ఆర్టికల్ 370: పాకిస్తాన్ ఆగ్రహం భారత్‌ను ఏం చేయగలదు?

గురువారం, 8 ఆగస్టు 2019 (22:40 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన బుధవారం జాతీయ భద్రతా కమిటీ కీలక సమావేశం జరిగింది. ఇందులో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయంపై చర్చించారు. ఈ సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి సహా సైనిక, నిఘా ఏజెన్సీల అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన ఒక వీడియోను పాక్ ప్రభుత్వం ట్విటర్‌లో పెట్టింది. భారత ప్రభుత్వం చర్యలు ఏకపక్షం, చట్టవిరుద్ధం అని అందులో పోస్ట్ చేసింది.

 
భారత్‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకుంటామని, భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఆపివేస్తామని, ఈ విషయం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి తీసుకెళ్తామనని పాకిస్తాన్ చెప్పింది. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని కశ్మీరీలకు సంఘీభావం ప్రదర్శించేలా జరుపుకుంటామని, భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15ను బ్లాక్ డేగా పాటిస్తామని చెప్పింది. భారత్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకున్న పాకిస్తాన్ తర్వాత తమ గగనతలంలో ఒక కారిడార్‌ను కూడా మూసివేసింది.

 
సింబాలిక్ నిర్ణయం
ఈ మొత్తం అంశం గురించి పాకిస్తాన్ చాలా కోపంగా, సీరియస్‌గా ఉన్నట్టుంది. అది ఇలాంటి ప్రకటన చేయడం వెనుక అసలు విషయం ఏమై ఉంటుంది. మాజీ దౌత్యవేత్త శరత్ సభర్వాల్ దీనిని ఒక 'సింబాలిక్ చర్య'గా భావించారు. "ప్రభుత్వం పబ్లిక్ రియాక్షన్‌కు సమాధానం ఇస్తోంది. గత రెండు రోజులుగా వాళ్లకు తగిన సమాధానం వెతుక్కోడమే కష్టమైంది. ప్రభుత్వం, విపక్షాల్లో కూడా ఎవరూ ఐక్యంగా ఉన్నట్టు కనిపించడం లేదు.


ఇక వ్యాపారం విషయానికి వస్తే పుల్వామా, బాలాకోట్ దాడుల తర్వాత వారి ఎగుమతులపై మనం 200 శాతం డ్యూటీ పెంచేశాం. భారత్‌కు వారి ఎగుమతులు చాలా తగ్గిపోయాయని నాకు అనిపిస్తోంది. అయితే భారత్ నుంచి జరిగే ఎగుమతులకు కూడా కచ్చితంగా కాస్త ఇబ్బంది ఉంటుంది. కానీ, అది పాకిస్తాన్‌కు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవే వస్తువులు ఇంకా దూరం నుంచి తెప్పించుకుంటే, వారి ఆర్థిక వ్యవస్థకే నష్టం" అని ఆయన చెప్పారు.

 
మాజీ దౌత్యవేత్త వివేక్ కాట్జూ "పాకిస్తాన్ చర్యల వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగదు. కానీ, ఈ చర్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసిపోతున్న తీరు అంతర్జాతీయ సమాజం దృష్టిలో పడాలనేది పాక్ కోరిక" అన్నారు. "అంతర్జాతీయ సమాజం భారత్-పాకిస్తాన్ సంబంధాల్లో జోక్యం చేసుకోవాలని, కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎలాగోలా అంగీకరించేలా చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. అది ఎప్పుడూ అదే అనుకుంటుంది. భారత్ దానికి ఎప్పటికీ ఒప్పుకోదని అంతర్జాతీయ సమాజానికి తెలుసు. భారత్ ప్రత్యక్ష చర్యలు చేపట్టింది. లోయలో పరిస్థితులు సాధారణ స్థితికి రాకుండా పాకిస్తాన్ అప్రత్యక్ష చర్యలు తీసుకుంటుంది" అంటారు వివేక్ కాట్జూ.

 
ఈ అంశంపై పాకిస్తాన్ ఎంత ముందుకెళ్తుంది? అనే విషయంపై పాకిస్తాన్‌ సీనియర్ జర్నలిస్ట్ హారూన్ రషీద్ మాట్లాడారు. "దౌత్య సంబంధాలను తగ్గించుకుంటున్నారు. దానివల్ల ఎంత ప్రభావం ఉంటుందో తెలీదు. ఎందుకంటే ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి" అన్నారు. "భారత్ నుంచి చౌకగా టమాటాలు, ఉల్లిపాయలు రావడం వల్ల పాకిస్తాన్ ప్రజలకు ఊరట లభించేది, ఇప్పుడు అది కూడా ఉండదు అంటారు" రషీద్.

 
అంతర్జాతీయ సమాజంను ఆకర్షించే ప్రయత్నం
పాకిస్తాన్ జారీ చేసిన ప్రకటనలో ప్రధానమంత్రి సైన్యంను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు కూడా చెప్పారు. కానీ స్వయంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు ఆ దేశానికి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. "పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌ను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామని భారత్ నుంచి కొన్ని ప్రకటనలు రావడంతో సైన్యాన్ని ముందు జాగ్రత్తగా అలర్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల ఒత్తిడిలో పనిచేస్తోంది" అని రషీద్ అన్నారు.

 
"నెల కిందట పాక్ రూపాయి చారిత్రక స్థాయిలో అత్యంత దిగువ స్థాయికి పడిపోయింది. దాని విదేశీ కరెన్సీ నిల్వలు కూడా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛంద కోతలను కూడా ప్రకటించాల్సి వచ్చింది". ఇంతకీ, భారత ప్రత్యర్థిగా పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బలంగా కనిపిస్తోంది? ఈ విషయంలో పాకిస్తాన్ ఒక విధమైన రణ నీతిని ప్రదర్శిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ సీమా ముస్తఫా అన్నారు.

 
"భారత్ ఏదైనా సైనిక చర్యకు దిగితే... వాళ్లు అలా చేయరు. ఎందుకంటే, గెలుపో, ఓటమో మేం వాళ్ల రెండు విమానాలు అయితే కూల్చేశాం. ఎందుకంటే మేం చాలా బలమైన స్థితిలో ఉన్నాం. ఒక వేళ పోరాటానికి దిగినా దిగవచ్చు. ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకోవడం కోసం అలా చేస్తుంది. అయితే, పాకిస్తాన్ కూడా చేతులు ముడుచుకుని ఉండలేదు. ఎందుకంటే అది కశ్మీర్‌ను గత 70 ఏళ్లుగా ఒక భావోద్వేగాలతో కూడిన అంశంగా చేసింది. అందుకే, ఏదైనా దీటైన నిర్ణయాలు తీసుకోకుంటే, స్వయంగా ఇమ్రాన్ ఖాన్, ఆయన ఆర్మీ చీఫ్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే, వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పలేం" అని సీమా ముస్తఫా అన్నారు. కశ్మీర్ అంశంపై గత రెండు రోజులుగా పాకిస్తాన్ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. తన ఆగ్రహాన్ని చూపించేందుకు ఎలాంటి అవకాశాన్నీ వదలడం లేదు.

 
ఐక్యరాజ్యసమితి ఆందోళన
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలికా లోధీ బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు జోవానా రొనేకాతో చర్చించారు. అర్థరాత్రి ఒక ప్రకటన జారీ చేసిన ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రతినిధి భారత పాలిత కశ్మీర్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రతినిధి తన ప్రకటనలో "భారత పాలిత కశ్మీర్ తాజా పరిస్థితి, మానవహక్కుల దుర్వినియోగంపై ఆందోళనగా ఉంది. అక్కడ మొబైల్, ఫోన్ సేవలు ఆపివేయడాన్ని మేం గమనిస్తున్నాం. నేతలను గృహనిర్బంధంలో ఉంచారని, 144 సెక్షన్ విధించారని కూడా చెబుతున్నారు" అన్నారు.

 
"ఇలా అడ్డుకోవడం వల్ల భారత పాలిత కశ్మీర్ ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధులతో జమ్ము-కశ్మీర్ భవిష్యత్తుపై చర్చించే హక్కులను కోల్పోతారు. కశ్మీర్‌ గురించి ఏ వార్తా బయటకు రావడం లేదు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం" అన్నారు. కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ ఇంతకు ముందు కూడా ఐక్యరాజ్యసమితి దగ్గరకు వెళ్లిందనే విషయాన్ని పక్కన పెట్టలేం. కానీ, దానివల్ల ఎలాంటి పరిష్కారం పొందలేకపోయారు.

 
జోక్యం చేసుకోని చైనా
లద్దాఖ్ దగ్గర తన సరిహద్దుల గురించి చైనా ఒక ప్రకటన జారీ చేసింది. కానీ కశ్మీర్‌తో సరిహద్దు విషయంలో భారత్, పాకిస్తాన్ సంయమనంతో ఉండాలని చెప్పింది. అంతర్జాతీయ సమాజంపై పాకిస్తాన్ చాలా ఆశలే పెట్టుకుందని భావిస్తున్నారు. ఆ ఆశలు నెరవేరుతాయేమో చూడాలి. దీనిపై బీబీసీతో మాట్లాడిన అంతర్జాతీయ అంశాల నిపుణులు సీనియర్ జర్నలిస్ట్ మనోజ్ జోషీ "కశ్మీర్ విషయానికి వస్తే చైనా పరిస్థితి కూడా అంతే. 1963లో చైనా, పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. అందులో కూడా కశ్మీర్ సమస్యపై చివరికి భారత్, పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరగాలని స్పష్టంగా చెప్పారు. అదే ఒప్పందంలో భారత్, పాకిస్తాన్ కలిసి కశ్మీర్‌పై ఒప్పందం చేసుకున్నప్పుడే దానిపై తుది నిర్ణయం వస్తుందన్నారు. అంటే కశ్మీర్ సమస్య భారత్, పాకిస్తాన్ మధ్య అంశమమని చైనా భావిస్తోంది" అన్నారు.

 
దశాబ్దాల నాటి పురాతన కశ్మీర్ అంశంపై భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రం అయ్యాయనేది సుస్పష్టం. ఈసారీ దీనిని పరిష్కరించడానికి రెండు దేశాలూ పరస్పరం చేతులు చాచే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ మొత్తం అంశం ఇప్పుడు ఏ దిశగా ముందుకు వెళ్తుంది, రెండు దేశాల వైఖరి ఎలా ఉంటుందో తెలియాలంటే మనం కొంతకాలం వేచిచూడక తప్పదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు