కరోనావైరస్: సెకండ్ వేవ్‌ను అడ్డుకోవడంలో భారత్ ఎలా విఫలమైంది?
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:07 IST)
దేశంలో కరోనా మహమ్మారి కథ ముగిసిందని భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ ఏడాది మార్చి మొదట్లో ప్రకటించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అంతర్జాతీయ సహకారంలో ప్రపంచానికి ఒక ఉదాహరణగా కూడా కొనియాడారు. గొప్పగా చెప్పుకున్న తమ టీకా దౌత్యంలో భాగంగా భారత్ జనవరి నుంచి టీకా డోసులను వివిధ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది.
రైలు వద్ద ప్రయాణికులు
సెప్టెంబర్ మధ్యలో రోజుకు సగటున 93 వేల కేసుల స్థాయి నుంచి ఫిబ్రవరి మధ్య నాటికి రోజుకు 11 వేలకు కరోనా కేసులు తగ్గిపోవడంతో హర్షవర్ధన్ ఆ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రోజువారీ మరణాల ఏడు రోజుల సగటు కూడా వంద కన్నా తగ్గింది. గత ఏడాది చివరి నుంచే అందరూ వైరస్‌ను ఓడించామనే ఆనందంలో మునిగితేలారు. రాజకీయ నాయకులు, అధికారులు, మీడియాలో కొన్నివర్గాలు భారత్ నిజంగా మహమ్మారి నుంచి బయటపడిందని భావించారు.
భారత్ కోవిడ్ కేసుల గ్రాఫ్‌ను వంచిందని, దానికి ఆధారాలు కూడా ఉన్నాయని డిసెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు. "ఆర్థికవ్యవస్థ సుదీర్ఘ శీతాకాలం చీకట్లను చీల్చుకుని, సూర్యుడి వెలుతురు దిశగా అడుగులు వేస్తోంది" అని కవితాత్మకంగా వర్ణించారు. ప్రధాని మోదీని 'వాక్సీన్ గురు'గా చెప్పుకున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి భారత ఎన్నికల సంఘం 824 స్థానాల్లో కోటీ 86 లక్షల మంది ఓటు వేయబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలను కూడా ప్రకటించింది. మార్చి 27న ప్రారంభమయ్యే ఈ ఎన్నికలు నెలపాటు సాగుతాయని చెప్పింది.
మాస్కులేకుండా ఓటర్లెందరో
ఇక, పశ్చిమ బెంగాల్ విషయానికే వస్తే, అక్కడ 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ రక్షణ ప్రొటోకాల్స్, సోషల్ డిస్టన్సింగ్ పాటించకుండా ప్రచారం జోరుగా సాగుతోంది. మార్చి మధ్యలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు చూడ్డానికి బీసీసీఐ లక్షా 30 వేలకు పైగా అభిమానులను స్టేడియంలోకి అనుమతించింది. వీరిలో చాలామంది మాస్కులు లేకుండానే గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు చూశారు.
నెలలోనే పరిస్థితులు తల్లకిందులయ్యాయి. భారత్ దారుణమైన కరోనా సెకండ్ వేవ్ గుప్పిట్లో చిక్కుకుంది. నగరాల్లో కొత్తగా లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ మధ్యకల్లా దేశంలో సగటున రోజుకు లక్ష కేసులు నమోదయ్యాయి. ఆదివారం(ఏప్రిల్ 18న) భారత్‌లో 2,70,000కి పైగా కొత్త కేసులు, 1600కు పైగా మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కరోనా గణాంకాల్లో ఈ రెండూ సరికొత్త రికార్డులు.
టెస్ట్ సరే... ఫలితం ఎప్పుడు?
కరోనా కేసులను సరిగా ట్రాక్ చేయకపోతే, జూన్ మొదటి వారానికి భారత్‌లో రోజుకు 2,300కు పైగా మరణాలు నమోదు కావచ్చని ది లాన్సెట్ కోవిడ్-19 కమిషన్ నివేదిక చెబుతోంది. భారత్ ఇప్పుడు ప్రజారోగ్య అత్యవసర స్థితి గుప్పిట్లో విలవిల్లాడుతోంది. కిక్కిరిసిన శ్మశానాల్లో కోవిడ్ మృతుల అంత్యక్రియలు, ఆస్పత్రుల బయట మృతదేహాల కోసం ఎదురుచూసే కుటుంబాలు, శ్వాస అందని రోగులతో ఆస్పత్రుల బయట నిలిచిన అంబులెన్సులు, శవాలతో నిండిన మార్చురీల వీడియోలతో సోషల్ మీడియా నిండిపోతోంది.
కొన్ని ఆస్పత్రుల్లోని కారిడార్లలో, వరండాల్లో ఒకే బెడ్ మీద ఇద్దరు రోగులు ఉండడం కూడా కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో పడకల కోసం, మందుల కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం, ముఖ్యంగా పరీక్షల చేయించుకోడానికి సాయం చేయాలంటూ ఎంతోమంది దీనంగా వేడుకుంటున్నారు. మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. పరీక్షల ఫలితాలు రావడానికి రోజులు పడుతోంది.
"నా బిడ్డ చనిపోయాడని వాళ్లు నాకు మూడు గంటలు చెప్పలేదు" అని ఒక వీడియోలో ఐసీయూ బయట కూర్చున్న ఒక తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. భారత్‌లో భారీ వ్యాక్సినేషన్ కోసం చేసిన కృషి కూడా ఇప్పుడు కష్టాల్లో పడింది. మొదట్లో స్వదేశీ తయారీ వ్యాక్సీన్ సామర్థ్యంపై వివాదం కూడా రేగింది. దేశంలో గత వారానికి 10 కోట్లకు పైగా డోసులు వేయగలిగినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో టీకా కొరత తీవ్రంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.
పిట్టల్లా రాలిపోతున్నారు
జూన్ లోపు తాము టీకా సరఫరాను పెంచలేమని ప్రపంచ అతిపెద్ద టీకా తయారీ సంస్థ, భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్ తేల్చి చెప్పింది. ఎందుకంటే దానికి తగ్గట్టు తన సామర్థ్యాన్ని విస్తరించడానికి అవసరమైన నిధులు ఆ సంస్థ దగ్గర లేవు. దేశంలో టీకా డోసులు అత్యవసరం కావడంతో, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సీన్ ఎగుమతుల మీద భారత్ తాత్కాలిక నిషేధం విధించింది. విదేశీ టీకాల దిగుమతులను కూడా అనుమతించింది.
దేశంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో, దానిని కూడా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు, దేశంలో కరోనా కష్టాలు, మరణాలకు దూరంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ప్రేక్షకులు లేకపోయినా ప్రతి సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇక, ఎన్నికల ర్యాలీల్లో కొన్ని వేల మంది తమ నేతలను అనుసరిస్తున్నారు. కుంభమేళాలో నదీ స్నానాలకు పోటెత్తుతున్నారు.
మందుల కోసం పరుగులు
"ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతోంది" అని సోషియాలజీ ప్రొఫెసర్ శివ విశ్వనాథన్ నాతో అన్నారు. భారత్‌లో తీవ్రంగా ఉన్న కరోనా సెకండ్‌వేవ్ విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాల్లో కొత్త కేసులు ఏడు రెట్లు పెరిగాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ తబస్సుమ్ బర్నాగర్‌వాలా గుర్తించారు. వాటిలో విదేశీ వేరియంట్లు ఉన్నాయేమో తెలుసుకోడానికి రోగుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారని కూడా రాశారు.
ఆ నెల చివరికల్లా కరోనా కేసులు పెరుగుతున్నట్లు బీబీసీ చెప్పింది. భారత్ మరో కోవిడ్ వేవ్‌ను ఎదుర్కోనుందా అని నిపుణులను అడిగింది. "కేసులు పెరగడానికి కారణం ఏంటో మాకు తెలీడం లేదు. అది మొత్తం కుటుంబంలో వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది పూర్తిగా కొత్త ట్రెండ్" అని మహారాష్ట్రలోని ఒక కరోనా ప్రభావిత జిల్లాలో సివిల్ సర్జన్ డాక్టర్ శ్యామసుందర్ నికమ్ చెప్పారు.
మాస్కులు ఏవీ
దేశంలోని యువ జనాభా, బలమైన రోగనిరోధక శక్తి, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల కరోనా మహమ్మారిని ఓడించామని, వైరస్ మీద విజయం సాధించామని భారత్ ముందే దండోరా వేసుకోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. "ముఖ్యంగా భారత్‌లో కనిపించే అధికారుల అహంకారం, హైపర్-నేషనలిజం, యంత్రాంగం అసమర్థత కూడా తగిన మోతాదులో ఉండడం వల్ల అవన్నీ కలగలిసి సంక్షోభాన్ని సృష్టించాయి" అని బ్లూంబర్క్ కాలమిస్ట్ మిహిర్ శర్మ చెప్పారు.
జనం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పెళ్లిళ్లకు, మిగతా కార్యక్రమాలకు హాజరవడం, రాజకీయ ర్యాలీలను, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చిన మిశ్రమ సందేశాల వల్ల కూడా భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్రమైంది. కేసుల తగ్గుతున్నప్పుడు చాలా తక్కువ మంది టీకాలు వేసుకున్నారు, జులై చివరి నాటికి 25 కోట్ల మందికి టీకా వేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ నెమ్మదించేలా చేశారు.
వాక్సిన్స్ వచ్చాయి కానీ...
"భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే, వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సి ఉంటుందని" మిచిగాన్ యూనివర్సిటీ బయోస్టాటిస్టీషియన్ భ్రమర్ ముఖర్జీ ఫిబ్రవరి మధ్యలోనే ట్వీట్ చేశారు. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దేశంలో కరోనాపై విజయం సాధించామనే ఫీలింగ్ ఉండిపోయిందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పి .శ్రీనాథ్ రెడ్డి అంటున్నారు.
"దేశంలో కొందరు మనం హెర్డ్ ఇమ్యూనిటీని సాధించామని అనుకున్నారు. అందరూ తిరిగి పనుల్లోకి వెళ్లాలనుకున్నారు. దానిని వినాలనుకునే చాలా మంది చెవుల్లో అది పడింది. కానీ, కొంతమంది చెప్పిన జాగ్రత్తలు మాత్రం వారికి వినిపించలేదు" అన్నారు. "సెకండ్ వేవ్ అనివార్యం కావచ్చు. కానీ, అది వాయిదా పడేలా, లేదంటే సెకండ్ వేవ్ ఆలస్యమై, దాని ప్రభావం తగ్గేలా భారత్ చేసుండచ్చు" అని ఫిజిక్స్, బయాలజీ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ అన్నారు.
కోవిడ్ పేషెంట్లతో అంబులెన్స్ బారులు
మిగతా చాలా దేశాల్లాగే వేరియంట్లను గుర్తించడానికి భారత్ జనవరిలోనే జీనోమ్ సర్వేలెన్స్ ప్రారంభించి ఉండాల్సిందని మీనన్ అభిప్రాయపడ్డారు. "ఆ వేరియంట్లలో కొన్ని కేసులు వేగంగా పెరగడానికి కారణమయ్యాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన నివేదికల ద్వారా మనకు కొత్త వేరియంట్ల గురించి ఫిబ్రవరిలోనే తెలిసాయి. అధికారులు వాటిని మొదట కొట్టిపారేశారు. అది ఒక ముఖ్యమైన మలుపు" అన్నారు మీనన్. అయితే, ఈ ప్రజారోగ్య సంక్షోభం నుంచి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి.
ఒకటి.. వైరస్ మీద విజయం సాధించినట్లు ముందే ప్రకటించకూడదని, గెలిచామనే వాదనను పక్కనపెట్టాలని భారత్ నేర్చుకోవాలి. భవిష్యత్తులో కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి స్థానికంగా చిన్న చిన్న లాక్‌డౌన్లు పెట్టినా, వాటికి అలవాటు పడడాన్ని జనం కూడా నేర్చుకోవాలి. చాలా మంది ఎపిడమాలజిస్టులు దేశంలో మరిన్ని వేవ్స్ రావచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే హెర్డ్ ఇమ్యూనిటీకి చేరుకోడానికి భారత్ ఇంకా చాలా దూరంలో ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ రేటు కూడా నెమ్మదిగా ఉంది.
ఇంత దారుణ స్థితిలోనూ విద్యార్థులకు పరీక్షలా?
"మనం మానవ జీవితం స్తంభించేలా ఆపేయలేం. రద్దీ నగరాల్లో శారీరక దూరం పాటించలేకపోతే, మనం కనీసం, ప్రతి ఒక్కరూ సరైన మాస్క్ వేసుకునేలా, దాన్ని సరిగా వేసుకునేలా అయినా చూసుకోవాలి. అది పెద్ద కోరికేం కాదు" అని ప్రొఫెసర్ రెడ్డి అంటున్నారు.