‌‘బిగ్ బాస్’: ఆ ప్రశ్నలు అందుకే.. లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన బృందం

మంగళవారం, 16 జులై 2019 (16:32 IST)
'బిగ్ బాస్ 3' వివాదంలో చిక్కుకుంది. తమతో అసభ్యకరంగా మాట్లాడారంటూ ఇద్దరు మహిళలు 'బిగ్ బాస్ 3' నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టు శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా హైదరాబాద్‌లోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 'బిగ్ బాస్' నిర్వాహకులుగా చెబుతున్నవారిపై కేసులు పెట్టారు. నిర్వాహకులు తమతో అసభ్యకరంగా మాట్లాడారని, 'బిగ్ బాస్' షో కోసం ఎంపిక చేసి తరువాత తీసుకోలేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
స్టార్ మా కో-ఆర్డినేటర్లు రవికాంత్, రఘు, స్టార్ మా ముంబై హెడ్ అభిషేక్, స్టార్ మా ప్రొగ్రామింగ్ ప్రొడ్యూసర్ శ్యామ్‌లపై జులై 13న జి. శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 354 (మహిళను కించపరచడం) కింద కేసు నమోదు చేశారు. మార్చి నుంచి ఇప్పటి వరకూ తనకు, బిగ్ బాస్ బృందానికీ మధ్య జరిగిన సంభాషణల్ని ఫిర్యాదులో పేర్కొన్న శ్వేత, జూన్ 4వ తేదీన హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఒక రెస్టారెంట్లో జరిగిన ఘటనను బీబీసీకి వివరించారు.
 
"మీరు బిగ్ బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారు? మీరు ఆకర్షణీయంగా కనిపించడానికి లావు తగ్గాలి. ఆకర్షణీయంగా ఉంటేనే బిగ్ బాస్ ఇంప్రెస్ అవుతారు" అని శ్యామ్ తనతో అన్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు శ్వేత తెలిపారు.
 
మరోవైపు, జులై 14న రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు గాయత్రి గుప్త. అభిషేక్, రఘులపై ఈమె ఫిర్యాదు చేశారు. "మార్చిలో బిగ్ బాస్ కోసం నాతో ఒప్పందం చేసుకుని, వంద రోజుల పాటు ఏ ప్రాజెక్టూ ఒప్పుకోవద్దని షరతు విధించారు. దానివల్ల ఎన్నో ఆఫర్లను వదులుకున్నాను. కానీ జూన్ 25న కాల్ చేసి, నేను షోలో ఉండకపోవచ్చని చెప్పారు. దీనివల్ల ఎంతో నష్టపోయాను" అని గాయత్రి తన ఫిర్యాదులో ఆరోపించారు.
 
"మీరు వంద రోజులు సెక్స్ లేకుండా ఎలా ఉంటారు అని అభిషేక్ అనే వ్యక్తి తుది చర్చల సమయంలో అడిగారు" అని తన ఫిర్యాదులో చెప్పారు గాయత్రి. తాము ఇప్పుడు మళ్లీ ఆఫర్ వచ్చినా 'బిగ్ బాస్'కి వెళ్లబోమనీ, తమలా ఎవరికీ ఇలా కాకూడదనే ఫిర్యాదు చేసినట్టు బీబీసీతో చెప్పారు శ్వేత. దీనిపై ‘స్టార్ మా’ స్పందించాల్సి ఉంది.
 
ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు బంజారాహిల్స్ పోలీసులు. మరోవైపు బిగ్ బాస్ గేమ్ షోపై శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు.
 
ఆరోపణల్ని ఖండించిన బిగ్ బాస్ బృందం
బిగ్ బాస్ 3 లైంగిక వేధింపుల ఆరోపణలను బిగ్ బాస్ బృందం ఖండించింది. శ్వేత, గాయత్రీలు చేసిన ఆరోపణలన్నీ తప్పని పేరు చెప్పడానికి ఇష్టపడని బృంద సభ్యులు ఒకరు బీబీసీతో అన్నారు. దీనిపై తాము కూడా చట్టపరంగా ముందుకు వెళ్తామని, అన్ని సాక్ష్యాలనూ పోలీసులకూ, కోర్టుకూ అందిస్తామనీ చెప్పారు. బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎన్నో వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతామనీ, హౌస్‌కి వచ్చే వ్యక్తి మానసికంగా, శారీరకంగా సన్నద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసమే అలా చేస్తామని వివరించారు. అయితే వాటిలో ఏవీ కించపరిచే ప్రశ్నలుండవని వివరించారు. 
 
గతంలో ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదనీ, కావాలంటే గతంలో బిగ్ బాస్‌లో పాల్గొన్న మహిళలను సంప్రదించవచ్చన్నారు. మహిళలను కించపరిచే, అగౌరవపరిచే, లైంగికంగా వేధించే ఎటువంటి మాటలూ, చర్యలు తాము చేయలేదని వారు వివరణ ఇచ్చారు. దీనిపై సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. బిగ్ బాస్‌కి ఎంపిక కానందువల్లే, చర్చలు జరిగిన ఇంతకాలం తరువాత వారు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు.
 
‘‘లైంగిక వేధింపులు జరిగితే వారు అసలు షోలో పాల్గొనడానికి ఎలా ఒప్పుకున్నారు? షోలో తమ పేరు ఉండదనే సరికి ఇదంతా చేస్తున్నారంటేనే అవి అసత్య ఆరోపణలని అర్థం చేసుకోవచ్చు కదా.. వారికి ఒకవేళ షోలో పాల్గొనే అవకాశం వస్తే, వారు ఎప్పటికీ కేసులు పెట్టేవారు కాదు కదా’’ అని బిగ్ బాస్ బృందం చెబుతోంది.
 
మరోవైపు బిగ్ బాస్ 1లో పాల్గొన్న కత్తి కార్తీక మాత్రం బిగ్ బాస్ బృందంపై ప్రశంసలు కురిపించారు. తాను యన్టీఆర్‌తో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆమె, ప్రొఫెషనలిజం, ఆతిథ్యం వల్లే ఆ షోకి సంతకం పెట్టానన్నారు. ఆ షో వల్లే తనను తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకున్నారని వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ 2లో పాల్గొన్న, పేరు వెల్లడించేందుకు ఇష్టపడని మరో మహిళతో బీబీసీ మాట్లాడగా, తనకు ఎలాంటి వేధింపులూ ఎదురు కాలేదని సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు