గెలిచిన తండ్రీకొడుకులు, బావాబావమరుదులు, ఓడిన భార్యాభర్తలు... తమ్ముడి చేతిలో అక్క పరాజయం

బిబిసి

సోమవారం, 10 జూన్ 2024 (17:01 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పలు రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. వారిలో కొందరు ఓడారు. మరికొందరు గెలిచారు.
ఆ కుటుంబాలేమిటో, వారి బంధుత్వాలేమిటో చూద్దాం.
 
నారా, నందమూరి కుటుంబం
ఏపీ ఎన్నికలలో ఈసారి నారా, నందమూరి కుటుంబాల నుంచి మొత్తం ఐదుగురు పోటీ చేశారు. కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక హిందూపురం శాసనసభ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణ గెలవగా, ఆయన రెండో అల్లుడు భరత్ విశాఖ ఎంపీగా గెలిచారు. బాలకృష్ణ సోదరి, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణ బావ, బావమరుదులే కాక, వియ్యంకులు కూడా. నారా, నందమూరి కుటుంబాల నుంచి నిలబడినవారందరూ గెలిచారు.
 
వైఎస్ కుటుంబం
పులివెందుల నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై గెలిచారు. ఆయనకు వరుసకు సోదరుడైన వైఎస్ అవినాశ్ రెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డిపై గెలిచారు. ఇదే కడప స్థానం నుంచి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్. షర్మిల అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అంటే తమ్ముడి చేతిలో అక్క పరాజయం పాలయ్యారు.
 
కింజరాపు ఫ్యామిలీ
ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున విజయం సాధించిన కుటుంబంలో కింజరాపు కుటుంబం ఒకటి. దివంగత టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి గెలుపొందారు. ఇక ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి మూడోసారి గెలిచారు. ఆదివారం ఏర్పడిన కేంద్రమంత్రివర్గంలో స్థానమూ సంపాదించారు. ఇలా పినతండ్రి, కొడుకు ఒకరు అసెంబ్లీకి, మరొకరు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
 
రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణ మూర్తి మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలోనూ ఈయన ఎమ్మెల్యేగా పనిచేశారు
 
బొత్స కుటుంబంలో ముగ్గురు ఓటమి
ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల బరిలో దిగిన బొత్స కుటుంబం ఓడిపోయింది. చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన బొత్స సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కళా వెంకటరావు చేతిలో ఆయన ఓడిపోయారు. బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ చేతిలో ఓడిపోయారు. బొత్స సోదరుడు బొత్స అప్పలనర్సయ్య గజపతి నగరం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.
 
ఎంపీ, ఎమ్మెల్యేగా వేమిరెడ్డి దంపతులు
ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీచేసిన భార్యాభర్తలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి గెలుపొందారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై గెలిచారు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విజయం సాధించారు.
 
పెద్దిరెడ్డి కుటుంబంలో ముగ్గురు
వైసీపీ తరపున పోటీచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి గెలిచారు. పుంగనూరు నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పి.వి.మిథున్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలుపొందారు. రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన గెలుపొందారు.
 
కేతిరెడ్డి కుటుంబంలో ఇద్దరు
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి చేతిలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయారు. ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరాజయం పాలయ్యారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి చిన్నాన్న అవుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు