ప్రధాని మోదీ ప్రసంగం: 'పాకిస్తాన్ ఆటలు ఇక సాగవు.. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో నవశకం మొదలైంది'

గురువారం, 8 ఆగస్టు 2019 (21:25 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. జమ్ముకశ్మీర్ విభజన నిర్ణయం తరువాత ప్రధాని జాతినుద్దేశించి చేస్తున్న తొలి ప్రసంగం ఇది. 'ఆర్టికల్ 370 రద్దుతో దేశంలో ఇప్పుడందరూ సమానం. ఈ ఆర్టికల్ వేర్పాటువాదాన్ని, రాజకీయ నేతల బంధుప్రీతిని, అవినీతిని పెంచి పోషించడం తప్ప కశ్మీర్ ప్రజలకు చేసిందేమీ లేదు. అక్కడి అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచింద’న్నారు. గత మూడు దశాబ్దాలలోనే జమ్మూకశ్మీర్‌లో 42 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇది ఎవరికైనా కన్నీరు తెప్పిస్తుందని అన్నారు.

 
ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయమని.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు న్యాయం జరిగిందని, ఈ నిర్ణయంతో శ్యామ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేర్చామని.. ఇక కశ్మీర్‌లో అభివృద్ధి మొదలవుతుందని చెప్పారు.

 
కశ్మీర్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కూడా ఉండేవి కావు
ఆర్టికల్ 370 వల్ల జమ్ముకశ్మీర్‌లోని కోటిన్నరమందికిపైగా ప్రజలు ఇంతకాలం మోసపోయారంటూ.. అక్కడివారు ఎలా నష్టపోయారో వివరించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కుమార్తెలు తమ హక్కులు అనుభవించినా జమ్మూకశ్మీర్ కుమార్తెలు మాత్రం హక్కులు పొందలేకపోయారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ విషయంలో ఎస్సీ, ఎస్టీలకు కొన్ని రిజర్వేషన్లు దేశమంతా ఉన్నా కశ్మీర్‌లో అమలయ్యేవి కావని.. విద్యాహక్కు చట్టం దేశమంతా అమలైనా కశ్మీర్‌లో అమలు కాలేదని.. ఇకపై అవన్నీ అమలవుతాయన్నారు.
 
ఇంతకాలం అక్కడ అవినీతి, కుటుంబ పాలన రాజ్యమేలిందని.. 42 వేల మంది అమాయకులు మరణించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తాము కశ్మీర్‌ ప్రజలకు న్యాయం చేశామని, అందరికీ సమాన హక్కులు లభిస్తాయని.. అక్కడ అభివృద్ధికి ఉన్న ఆటంకం తొలగిపోవడంతో కొత్త చరిత్ర మొదలు కానుందన్నారు. ''పాకిస్తాన్ ఇంతకాలం ఆర్టికల్ 370ని అడ్డంపెట్టుకుని మన అంతర్గత భద్రతకు భంగం కలిగించేది.. ఇకపై అది సాధ్యం కాద’న్నారు.

 
ఉద్యోగులకు మంచికాలం
ఆర్టికల్ 370, 35ఏ ఇక గత చరిత్ర. ఆ రెండు అధికరణాలు చూపించిన తీవ్ర ప్రతికూల ప్రభావాల నుంచి జమ్మూకశ్మీర్ త్వరలో బయటపడుతుందన్న నమ్మకం తనకుందన్నారు. ఇప్పుడు ఏర్పడుతున్న కొత్త వ్యవస్థలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లోని ఉద్యోగులందరికీ కేంద్రపాలిత ప్రాంతాల్లో లభించే అన్ని ప్రయోజనాలూ కల్పిస్తామన్నారు. ఎల్టీసీ, ఇంటద్దె భత్యం, పిల్లల చదువుకోసం విద్యా భత్యం, ఆరోగ్య పథకం వంటివన్నీ వర్తిస్తాయి. ఇంతకాలం జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అక్కడి ఉద్యోగులకు, పోలీసులకు ఇవేమీ లభించలేదని ఆయన చెప్పారు.

 
ఉద్యోగాలు భర్తీ చేస్తాం
''అతిత్వరలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. దీనితో స్థానిక యువకులు ఉద్యోగాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్ కంపెనీలు ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రోత్సహిస్తాం. సైన్యం, సీపీఆర్ఎఫ్‌లో స్థానిక యువకులకు ఉద్యోగాలు దక్కేలా నియామక ర్యాలీలు నిర్వహిస్తాం'' అన్నారు.

 
అతి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తాం
అయితే, కొద్దికాలమే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. ఆ తరువాత మునుపటిలా రాష్ట్రమవుతుంది. అప్పుడు శాసనసభ ఉంటుంది, ఎమ్మెల్యేలుంటారు, మంత్రులుంటారు.. ఎవరూ ఆ విషయంలో ఆందోళన చెందనవసరం లేద'న్నారు. పంచాయతీలకు, అసెంబ్లీకి ఎన్నికలకు నిర్వహిస్తామని.. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవచ్చని చెప్పారు.

 
తెలుగు సినీ రంగానికి ప్రత్యేక విజ్ఞప్తి
సుందరమైన కశ్మీరంలో సినిమాలు తీయొచ్చని.. బాలీవుడ్, తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలను ఇక్కడ వారి సినిమాలు చిత్రీకరించాలని కోరుతున్నానన్నారు. కశ్మీర్ టూరిజం హబ్‌గా మారుతుందని.. లద్దాఖ్‌లో ఆద్యాత్మిక, సాహస పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో అనేక ఔషధ మొక్కలుంటాయని.. వాటికి ప్రపంచవ్యాప్త మార్కెట్ కల్పించొచ్చని చెప్పారు.

 
‘‘మనమంతా కలిసి కొత్త జమ్మూకశ్మీర్, కొత్త లద్దాఖ్, కొత్త భారత దేశాన్ని నిర్మించి ప్రపంచానికి చూపిద్దాం’’ అని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు ఆమోదం పొందిన రెండు రోజుల తరువాత ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు ప్రకటన రావడంతో అంతటా ఆసక్తి ఏర్పడింది.

 
ప్రధాని మోదీ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 27న కూడా జాతినుద్దేశించి ప్రసగించారు. అంతకుముందు పుల్వామా దాడి తరువాత ఫిబ్రవరి 15న ఓసారి జాతినుద్దేశించి మాట్లాడారు. 2016లో నవంబరు 8న ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. ఆనాటి ప్రసంగంలో ఆయన అప్పటికి దేశంలో చలామణీలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు