కరోనావైరస్ లాక్‌డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?
గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:15 IST)
ఆసియాలోనే అతి పెద్ద ఉల్లిపాయల మార్కెట్ మార్చ్ 31న మూగబోయింది. మహారాష్ట్రలోని లసంగావ్ ఉల్లిపాయల మార్కెట్ సాధారణంగా రైతులు, వర్తకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. లక్షలాది మంది భారతీయుల ఆహారంలో ముఖ్య భాగమైన ఉల్లిపాయలను లారీలకి ఎక్కిస్తూ, దించుతూ, ఉల్లి రకాలను వేరు చేస్తూ ఈ మార్కెట్ లో కొన్ని వందల మంది వలస కార్మికులు పని చేస్తూ ఉంటారు.
లాక్ డౌన్ తర్వాత బస్సు, రైలు సౌకర్యాలు పూర్తిగా ఆగిపోవడంతో దేశంలోనే మూడవ వంతు ఉల్లి పంటను ఉత్పత్తి చేసే ఈ మార్కెట్ కూడా ఒక వారం రోజుల తర్వాత నెమ్మదిగా మూత పడింది. లాక్ డౌన్ వలన దేశంలో లక్షలాది మంది కార్మికులు తమ స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. ప్రభుత్వం ఆహార సరఫరా లాంటి అత్యవసర సేవలు నిలిపివేయవద్దని చెప్పడంతో, లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా కొంత మంది రైతులు పొలాలకు వెళ్లి పనులు చేశారు. కొంత మంది కార్మికులు లాసంగావ్ మార్కెట్ లో పని చేయడం కోసం ఉండిపోయారు.
కానీ, అంతలోనే ఆ మార్కెట్ కి దగ్గర్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వచ్చిన వార్తలు ప్రజలను భయానికి గురి చేశాయి. మార్కెట్లో పనులు ఆగిపోయే సమయానికి సుమారు 450 టన్నుల ఉల్లిపాయలు దేశ వ్యాప్తంగా రవాణా అవ్వడానికి, ముంబై ఓడ రేవు నుంచి విదేశాలకి ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
"ముందు ట్రక్ లు రావడం ఆగిపోయింది. తర్వాత కొంత మంది పని వాళ్ళు వెళ్లిపోయారు. వైరస్ సోకిన వార్త రాగానే మిగిలిన పని వాళ్ళు కూడా పారిపోయారు." అని మనోజ్ జైన్ అనే ఉల్లిపాయల వ్యాపారి చెప్పారు. "రద్దీగా ఉండే ఈ ఉల్లిపాయల వేలం మార్కెట్లో సామాజిక దూరం పాటించడం కూడా కష్టమైనా పనే ".
ఇక్కడ నుంచి 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్ రాష్ట్రంలో కూడా మరో రైతు పరిస్థితి ఇదే. సమస్తిపూర్ జిల్లాలో ఉన్న తన 30 ఎకరాల పొలంలో వరి, కాయగూరలు, పళ్ళు పండించే మనువంత్ చౌదరి తన పొలంలో పని చేయడానికి స్థానికంగా ఉండే కూలీలను నియమించుకున్నారు. కానీ, వారు కూడా పనిలోకి రావడానికి ఒప్పుకోవడం లేదు.
" తిరిగి వెనక్కి పంపమేమోనని రోడ్ దాటి పనికి రావడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు, " అని చౌదరి చెప్పారు. “వైరస్ గురించి చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. నేను నా దగ్గర పని చేసే ఒక మహిళకు చేతులు తరచుగా కడుక్కోమని చెప్పినప్పుడు, దీనికి పరిష్కారంగా గోమూత్రం తాగవచ్చా అని అడిగారు. సామాజిక దూరం పాటిస్తూ పొలంలో పని చేయడం కూడా కష్టమే".
భారతదేశంలో సగానికి పైగా కార్మికులు జనాభా వ్యవసాయం రంగంలో పని చేస్తూ ఉంటారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం అందించే వాటా 16 శాతం. వరి , గోదుమ, చెరుకు, కూరగాయలు, పాలు లాంటి ఉత్పత్తులను ప్రపంచంలోనే అత్యధికంగా పండించే దేశాలలో భారతదేశం ఒకటి. వ్యవసాయ పనులను పూర్తిగా నిలిపివేయడం వలన రైతులకు, కూలీలకు పనులు నిలిచిపోవడం మాత్రమే కాకుండా ఆహార కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
క్లిష్ట సమయంలో లాక్‌డౌన్
భారతదేశంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ముఖ్యమైన వ్యవసాయ పనులు జరుగుతాయి. ఈ కాలంలోనే, వరి, గోదుమ లాంటి పంటలు నాటేందుకు భూమిని సిద్ధం చేస్తారు. చాలా రకాల పండ్లకి కూడా ఇది ముఖ్యమైన సీజన్. వర్షా కాలంలో పెరిగే వరి, పప్పుధాన్యాలు, పత్తి, చెరుకు లాంటి పంటలకు ఈ కాలంలోనే భూమిని దున్నుతారు. "నాట్లు వేయడానికి, భూమిని దున్నడానికి కూడా ఈ లాక్ డౌన్ పెద్ద గండి వేసిందని", అశోక యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మేఖల కృష్ణమూర్తి అన్నారు.
కరోనావైరస్ దేశాన్ని కబళించక ముందు కూడా వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పంటలకు వచ్చే ధరలు బాగా తగ్గిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో కూడా వ్యవసాయం చేయడం నష్టదాయకంగానే ఉంటుంది. 1997లో సుమారు 2 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది అప్పుల బాధ భరించలేక, కొంత మంది కరువుని తట్టుకోలేక, చెదలు దాడితో పంటలు నాశనమై ప్రాణాలు తీసుకున్నారు.
ప్రభుత్వం రైతులకు, పేదలకు ఆహార భద్రత, ఆర్థిక భద్రత కల్పించడానికి 1,740 వేల కోట్ల రూపాయిల (23 బిలియన్ డాలర్ల) సహాయ నిధిని ప్రకటించింది. కానీ, ఇది తగినంత లేదనే విమర్శలు కూడా వచ్చాయి. పంటల్ని సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల్ని సమీకరిస్తున్నాయి. తమిళనాడులో రైతులకి ట్రాక్టర్లు అప్పుగా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఆ ట్రాక్టర్లని నడిపే సామర్ధ్యం రైతులకి ఉందో లేదో తెలియదు. ప్రజా రవాణా సౌకర్యాలని తెరవకుండా సరుకుల్ని సరఫరా ఎలా చేస్తారో తెలియదు.
మరి కొన్ని సవాళ్లు
రైతులు, కార్మికులు పనుల్లో ఎలా చేరుతారు? పంటల్ని కొనుక్కునే వర్తకులు ఎంత వేగంగా ఈ సరకుల్ని కొనడానికి ముందుకు వస్తారు? వారు కనుక తక్కువ మొత్తంలో సరకులు కొంటే మళ్ళీ వీటి ధర మార్కెట్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా, రైతుల ఆదాయాన్ని మరింత తగ్గిస్తుంది.
అయితే, శుభ వార్త ఏమిటంటే, ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయి. భారతదేశంలో సుమారు 7500 హోల్ సేల్ మార్కెట్లు, 25000 చిన్న స్థాయి మార్కెట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని తెరుచుకున్నాయి. వస్తువుల రవాణా చేసేందుకు, సామాజిక దూరం పాటిస్తూ మార్కెట్లను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని డాక్టర్ కృష్ణ మూర్తి చెప్పారు.
“గత శీతాకాలంలో దేశంలో మంచి పంట పండింది. దేశంలో సుమారు 60 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులు నిల్వ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆహార సరఫరా విధానం కూడా అమలులో ఉంది. ఆహార కొరత ఏర్పడే అవకాశం లేదు. కాకపొతే పరిస్థితులు చక్కబడేవరకు రైతులని, చిన్న వ్యాపారస్థులని, కూలీలకు తగిన సహకారం అందించడం, పేదలకి ఆహరం అందించగలగడం, వచ్చే ఋతువు వరకు పండిన పంటని భద్రపరచడం మాత్రం ఇప్పుడు పెద్ద సవాలుగా నిల్చింది”.
ఇన్ని కఠిన పరిస్థితుల మధ్య భారతీయ రైతులు మాత్రం ఆత్మస్థయిర్యంతో ఉన్నారు. "మార్కెట్ మూత పడిపోవటం, సరకు రవాణాకు సౌకర్యాలు లేకపోవడంతో అమ్మకాలే మాకు పెద్ద సమస్యగా మారింది. కానీ, ఇప్పుడు నా పొలంలో నేను ఒంటరిగా పని చేసుకుంటున్నా" అని గణేష్ నానోటే అనే పత్తి రైతు మహారాష్ట్ర లోని అకోలా నుంచి ఫోన్లో చెప్పారు. ఆశను కోల్పోవడం లేదని చెబుతూ ఆయన ఒక సెల్ఫీని పంపించారు.