ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ, కశ్మీర్‌లో వచ్చే మార్పులేంటి?

సోమవారం, 5 ఆగస్టు 2019 (22:08 IST)
లద్ధాఖ్ ఇక కేంద్రపాలిత ప్రాంతంగా మారబోతోంది. భారత ప్రభుత్వం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించే రాజ్యాంగంలోని సెక్షన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన తర్వాత దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేశారు. 

 
ఈ బిల్లులో ఏముంది?
ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు ఆర్టికల్ 35ఎ ని కూడా రద్దు చేశారు. దీంతో రాష్ట్రంలో శాశ్వత నివాసులను గుర్తిస్తారు.
ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు రాష్ట్ర పునర్నిర్మాణం గురించి ప్రస్తావించింది.
జమ్ము కాశ్మీర్ ఇక రాష్ట్రంగా ఉండదని చెప్పారు.
జమ్ము-కశ్మీర్ స్థానంలో ఇక రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి.
ఒకదాని పేరు జమ్ము-కశ్మీర్, ఇంకోదాని పేరు లద్దాఖ్
రెండు కేంద్ర పాలిత ప్రాంతాలూ లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకి వస్తాయి.
జమ్ము, కశ్మీర్లో అసెంబ్లీ ఉంటుంది. లద్ధాఖ్‌లో అసెంబ్లీ ఉండదు.
ఆర్టికల్ 370లో ఒక విభాగం మాత్రం అలాగే ఉంచారు. దాని ప్రకారం రాష్ట్రపతి ఏదైనా మార్పులకు ఆదేశాలు జారీ చేయవచ్చు.
అక్కడ భద్రత స్థితి, సీమాంతర ఉగ్రవాదం వల్లే వాటికి కేంద్ర పాలిత ప్రాంతాల హోదా ఇచ్చామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు.

 
ఆర్టికల్ 370 రద్దుతో ఏం జరుగుతుంది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది.
 
దీని వెనుక చరిత్రలోకి వెళ్తే..
1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినపుడు జమ్ము-కశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. కానీ, తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌లో విలీనం అయ్యేందుకు సమ్మతించారు.
ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనలు ఏర్పరిచారు. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించారు. కానీ, అప్పట్లో ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని డిమాండ్ చేశారు.
1951లో ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగ సభ నుంచి వేరుగా పిలవడానికి అనుమతించారు.
1956 నవంబర్‌లో రాష్ట్ర రాజ్యాంగం ఏర్పాటు పూర్తైంది. 1957 జనవరి 26న రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నిజానికి కేంద్రం నుంచి జమ్ము-కశ్మీర్ సంబంధాలకు రూపురేఖలుగా ఉంటుంది.
ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఐదు నెలలు చర్చించిన తర్వాత ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో జోడించారు.
ఆర్టికల్ 370 నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించి చట్టం చేయాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రత్యేక హోదా కారణంగా జమ్ము-కశ్మీర్ రాష్ట్రంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు చేయడం కుదరదు. దానివల్ల భారత రాష్ట్రపతి దగ్గర రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు ఉండదు.
ఆర్టికల్ 370 కారణంగా జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక జెండా కూడా ఉంటుంది. దాంతోపాటు జమ్ము-కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు ఉంటుంది.
ఆర్టికల్ 370 వల్ల భారత రాష్ట్రపతి జమ్ము-కశ్మీర్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడం సాధ్యం కాదు.

 
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుతో ఏం మార్పులు వస్తాయి?
దీనిపై బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే రాజ్యాంగ నిపుణులు కుమార్ మిహిర్‌తో మాట్లాడారు.
 
ఆర్టికల్ 370 రద్దు కావడంతో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించాలి. జమ్ము-కశ్మీర్ రాష్ట్ర హోదాపై చర్చించాలి.
 
పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందితే వచ్చే మార్పులు ఇవే.
ఇంతకు ముందు 'శాశ్వత నివాసి'గా రాష్ట్రంలో ఉన్నవారు మాత్రమే ఆస్తులు కొనుగోలు చేయగలిగేవారు. ఇప్పుడు ఎవరైనా అక్కడ ఆస్తులు కొనవచ్చు.
ఇంతకు ముందు, 'శాశ్వత నివాసులను' మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించేవారు. ఇప్పుడు ఎవరినైనా నియమించవచ్చు.
ఇంతకు ముందు ఇక్కడ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి అదుపులో ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రతినిధి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇవి నేరుగా కేంద్ర హోంమంత్రి పరిధిలోకి వస్తాయి.
కేంద్రం రూపొందించే చట్టాలన్నింటినీ ఇంతకు ముందు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాల్సి వచ్చేది. ఇప్పుడు అవి ఆటోమేటిగ్గా అమల్లోకి వస్తాయి.
అలాగే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇక్కడ నేరుగా అమలవుతాయి.
రాష్ట్ర ప్రభుత్వ జెండాకు ఇప్పుడు ప్రాధాన్యం ఉండదు. ప్రస్తుతమున్నదాన్ని ఏం చేయాలనేదనిపై పార్లమెంటు లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గిస్తారు.
మహిళలకు వర్తించే స్థానిక సంప్రదాయ వ్యక్తిగత చట్టాలను తొలగిస్తారు.
ఇక్కడ ఐపీసీ అమలు చేయాలా లేక స్థానిక రన్‌బీర్ పీనల్ కోడ్ అమలు చేయాలా అనేది కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటు నిర్ణయిస్తుంది.
ఇంతకు ముందు వర్తించిన పంచాయతీ చట్టాలను అలాగే ఉంచాలా లేక మార్చాలా అనేదానిపై పరిశీలిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు