కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:53 IST)
కరోనావైరస్ కారణంగా ప్రపంచమంతా జనజీవనం స్తంభించినట్లు కనిపిస్తోంది. ఈ తరుణంలో ముంబయి మున్సిపాలిటీ తాజాగా ఒక ఉత్తర్వును జారీ చేసింది. కోవిడ్-19 సోకి చనిపోయిన వ్యక్తి ఏ మతం వారైనా సరే, శవాన్ని ఖననం చేయవద్దని, తప్పనిసరిగా దహనం చేయాలని అందులో పేర్కొన్నారు.

 
దాంతో, కరోనావైరస్ సంక్షోభం కాస్తా మతపరమైన మలుపు తీసుకుంది. ఆ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ఉత్తర్వును వెనక్కి తీసుకున్న అధికారులు, సవరణలు చేసి మళ్లీ విడుదల చేశారు. ఈ వివాదం నేపథ్యంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇవీ ఆ ప్రశ్నలు:

 
కోవిడ్ -19 బారినపడి ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు ఎలా చేయాలి?
వారి శవాలను ఖననం చేస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందా?
మృతదేహాలను దహనం చేస్తే ఈ వైరస్ పూర్తిగా అదృశ్యమవుతుందా?
ఇతర దేశాల్లో ఎలా చేస్తున్నారు?
అంత్యక్రియలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏం చెబుతోంది?

 
ఈ వివాదానికి కారణం ఏంటి?
కోవిడ్-19 బారినపడి మరణించే వారి అంత్యక్రియలకు సంబంధించి ముంబయి నగరపాలక సంస్థ కొన్ని నిబంధనలు పెట్టింది. కమిషనర్ ప్రవీణ్ పర్దేషి సంతకం చేసిన ఆ ఉత్తర్వులో ఇలా పేర్కొన్నారు... చనిపోయిన వ్యక్తి ఏ మతానికి చెందినవారైనా సరే ఖననం చేయకూడదు, దహనం చేయాలి. ఒకవేళ వారి బంధువులు ఖననం చేయాలని అనుకుంటే, వారు ముంబయి నగరం నుంచి బయటకు వెళ్లి చేసుకోవచ్చు. అంత్యక్రియలకు ఐదుగురికి మించి వెళ్లకూడదు.

 
ఈ ఆదేశాలు బయటకు వచ్చిన తర్వాత కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ కూడా ఆ నిబంధనలను తప్పుబట్టారు. దాంతో, స్పందించిన నగరపాలక సంస్థ ఆ ఉత్తర్వును సవరించింది. కరోనా బాధితుల మృతదేహాలకు తప్పనిసరిగా దహనం చేయాలనే నిబంధనను తొలగించింది. సమీప ప్రదేశాలకు వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కరోనా బాధితుల మృతదేహాన్ని విశాలంగా ఉండే శ్మశానవాటికలో ఖననం చేయాలనే నిబంధనను కొత్తగా చేర్చింది.

 
ప్రత్యేక నియమాలు ఎందుకు?
ప్రస్తుతానికి ప్రపంచమంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తోందని, ముంబయిలో కొత్తగా నిబంధనలు అక్కర్లేదని మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ బీబీసీతో చెప్పారు.

 
“కరోనా బాధితుల మృతదేహాలను తప్పనిసరిగా దహనమే చేయాలని ఆ సంస్థ ఎప్పుడూ చెప్పలేదు. ఈ ఉత్తర్వు గురించి కమిషనర్ ప్రవీణ్‌తో మాట్లాడాను. పొరపాటు జరిగిందని ఆయన చెప్పారు. దానిని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి. కాబట్టి, కొంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఎవరూ ప్రత్యేక ఆంక్షలు విధించూడదు” అని మంత్రి అన్నారు. ఈ వివాదం గురించి కమిషనర్ ప్రవీణ్‌ను సంప్రదించేందుకు చాలాసార్లు ప్రయత్నించాం, కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.

 
డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
కరోనా బాధితుల మృతదేహాలను దహనం మాత్రమే చేయాలని, ఖననం చేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జారీ చేసిన మార్గదర్శకాలలో ఎక్కడా పేర్కొనలేదు. కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనలు ఇలా ఉన్నాయి:

 
అంత్యక్రియల సమయంలో జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడొద్దు.
సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు ముగించేందుకు ప్రయత్నించాలి.
మతపరమైన ఆచారాల ప్రకారం, శవాన్ని దహనం లేదా ఖననం చేయాలి.
మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో వాలంటీర్ల సహాయం తీసుకోవాలి.
కరోనా బాధితుల మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు లేదా పరిచయస్తులెవరూ ముందుకు రాకపోతే, ఆ శవాన్ని దహనం చేయాలి.
మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు పొగ మరీ ఎక్కువగా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటుతో దహనం చేస్తే ఇంకా మంచిది.

 
శవాన్ని ఖననం చేస్తే వైరస్ వ్యాప్తి చెందుతుందా?
“మృతదేహాన్ని ఖననం చేస్తే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ, మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి” అని ముంబయిలోని జేజే హాస్పిటల్ డీన్, డాక్టర్ పల్లవి సపాలే చెప్పారు.

 
కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?
కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం, శవంలో కరోనావైరస్ ఎంతసేపు ఉంటుందన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. కాబట్టి, కరోనా బాధితుల మృతదేహాన్ని ప్రత్యేక కవర్‌ (బాడీ బ్యాగ్)లో చుట్టాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

 
కేంద్ర ప్రభుత్వం చేసిన మరికొన్ని సూచనలు ఇలా ఉన్నాయి:
కరోనా బాధితుల మృతదేహాన్ని బంధువులు దూరం నుంచి చూడాలి. శవాన్ని హత్తుకోకూడదు, దగ్గరగా వెళ్లకూడదు.
సాధ్యమైనంత వరకు శవపరీక్ష చేయకపోవడం మంచిది. అవసరమైతే అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
అంత్యక్రియలను మతపరమైన ఆచారాల ప్రకారం చేయవచ్చు. కానీ, మృతదేహంపై నీళ్లు పోయడం, శవానికి స్నానం చేయించడం లాంటివి చేయకూడదు. శవాగారాలలో మృతదేహాలకు దగ్గరగా పనిచేసే సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

 
ఇతర దేశాలలో ఏం చేస్తున్నారు?
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటు ఒక అత్యవసర బిల్లును ఆమోదించింది. ఆ బిల్లు ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది. కరోనావైరస్ సోకి చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో సాధ్యమైనంత వరకు అందరి మనోభావాలనూ ప్రభుత్వం గౌరవిస్తోందని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి.

 
తమకు ప్రత్యేక ఆచారాలు లేవని మృతుల కుటుంబ సభ్యులు అంగీకరిస్తే, మృతదేహాన్ని దహనం లేదా ఖననం చేస్తారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడైనా తన ప్రత్యేక హక్కులను ఉపయోగించుకునే వీలుంది. దహనం లేదా ఖననం మాత్రమే చేయాలని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దాంతో, ఈ చట్టం పట్ల బ్రిటన్‌లోని ముస్లింలు, యూదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 
అంత్యక్రియల విషయంలో మతపరమైన ఆచారాలను ప్రభుత్వం గౌరవించాలని బ్రిటన్‌లోని యూదు సంస్థ ప్రతినిధి వాన్ డెర్ జైల్ ప్రభుత్వాన్ని కోరారు. మతపరమైన మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బ్రిటన్ ముస్లిం కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది.

 
యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ కూడా ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. స్థానిక సంస్కృతి, మతాచారాల్లాంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడి, అందరినీ ఒప్పించి మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది.

 
ప్రస్తుతం కరోనావైరస్ సంక్షోభంతో ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 13 లక్షల మందికి కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 70 వేల మంది మరణించారు. భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 4,000 దాటిపోయింది.
 
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు