ప్యాకేజ్ అందించేందుకు కేంద్రంతో తమ ప్రభుత్వం చర్చిస్తోందని ఆయన బీబీసీతో అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారందరికీ న్యాయం జరుగుతుందని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు