కరోనావైరస్: చైనాలో డెడ్లీ సండే, ఒక్క రోజే 97 మంది మృతి

సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (18:16 IST)
కరోనావైరస్‌తో చైనాలో ఆదివారం ఒక్క రోజే ఏకంగా 97 మంది మరణించారు. ఈ వైరస్ ప్రబలిన తరువాత ఒకే రోజు ఇంతమంది మృత్యువాతపడడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు మొత్తంగా చైనాలో 908 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆదివారం పెద్దసంఖ్యలో మరణాలు నమోదైనప్పటికీ వైరస్ సోకినవారి సంఖ్య పెరగలేదని అధికారులు చెబుతున్నారు.

 
చైనా వ్యాప్తంగా 40,171 మందికి ఈ వైరస్ సోకింది. వైరస్ సోకిందేమోనన్న అనుమానాలతో మొత్తం 1,87,518 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇక జపాన్ వద్ద సముద్ర జలాల్లో నిలిపివేసిన ఓ నౌకలో కొత్తగా మరో 60 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో అందులోని 3,700 మందిలో 130 మందికి ఈ వైరస్ సోకినట్లయింది.

 
డైమండ్ ప్రిన్సెస్ షిప్‌‌లో ప్రయాణించి హాంకాంగ్‌లో దిగిపోయిన ఓ ప్రయాణికుడికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆ నౌకను యోకహామా వద్ద రెండు వారాలు లంగరు వేసి నిలిపివేశారు. ఓడలో ఉన్నవారిలో వైరస్ సోకినవారిని ఓడ నుంచి బయటకు తెచ్చి సమీపంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చైనాలో కాకుండా బయట ప్రాంతంలో ఉన్న ఈ వైరస్ బాధితుల్లో మూడో వంతు మంది డైమండ్ ప్రిన్సెస్ నౌకలోనే ఉన్నారు.

 
రోజుకెంత మంది ఈ వైరస్ బారిన పడుతున్నారంటే..
కరోనా డేటా
చైనా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 3,281 మంది వైరస్ బాధితులు చికిత్స పొంది నయమయ్యాక ఆసుపత్రుల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. వైరస్ విస్తరిస్తుడడంతో చైనా నూతన సంవత్సరం సెలవులను పొడిగించారు. సెలవుల అనంతరం సోమవారం లక్షలాది మంది తమతమ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యారు.

 
అయితే, పనివేళల మార్పులు, కొన్ని వర్క్‌ప్లేసెస్‌నే తెరవడం, కొన్నిటిని ఇంకా తెరవకపోవడం వంటి ముందుజాగ్రత్త చర్యలు ఎప్పటిలానే చేపడుతున్నారు. ఆదివారం నాటికి కరోనా మృతుల సంఖ్య 2003 నాటి సార్స్ మృతుల సంఖ్య కంటే పెరిగింది. సార్స్ వైరస్ కూడా చైనాలోనే మొదలై 774 మందిని బలి తీసుకుంది.

 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదివారం సాయంత్రం సహాయ కార్యక్రమాల కోసం ఒక అంతర్జాతీయ బృందాన్ని పంపించింది. కరోనావైరస్ తొలుత చైనాలోని వుహాన్ నగరంలో ప్రబలింది. కోటీ పది లక్షల మంది జనాభా ఉన్న ఆ నగరంలో కొన్ని వారాలుగా ప్రజలను ఇళ్లు దాటి బయటకు రాకుండా ఉండాలని సూచించి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30న అంతర్జాతీయంగా వైద్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

 
కరోనావైరస్ సుమారు 27 దేశాలకు వ్యాపించింది. అయితే, చైనా బయట మాత్రం ఇంతవరకు రెండు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. హాంకాంగ్‌లో ఒకరు, ఫిలిప్పీన్స్‌లో మరొకరు ఈ వైరస్ వల్ల చనిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు