కరోనావైరస్: అంతా అల్బర్ట్ కామూ 'ది ప్లేగ్' నవలలో రాసినట్టే జరుగుతోందా?

గురువారం, 10 సెప్టెంబరు 2020 (14:25 IST)
మధ్యధరా సముద్ర తీర ప్రాంతమైన అల్జీరియాలో ఒరాన్ నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంది. అప్పట్లో అల్జీరియా ఫ్రెంచ్ వలస రాజ్యాల పాలనలో ఉండేది. ప్రజలు మృత్యుభయంతో వణికిపోతారు. ఈ భయంకరమైన అంటువ్యాధిని ఆ నగరంలోని ప్రజలు, ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటారన్నదే ఈ నవలలోని కథాంశం.

 
73 ఏళ్ల కిందట వచ్చిన ఈ నవల ప్రస్తుతం కరోనావైరస్ కాలంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఎంతోమంది ఈ పుస్తకాన్ని కొని చదువుతున్నారు. ప్రస్తుతం ఒరాన్ నగరంలో మొహమెద్ బుడియాఫ్ హాస్పిటల్‌లో కరోనావైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ సలాహ్ లేలౌ "చాలా అలిసిపోయానని" అంటున్నారు.

 
"కరోనావైరస్‌కు, కామూ రాసిన ది ప్లేగ్‌కు పోలికలున్నాయి. నవలలోలాగానే ఇప్పుడు కూడా అందరూ అధికారులను నిందిస్తున్నారు" అంటున్నారు ప్రొఫెసర్ సలాహ్ లేలౌ. క్షయ రోగ నిపుణులైన ప్రొఫెసర్ సలాహ్ లేలౌ రాత్రనక, పగనలక కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్నారు. "రోగులు చాలా ప్రమాద స్థితిలో ఆస్పత్రికి వస్తున్నారు. ఈ పరిస్థితుల వలన వాళ్లూ, మేమూ కూడా భయాందోళనకు గురవుతున్నాం. ఇప్పటికే కోవిడ్ 19 కేసులు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి" అని ప్రొఫెసర్ లేలౌ అంటున్నారు.

 
భయపెడుతున్న నవల
ఆఫ్రికా దేశాల్లో ఈజిప్ట్, దక్షిణ ఆఫ్రికా తరువాత అల్జీరియాలోనే అత్యధిక కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ 43,016 కోవిడ్ 19 కేసులు నమోదు కాగా 1,475 మరణాలు సంభవించాయి. ది ప్లేగ్ నవలలోని హీరో డాక్టర్ బెర్నార్డ్ రైయూ కన్నా ఎక్కువ వయసున్న డా. లైలౌ కూడా రైయూలాగే విధి నిర్వహణలో మునిగి తేలుతున్నారు.

 
"ఈ సమయంలో ది ప్లేగ్ నవలను తలుచుకోకుండా ఉండడం అసాధ్యం. ప్రస్తుత పరిస్థితులు, నవలలో ఆల్బర్ట్ కామూ చిత్రీకరించిన పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయి. ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. చాలా పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి" అని ఫ్రొఫెసర్ లేలౌ తెలిపారు. అల్జీరియా రాజధాని అల్జెర్స్‌లోని ఒక ఆస్పత్రిలో ఒక కోవిడ్ 19 రోగి చనిపోవడంతో అతని బంధువులు ఆ ఆస్పత్రి డైరెక్టర్‌ను ఆగ్రహంతో చుట్టుముట్టారు. వారినుంచీ తప్పించుకోవడానికి అతను ఆస్పత్రి రెండో అంతస్తునుంచీ దూకేసారు. కాళ్లకు, చేతులకు బలంగా దెబ్బలు తగిలాయి.

 
అల్జీరియాలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజలు యాజమాన్యాన్ని, అధికారులను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ది ప్లేగ్ నవలలో కూడా ఇలాగే జరుగుతుంది అని డా. లేలౌ అంటున్నారు. అలాగే, ది ప్లేగ్ నవలలో ఒక కేథలిక్ చర్చిలో క్రైస్తవ మతాధికారి ప్రసంగిస్తూ...ఇదంతా దైవలీల అనీ, మనం చేసిన పాపాల వల్లే ప్లేగు మహమ్మారి వ్యాపించదనీ చెప్తారు.

 
ప్రస్తుతం అల్జీరియాలో ఇస్లాం మతాధికారి అయిన షైక్ అబ్దెల్‌కాదెర్ హమౌయా కూడా "ఇది దైవ ఘటన అనీ, మానవుల కళ్లు తెరిపించడానికే దేవుడు ఇలాంటి మహమ్మారిని సృష్టించాడనీ" ఆన్లైన్ ప్రార్థనల్లో అన్నారు.

 
ఆగిపోయిన ఉద్యమం
హిరాక్ అంటే అరబిక్‌లో ఉద్యమం. అల్జీరియాలో శాంతియుతంగా హిరాక్ నిర్వహించి.. 20 యేళ్లుగా అధికారంలో ఉన్న దేశాధ్యక్షుడు అబ్దెలజీజ్ బౌటెఫ్లికాను 2019 ఏప్రిల్లో గద్దె దించారు. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి సరైన నాయకుడు లేడని ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంతో మాజీ ప్రధాని అబ్దెల్‌మద్జిద్ తెబౌనే దేశాధ్యక్షులయ్యారు.

 
హిరాక్‌కు మద్దతిస్తూ కొత్త అల్జీరియాను నిర్మించే ప్రయత్నంలో పూర్తి సహకారం అందిస్తానని తెబౌనే మాటిచ్చారు. కానీ అనుకున్న విధంగా ఉద్యోగావకాశాలు పెరగకపోవడంతో ఉద్రిక్తతలు నెలకొని, నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అనేకమంది నిరసనకారులను అదుపులోకి తీసుకుంది. "ది బ్లాక్ డికేడ్" గా పిలిచే 1990ల నాటి హింసాత్మక పరిస్థితులు మళ్లీ నెలకొంటాయేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

 
నిరసనలు ఉన్నత స్థాయికి చేరుకుంటున్న దశలో కరోనావైరస్ వ్యాపించడంతో హిరాక్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఏక్టివిస్ట్ అఫీఫ్ అదెర్‌రహమాన్ తెలిపారు. ఇప్పుడు అదెర్‌రహమాన్ ఆన్‌లైన్ కార్యక్రమాల ద్వారా కోవిడ్ 19 మహమ్మారి వలన ఆపదలో చిక్కుకున్నవారందరికీ సహయాసహకారాలు అందిస్తున్నారు.

 
"క్వారంటీన్‌లొ హిరాక్, దాతృత్వంగా రూపుదిద్దుకుందని" అదెర్‌రహమాన్ అన్నారు. ది ప్లేగ్ నవలలో జాన్ తరూలాగే అదెర్‌రహమాన్ కూడా క్వారంటీన్‌లో సహాయచర్యలు చేపట్టారు. అదెర్‌రహమాన్, జాన్ తరూకు ఆధునిక రూపం అనుకోవచ్చు.

 
ఫాసిజం, అణచివేత
కామూ ఈ నవలను రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాసారు. ఇందులో ఫ్రాన్స్‌పై నాజీల దురాక్రమణను సూచించే విధంగా ఎలుకలు రోగాన్ని మోసుకురావడాన్ని ప్రతిబింబించారని అంటారు. అప్పటి నియంతృత్వ పోకడలను కూడా ఈ నవలలో ప్రతిబింబించారని మరి కొన్ని వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి.

 
ఇదే తరహాలో అల్జీరియాలో నియంతృత్వ పోకడలతో ఎంతోమంది యాక్టివిస్టులను నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఇటీవలే ప్రముఖ జర్నలిస్ట్ ఖలీద్ ద్రరేనీ జాతీయ ఐక్యతను దెబ్బతీసే కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ మూడేళ్ల జైలుశిక్ష విధించారు.

 
కోవిడ్ 19 గురించీ, నిరసనల గురించీ ప్రచురిస్తున్న మూడు వెబ్‌సైట్లను ప్రభుత్వం వివాదాస్పద "ఫేక్ న్యూస్" చట్టం కింద మూసివేసింది. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు బలై యూఎస్ పారిపోయిన జర్నలిస్ట్ అబ్దెల్లా బెనదౌదా "కామూ నియంతృత్వం గురించి ఆలోచించారు కానీ దానితో పాటుగా అప్పట్లో విస్తరించిన ఉగ్రవాదం, ఇస్లామిజం అన్నీ మళ్లీ వెనక్కి వస్తాయేమోనని ప్రజలు భయపడుతున్నారు" అని అన్నారు.

 
ది ప్లేగ్ నవలలో జర్నలిస్ట్ రేమండ్ రాంబర్ట్‌కు అబ్దెల్లా బెనదౌదా ప్రతిరూపంలా కనబడుతున్నారు. ఇలాంటి మహమ్మారి విజృంభించినప్పుడే జనాల నిజరూపాలు బయటపడతాయని కామూ అంటాడు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది. అయితే ఈ నవల చివర్లో ప్లేగు కణాలు ఎప్పటికీ మాయమైపోవు, మరణించవు అని కామూ అంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్నొక హెచ్చరికలా భావించాలేమో!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు