చిదంబరం అరెస్టు: మరింత మంది విపక్ష నేతలకు ఇదే పరిస్థితి రావొచ్చు, ఎందుకంటే?

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (17:11 IST)
భూమి గుండ్రంగా ఉంటుంది. ఎనిమిదేళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి హోదాలో కాంగ్రెస్ నేత చిదంబరం దిల్లీలో సీబీఐ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. బుధవారం అరెస్టై అదే కార్యాలయంలో ఆయన ఒక రాత్రి గడపాల్సి వచ్చింది.


ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడే సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ నేత అమిత్ షాను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు బళ్లు ఓడలయ్యాయి. ఓడలు బళ్లయ్యాయి. అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవిలో ఉండగా, చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది.

 
కేవలం అమిత్ షాతోనే కాదు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతోనూ చిదంబరం గతంలో నేరుగా సున్నం పెట్టుకున్నారు. 2002-గుజరాత్ అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపినప్పుడు, మోదీపై నిందలు మోపే ప్రయత్నం జరిగింది. చిదంబరం ప్రోత్సాహంతోనే ఈ పని జరిగినట్లు మోదీ విశ్వసించారు.

 
విరోధానికి మరిన్ని కారణాలు
ఇవే కాదు, చిదంబరంతో విరోధానికి బీజేపీకి మరిన్ని కారణాలున్నాయి. 2010లో ఆయన 'కాషాయ ఉగ్రవాదం' అన్న పదాన్ని వాడి మొత్తం సంఘ్ పరివార్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. ''గతంలో ఎన్నో బాంబు పేలుళ్లలో పాత్ర పోషించిన కాషాయ ఉగ్రవాద ఉత్పాతం ఈ మధ్యే బయటపడింది. కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో అప్రమత్తంగా ఉంటూ, దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది'' అని ఓ సదస్సులో వ్యాఖ్యానించారు.

 
ఈ వ్యాఖ్యలను బీజేపీ వెంటనే ఖండించింది. అప్పటివరకూ ఇస్లామిస్ట్ శక్తులకు సంబంధించి ప్రస్తావించే 'ఉగ్రవాదం' పదాన్ని 'హిందుత్వ'తో ముడిపెట్టేందుకు చేసిన ప్రయత్నంగా చిదంబరం వ్యాఖ్యలను సంఘ్ చూసింది. వాస్తవాలు ఎలా ఉన్నా, ఈ వ్యాఖ్యలు చిదంబరానికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశమే అయ్యాయి. 'లౌకికవాద' కుట్రలో తమను బాధితులను చేస్తున్నారని చెప్పుకొనే అవకాశం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు వచ్చింది. చిదంబరం వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించాల్సి వచ్చింది. ఉగ్రవాదానికి ఏ రంగూ లేదని, దానికి ఏ రంగూ పులుమడం సరికాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనార్ధన్ ద్వివేది ప్రకటన విడుదల చేశారు.

 
మోదీ హయాంలో ఆ పరిస్థితి లేదు
చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు రూ. 4.62 కోట్ల విదేశీ పెట్టుబడుల స్వీకరణకు ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) అనుమతి ఇవ్వగా, ఆ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడులు స్వీకరించిందన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2006లో ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం విషయంలోనూ చిదంబరంపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి.

 
దాడులు, విచారణలు కొన్నేళ్లుగా సాగుతున్నాయి. అయితే, మోదీ హయాంలో అరెస్టైన అత్యంత ప్రముఖ కాంగ్రెస్ నేత చిదంబరమే. సాధారణంగా విపక్ష నాయకులను అరెస్టు చేయాలంటే ప్రభుత్వాలు జంకుతుంటాయి. వారికి ప్రజల నుంచి సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కానీ, ప్రస్తుతం మోదీ చాలా శక్తిమంతంగా ఉన్నారు. అరెస్టైన విపక్ష నేతల పట్ల జనాలు సానుభూతి చూపే పరిస్థితి లేదు.

 
సోనియా, రాహుల్, థరూర్, రాబర్ట్‌లపైనా కేసులు
కశ్మీరీ నాయకులు నిర్బంధంలో ఉన్న సమయంలో చిదంబరం అరెస్టు జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉంది. మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికర వార్తలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో అవినీతి కేసుల్లో మరింత మంది విపక్ష నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

 
కాంగ్రెస్ నేతలు శశి థరూర్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా కేసులు ఎదుర్కొంటున్నవారే. సోనియా, రాహుల్‌లపై నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసు, రాబర్ట్ వాద్రాపై భూఅక్రమాల కేసు ఉన్నాయి. థరూర్ తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్యకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ అనుకూల మీడియా, ట్విటర్‌లో ఆ పార్టీ అనుకూల ఖాతాలు చేసే ప్రచారం, విచారణ సంస్థల అడుగులను జాగ్రత్తగా గమనిస్తే తదుపరి ఎవరిని వారు లక్ష్యంగా చేసుకోబోతున్నారన్నది తెలుసుకోవచ్చు.

 
ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాల గురించి వచ్చే వార్తల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీకి ఈ అరెస్టులు ఉపయోగపడతాయి. మొదట కశ్మీర్, ఇప్పుడు చిదంబరం.. ఇలా మరిన్ని అంశాలు తెరపైకి వస్తాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులపై చర్చ జరగకుండా, ప్రతిపక్షాలు ఎంత అవినీతిమయమో ప్రజలకు ప్రభుత్వం పదేపదే గుర్తుచేస్తుంది. కొన్ని రోజుల్లో చిదంబరం బెయిల్‌పై బయటకు వస్తారు. కానీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని ప్రజలకు గుర్తుచేసేందుకు, ప్రతిపక్ష నాయకులను భయపెట్టేందుకు మోదీకి ఈ అరెస్టు ఉపయోగపడుతుంది.

 
ప్రజాదరణ ఉన్న నాయకుడైతే వేరు
ప్రతిపక్ష నాయకులు ప్రజాదరణ కోల్పోయిన కొద్దీ, వారిని అరెస్టు చేయడం ప్రభుత్వానికి మరింత సులభమవుతుంది. చిదంబరం ఇందుకు మంచి ఉదాహరణ. సీనియర్ న్యాయవాదిగా, మంచి అడ్మినిస్ట్రేటర్‌గా ఆయనకు పేరుంది. కానీ, ఆయన జనాదరణ ఉన్న నాయకుడు కాదు. తమిళనాడులోని శివగంగ నుంచి 1985లో ఓసారి, 2009లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. డీఎంకే మద్దతుతో 2019లో ఆయన కుమారుడు కార్తీ పోటీ చేసి గెలిచారు.

 
దిల్లీ స్థాయిలోనే కాకుండా గల్లీ స్థాయిలోనూ చిదంబరం బలమైన నేత అయ్యుంటే, అరెస్టు విషయంలో ఆయనకు జనాదరణ ఓ కవచంలా పనిచేసేది. చిదంబరం అరెస్టు విషయంలో కాంగ్రెస్ ఇంకా మెరుగ్గా స్పందించాల్సింది. చిదంబరానికి తోడుగా సోనియా, రాహుల్ కూడా ఆ పాత్రికేయ సమావేశంలో పాల్గొనాల్సింది. ఇక అరెస్టు విషయంలోనూ అంత నాటకీయత లేకుండా, చిదంబరం అక్కడే అరెస్టుకు సహకరించాల్సింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలపాల్సింది. కానీ, చిదంబరం అరెస్టైనప్పుడు ఆయన నివాసం ముందు కేవలం కొంతమంది కార్యకర్తలే కెమెరాల ముందు నినాదాలు చేస్తూ కనిపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు